సోమవారం 06 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 30, 2020 , 04:16:45

నిరుపేదలందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు

నిరుపేదలందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు

బాన్సువాడ రూరల్‌ : నిరుపేదలందరికీ విడతల వారీగా డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు అందజేస్తామని స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని కొయ్యగుట్టలో 30 డబుల్‌బెడ్‌రూం ఇండ్లతో పాటు మండలంలోని జక్కల్‌దాని తండాలో 15 డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలకు లబ్ధిదారులతో కలిసి బుధవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా జక్కల్‌దాని తండాలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు సీఎం కేసీఆర్‌ తీసుకోచ్చిన డబుల్‌బెడ్‌రూం పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో 3 లక్షలకుపైగా డబుల్‌బెడ్‌రూం ఇండ్లను మంజూరు చేశారని,  బాన్సువాడ నియోజకవర్గంలో 6 వేల డబుల్‌బెడ్‌రూం ఇండ్లు మంజూరు చేశారని చెప్పారు. ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో గూడులేని నిరుపేదలందరికీ గూడు కల్పించడం ప్రధాన సంకల్పమని తెలిపారు. 


లక్ష ఎకరాలకు సాగునీరందిస్తాం..

నిజాంసాగర్‌ ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో యాసంగిలో సాగు చేస్తున్న పంటలను కాపాడేందుకు అలీసాగర్‌ ప్రాజెక్టు నుంచి రివర్స్‌ పంపింగ్‌ ద్వారా నిజాంసాగర్‌ ప్రధాన కాలువ ద్వారా నీటిని విడుదల చేశామని తెలిపారు. తద్వారా అలీసాగర్‌, నిజాంసాగర్‌ నీటితో ఉమ్మడి జిల్లాలో సుమారు లక్ష ఎకరాలకు సాగు నీరు అందిస్తామని వివరించారు. అలీసాగర్‌ నుంచి చందూరు వరకు రివర్స్‌గా నిజాంసాగర్‌ ప్రధాన కాలువను నీటిని నింపుతున్నామని తెలిపారు. నిజాంసాగర్‌ ఆయకట్టు రైతులకు సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా రివర్స్‌ పంపింగ్‌ ద్వారా శ్రీరాంసాగర్‌ నింపి అక్కడి నుంచి అలీసాగర్‌ నీటితో నిజాంసాగర్‌లోకి కాళేశ్వరం నీటిని తీసుకువస్తామని వివరించారు. రూ. 150 కోట్లతో అలీసాగర్‌ వెనుక ఎత్తిపోతల పథకం, రూ. 100 కోట్లతో జాకోరా, చందూర్‌ ఎత్తిపోతల పథకాలు, మంజీరా నదిపై నాలుగు చెక్‌డ్యాముల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని తెలిపారు. 1986లో భూపంపిణీ కింద రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా జక్కల్‌దాని తండాకు చెందిన 27 కుటుంబాలకు ఎకరం చొప్పున భూమిని కొనుగోలు చేసి పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌, వైస్‌ చైర్మన్‌ జుబేర్‌, సర్పంచ్‌ సంగ్యానాయక్‌, ఎంపీటీసీ యశోద, తహసీల్ధార్‌ గంగాధర్‌, ఎంపీడీవో యావర్‌ హుస్సేన్‌ సూఫీ, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు దుద్దాల అంజిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మోహన్‌ నాయక్‌, కార్యదర్శి రాజేశ్వర్‌ గౌడ్‌, నాయకులు దొడ్ల వెంకట్రాంరెడ్డి, నార్ల సురేశ్‌గుప్తా, ఎర్వాల కృష్ణారెడ్డి, గోపాల్‌రెడ్డి, సంగ్రాంనాయక్‌, కొయ్యగుట్ట శ్రీధర్‌, హకీం, మోతీలాల్‌, నారాయణరెడ్డి, ప్రేంసింగ్‌, బన్సీనాయక్‌, శ్రీనివాస్‌రెడ్డి, చందర్‌, నాగేశ్‌, ఫర్హాత్‌ తదితరులు పాల్గొన్నారు. logo