శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 28, 2020 , 02:18:14

తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధం

తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధం

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : ఎస్సీ వర్గీకరణపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమని ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పిడమర్తి రవి అన్నారు. పాలకులతో దోస్తు కాదని, కుస్తీ పడితేనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మాదిగల పట్ల చూపుతున్న నిర్లక్ష ధోరణికి నిరసనగా వచ్చే నెల 8న మాదిగల సామూహిక ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజు రోజుకూ మాదిగల ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని అన్నారు. 25 ఏండ్లుగా మాదిగల ఉద్యమం కొనసాగుతున్నదని, వర్గీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాలు చేసి కేంద్రానికి పంపిందని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ వర్గీకరణపై నిర్లక్ష్యం చేస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో నిర్వహించిన సమగ్ర సర్వే ఆధారంగా దళితుల జనాభా 2014 నాటికి 17.6 శాతం ఉందని, ఆరేండ్లలో ఇంకా పెరిగిందన్నారు. తెలంగాణలో పెరిగిన జనాభా ఆధారంగా రిజర్వేషన్లు పెంచి, ఏబీసీడీలుగా వర్గీకరణ చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి మాదిగలు సామూహిక ఆమరణ దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. మాదిగ యువత పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు ఉపేందర్‌, నర్సింగ్‌ రావు, మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు గడ్డం సంపత్‌, దుబ్బాక శ్రీనివాస్‌, రాజు, కొత్తపల్లి నర్సింహులు, గ్యార కిషన్‌, శ్రీను, సాయిలు, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo