గురువారం 02 ఏప్రిల్ 2020
Kamareddy - Feb 01, 2020 , 01:24:57

విద్యార్థులు ఒత్తిడికి గురికావద్దు

విద్యార్థులు ఒత్తిడికి గురికావద్దు

విద్యానగర్‌ : పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు ఒత్తిడి, ఆందోళనకు గురికావద్దని కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. జిల్లా కేంద్రంలోని తాహెర్‌ ఫంక్షన్‌ హాల్‌లో షెడ్యూల్‌ కులాల, వెనుకబడిన తరగతుల గిరిజన అభివృద్ధి శాఖల పదోతరగతి వసతి గృహ విద్యార్థులకు విజయస్ఫూర్తి పేరుతో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ హాజరై పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. విద్యార్థులు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని, చదువుకునే సమయంలో చక్కటి వాతావరణం ఉండేలా చూసుకోవాలన్నారు. విద్యార్థులు తమ ఎమోషన్స్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవాలని సూచించారు. మైండ్‌లో నుంచి నెగిటివ్‌ ఆలోచనలను తీసివేయాలన్నారు. విద్యార్థులు సెల్‌ఫోన్ల వాడకానికి దూరంగా ఉండాలని, అభ్యసనపై మాత్రమే దృష్టి సారించాలని సూచించారు. పదో తరగతి వార్షిక పరీక్షలకు 48 రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున ప్రణాళికబద్ధంగా చదివి మంచి మార్కులు సాధించాలన్నారు. గిరిజన శాఖ ఆధ్వర్యంలో బీసీ వసతి గృహ విద్యార్థులకు బుక్స్‌, జామెట్రీ బాక్స్‌, పరీక్ష అట్టలు, డిక్షనరీలను అందజేశారు. కార్యక్రమంలో బీసీ శాఖ సంక్షేమాధికారిణి ఝాన్సీ, జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి శ్రీనివాస్‌బాబు, గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి నివేదిత, కామారెడ్డి ఇన్‌చార్జ్‌ సహాయ సాంఘిక సంక్షేమ అధికారిణి విజయలక్ష్మి, సీనియర్‌ అసిస్టెంట్‌ రేవంత్‌, విద్యార్థులు పాల్గొన్నారు.


logo