శనివారం 04 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 30, 2020 , 04:14:02

‘శ్మశానం’లో కక్కుర్తి...!

‘శ్మశానం’లో కక్కుర్తి...!

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినప్పటికీ నేటికీ గ్రామాల్లో శ్మశాన వాటికలు అరకొరే. ప్రభుత్వాలు ఎన్ని మారినప్పటికీ మనిషి చి వరి ఘడియలకు అందుతున్న అంతిమ సంస్కారాలు బాధాకరం. రోడ్డుపై, పంట పొలాల్లో, కాలువ గట్ల పై మృతదేహాలను చితి పేరుస్తున్న   ఘటనలు అనే కం. ఇలాంటి దుస్థితికి చరమ గీతం పాడేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ గ్రామ పంచాయతీలో వైకుంఠధామం నిర్మాణానికి పూనుకుంది. దీంతో పాటుగా డంపింగ్‌ యార్డులను నిర్మించాల ని తలపెట్టింది. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగం గా వీటిని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశా లు ఇచ్చింది. ఇందుకోసం పుష్కలంగా ఆర్థిక వనరులను కల్పిస్తుండగా క్షేత్ర స్థాయిలో శ్మశాన వాటికల నిర్మాణాల్లో పైసల కోసం కొంతమంది కక్కుర్తి పడుతున్న పరిస్థితి ముక్కున వేలేసుకునేలా తయారైంది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో ఏపీవో రాజేందర్‌ అవినీతి ని రోధక శాఖ అధికారులకు లంచం తీసుకుంటూ ప ట్టుబడడం జిల్లాలోని పరిస్థితికి అద్దం పడుతున్నది.  ఉన్నతాధికారుల ఉదాసీనత, ఫిర్యాదులపై పట్టింపులేనితనం మూలంగా డంపింగ్‌ యార్డు, శ్మశాన వాటికల బిల్లుల మంజూరులో అధికారుల సతాయింపులు చాలా చోట్ల కొనసాగుతున్నట్లుగా తెలుస్తున్నది.


సామాజిక తనిఖీలు బుట్టదాఖలు...

ఒకవైపు సామాజిక తనిఖీల్లో అక్రమాలు బయటపడుతున్నాయి. మరోవైపు జరుగుతున్న పనుల్లో అవినీతి చోటు చేసుకుంటున్నది. నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట పడడం లేదు. ఇలా ఉపాధి హా మీ పథకంలో అక్రమాల పరంపర కొనసాగుతున్నది. వలసలను నిరోధించేందుకు, ఉన్న చోటే ఉపాధి కల్పించే లక్ష్యంగా అమలు చేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అక్రమార్కులకు వరంగా మారింది. జాతీయ గ్రా మీణ ఉపాధి హామీ పథకంలో పనుల పురోగతి, నాణ్యత, పరిమాణం విషయంలో జరిపిన సామాజిక తనిఖీల్లో అనేక అక్రమాలు జిల్లాలో వెలుగు చూశాయి. అధికారిక లెక్కల ప్రకారం 13 విడతల్లో 195 సామాజిక తనిఖీలు పూర్తయ్యాయి. వీటిలో రూ.2.68 కోట్లు దుర్వినియోగం అయినట్లుగా నిర్ధారణ జరిగింది. ఇందుకు గాను రూ. 1.59 కోట్లు రికవరీ చేయగా మిగిలిన రూ.1.08 కోట్లు రికవరీ చేసేందుకు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు. కామారెడ్డి జిల్లా ఏర్పడిన తర్వాత ఉపాధి హామీ సిబ్బంది నుంచి ఇప్పటి వరకూ రూ.78.45 లక్షలు రికవరీ చేశారు. ఇప్పటి వరకు నలుగురు వ్యక్తులపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు మాత్రమే నమోదు చేశారు. క్షేత్ర స్థాయిలో ఉపాధి హామీ పథకం అమలులో వెలుగు చూసిన డొల్లతనం, అక్రమాలపై 4,710 మందిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ ఈ విభాగంలో అక్రమాల తంతుకు అడ్డుకట్ట పడడం లేదు. సామాజిక తనిఖీల్లో వెలుగు చూస్తున్న అవినీతిపై ఉక్కుపాదం మోపడంలో అధికారులు శ్రద్ధ తీసుకోవడం లేదని స్పష్టంగా కనిపిస్తున్నది.  


ఆరు నెలల తర్వాత మరో కేసు...

ఏసీబీ కేసుల సంఖ్య క్రమంగా జిల్లాలో పెరుగుతు న్నది. గతేడాది జూన్‌ నెలలో పెద్ద కొడప్‌గల్‌ మండలంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ రైతు నుంచి డబ్బులు డిమాండ్‌ చేయడంతో రెవెన్యూ సిబ్బంది అడ్డంగా ఏసీబీకి చి క్కారు. సరిగ్గా ఆరు నెలలకు మరో కేసు మాచారెడ్డి మండలంలో వెలుగు చూడడం సంచలనం సృష్టిస్తున్నది. చాప కింద నీరులా అవినీతి, అక్రమాలు జిల్లాలో ఆయా శాఖల్లో విస్తృతంగా జరుగుతున్నప్పటికీ చర్యలు మాత్రం శూన్యమయ్యాయి. తూ తూ మంత్రంగా నోటీసులు, మెమోలు జారీ చేసి అధికారులు చేతులు దులుపుకొంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కఠిన చర్యలు లేకపోవడం తో సామాన్యులైతే ప్రభుత్వ కార్యాలయాల్లో పను ల కోసం తిప్పలు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. కలెక్టరేట్‌లో ఏసీబీ అధికారుల పేర్లు, వారి ఫోన్‌ నెంబర్లతో కూడిన పట్టికను కొంతమంది దుండగులు వాటిని తొలగించారు. గోడలపై ఉన్న ఫోన్‌ నెంబర్లను చెరిపేశారు. మహానుభావుల సూక్తులు అందరికీ కనిపించేలా రాసినప్పటికీ ఏసీబీ అధికారుల చిరునామాను తొలగించడం వెనుకున్న మర్మం ఏమిటో అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వ కార్యాలయాల్లో అక్రమార్కులెవరైనా డబ్బులు డిమాండ్‌ చేస్తే పౌరులు విధిగా అవినీతి నిరోధక శాఖ 94404-46155 నెంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చని ఏసీబీ అధికారులు కోరుతున్నారు.logo