సోమవారం 06 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 28, 2020 , 00:52:20

కాంగ్రెస్‌ అత్యుత్సాహం...!

కాంగ్రెస్‌ అత్యుత్సాహం...!

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఏడాది కాలంలో జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ ఘోరంగా దెబ్బతిన్నది. పీసీసీ సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ ఉన్నటువంటి జిల్లాలో ఎక్కడా హస్తం పార్టీ హవా కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ నాయకుడే ఘోరమైన ఓటమిని చవి చూశాడు. ఆ తర్వా త లోక్‌ సభ ఎన్నికల్లోనూ హస్తం పార్టీ అతలాకుతలమైంది. అంతేకాక సర్పంచ్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులే గెలుపొందారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎంపీటీసీ, జడ్పీటీసీలే జిల్లాలో ఎక్కువ మొత్తంలో గెలిచారు. జడ్పీ పీఠం కూడా టీఆర్‌ఎస్‌ కైవసం చే సుకోగా 22 మండలాల్లో మండల పరిషత్‌ పీఠాల ను అధిరోహించింది. ఇలా అన్ని ఎన్నికల్లో కారు వేగంగా దూసుకుపోతుంటే హస్తం విలవిల్లాడుతోంది. పీసీసీ నాయకుడి సొంత జిల్లాలో కాంగ్రెస్‌కు ఘోరమైన పరాభవం ఎదురవుతూనే ఉంది. చివరకు మున్సిపాలిటీల్లోనూ ఆ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. తాజాగా మెజార్టీ స్థానాలు లేకు న్నా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌ పర్సన్‌ పదవులకు నామినేషన్లు వేసి ఓటమి చెందింది. దీంతో టీఆర్‌ఎస్‌ చేతిలో వరుసగా పరువును పోగొట్టుకుని కాంగ్రెస్‌ పార్టీ అభాసుపాలవుతూనే ఉంది.

కాంగ్రెస్‌ ఆగమాగం...

రాష్ట్రంలో, జిల్లాలో వరుసగా ఓటమి పాలవుతున్న కాంగ్రెస్‌ పార్టీ ఆగమాగం అవుతున్నది. ఇటు సీనియర్‌ నేతలతో పాటుగా గల్లీ నేతలంతా ఏమి చే యాలో తోచక గందరగోళానికి గురవుతున్నారు. పీసీసీ పెద్దలు సైతం ప్రజల మద్దతును కోల్పోతున్న తరుణంలో కింది స్థాయి క్యాడర్‌ అంతా పక్క పా ర్టీల వైపునకు దృష్టి మళ్లిస్తున్నారు. పురపాలక సంఘం ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నారంటూ బాహాటంగానే డీసీసీ, పీసీసీ నేతలపై విమర్శలు చేసిన నాయకులంతా రెబల్స్‌గా గెలిచి టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. ఇలా దెబ్బ మీద దెబ్బ తింటోన్న హస్తం పార్టీకి సోమవారం మరో గట్టి దెబ్బ తగిలిం ది. కామారెడ్డి పట్టణం తమకు కంచుకోటగా భావిస్తున్న సమయంలో మెజార్టీ వార్డు స్థానాల్లో కారు దూసుకపోవడంతో స్థానిక పీసీసీ నేత షబ్బీర్‌ అలీ విస్తూపోవాల్సి వచ్చిందంటే అతిశయోక్తి కాదు. ఉ న్న క్యాడర్‌ను కాపాడుకోలేక, ఎన్నికల్లో గెలవలేక నేతలంతా తలోదారి చూసుకుంటున్నారు. కామారెడ్డిలో డీసీసీ అధ్యక్షుడి భార్యనే ఓటమి చెందగా, ఎల్లారెడ్డిలో మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి పరాజయం పాలయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బా న్సువాడలో ఎమ్మెల్యే అభ్యర్థిగా చెప్పుకునే వ్యక్తి వా ర్డు మెంబర్‌గా గెలిచి తొలిసమావేశానికే ముఖం చా టెయ్యడాన్ని ప్రజలంతా చర్చించుకుంటున్నారు.

షబ్బీర్‌ అలీ అత్యుత్సాహం...

కామారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూట కట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీ మూడు రోజులకే మరో ఓటమిని చవిచూసింది. మెజార్టీ లేకున్నప్పటికీ చైర్‌ పర్సన్‌, వైస్‌ ఛైర్‌ పర్సన్‌ ఎన్నికల బరిలో దిగి ఉన్న పరువును పోగొట్టుకుంది. ప్రజల ఆశీర్వాదంతో పుర పోరులో టీఆర్‌ఎస్‌కు 23 వార్డులు దక్కాయి. కాంగ్రెస్‌కు కేవలం 12 వార్డుల్లో, బీజేపీ 8 చోట్ల గెలిచింది. 6 చోట్ల స్వతంత్రులు గెలిచారు. ఇదిలా ఉండగా స్వతంత్రులంతా అధికార పార్టీకే జై కొట్టడంతో టీఆర్‌ఎస్‌కు కౌన్సిలర్ల బలం 29కి చేరింది. ఛైర్‌ పర్సన్‌, వైస్‌ ఛైర్‌ పర్సన్‌ ఎన్నికల్లో ఎక్స్‌ అఫిషియో సభ్యుడిగా  ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ఓటుతో 30 ఓట్లు ఉండటంతో టీఆర్‌ఎస్‌కు భారీ మెజార్టీ ఉందనేది కాదనలేని సత్యం. బలాబలాల ప్రకారం అధికార పార్టీ కే పుర పీఠం ఖాయమని అందరికీ తెలిసిందే. రాజకీయ నాయకులెవరైనా ఈ గణాంకాలను ఇట్టే అ ర్థం చేసుకుంటారు. అయితే, కామారెడ్డి మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌, వైస్‌ చైర్‌ పర్సన్‌ ఎన్నికల్లో పీసీసీ నేత షబ్బీర్‌ అలీ ఏదో చేయబోయి బొక్క బోర్లా పడా ల్సి వచ్చింది. చైర్‌పర్సన్‌గా పంపరి లతను, వైస్‌ చైర్‌ పర్సన్‌గా అన్వర్‌ అహ్మద్‌ సయ్యద్‌లతో నామినేషన్లు వేయించారు. తీరా ఎన్నికల్లో మెజార్టీ లేక  ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. బీజేపీ సభ్యు లు తటస్థంగా ఉండడం, స్వతంత్రులు ఆరుగురు టీఆర్‌ఎస్‌కే మద్దతు తెలపడంతో కాంగ్రెస్‌ మరోమారు ఓటమిని చవి చూడాల్సి రావడం పురపాలక సం ఘంలో తీవ్ర చర్చకు దారి తీయగా  షబ్బీర్‌ అలీ వ్యూహం బెడిసి కొట్టిందని అంతా కోడై కూశారు.


logo