శనివారం 28 మార్చి 2020
Kamareddy - Jan 27, 2020 ,

పుర పీఠాలు.. ఏకగ్రీవాలు...!

పుర పీఠాలు.. ఏకగ్రీవాలు...!

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపాలిటీల్లో ప్రజలిచ్చిన అద్భుతమైన విజయంతో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఆనందోత్సవాలు రెట్టింపు అవుతున్నాయి. జిల్లాలోని మూడు పుర పీఠాలను టీఆర్‌ఎస్‌ పార్టీకే దక్కనుండడంతో చైర్మన్‌, డిప్యూటీ చైర్మన్‌ పీఠాలపై కూర్చోబెట్టే అభ్యర్థుల విషయమై అన్వేషణ తుది అంకానికి చేరుకుంది. కామారెడ్డి, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో ఎవరు చైర్మన్‌గా ఎన్నికవుతారనే విషయమై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్నది. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందరే వెలువర్చిన రిజర్వేషన్‌ ఆధారంగా మున్సిపాలిటీల్లో గెలుపొందిన కౌన్సిలర్లు ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటున్నా రు. వ్యూహాత్మకంగా ముందుకెళ్లి విజేతలుగా నిలిచినవారంతా ఇప్పుడు తమకు ఆ అవకాశాన్ని క ల్పించాలని పార్టీ అధిష్టానాన్ని, ఎమ్మెల్యేలను వే డుకుంటున్నారు. ఇందుకోసం విన్నపాలు పెట్టుకుంటున్నారు. కామారెడ్డి బల్దియా చైర్మన్‌ స్థానం జనరల్‌ మహిళకు రిజర్వు కాగా  బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీ చైర్మన్‌ పీఠాలకు బీసీ జనరల్‌ కేటాయించబడింది. బాన్సువాడకు చైర్మన్‌ అభ్యర్థి ఖరారు కావడంతో ఎల్లారెడ్డి, కామారెడ్డి మున్సిపాలిటీల్లోనే ఉత్కంఠ కొనసాగుతున్నది.  మెజార్టీ సీట్లు వచ్చినప్పటికీ క్యాంపులకు వెళ్లిన కౌన్సిలర్‌ అభ్యర్థులంతా ఎన్నిక సమయానికి కొం త సేపు ముందర మున్సిపాలిటీలకు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రణాళికను రూపొందించి వారిని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లినట్లు పార్టీలో చర్చ జరుగుతున్నది. ఎల్లారెడ్డి, కామారెడ్డిలో చైర్మన్‌, డిప్యూటీ చైర్మన్‌ అభ్యర్థుల పేర్లను స్థానిక ఎమ్మెల్యేలతో చర్చించి పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోనుంది. కాగా పేర్లను సీల్డ్‌ కవర్‌లో ముఖ్య నేతల ద్వారా పంపనుందని తెలుస్తున్నది. 

ఎక్స్‌-అఫిషియో సభ్యుల అవసరం లేకుండానే...

మున్సిపాలిటీల్లో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు సైతం సభ్యులుగా ఉంటారు. స్థానిక సంస్థ ల్లో ఎన్నికైన సభ్యులను కౌన్సిలర్లుగా పిలుస్తుండగా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను ఎక్స్‌-అఫీషియో సభ్యులుగా పిలుస్తారు. కౌన్సిలర్లతో సమానంగా వీరు మున్సిపాలిటీ పాలకవర్గ సమావేశంలో పాల్గొని వివిధ అంశాలను చర్చించే అవకాశం ఉంటుంది. మున్సిపల్‌ చైర్మన్‌, డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికతో పాటు పాలకవర్గంలో ఎప్పుడు ఓటింగ్‌ అవసరం వచ్చినా వీరికి ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఒక నియోజకవర్గ పరిధిలో ఒకటికి మించి మున్సిపాలిటీలు ఉంటే పాలకవర్గ ఎన్నికలు జరిగిన 30 రోజుల్లోగా తాము ఏ పురపాలక సంఘానికి ఎక్స్‌-అఫీషియో సభ్యులుగా కొనసాగాలని భావిస్తున్నారో అధికారులకు చెప్పా ల్సి ఉంటుంది. ఇందుకోసం సంబంధిత ప్రజా ప్రతినిధి రాతపూర్వకంగా పేర్కొనాల్సి ఉంటుంది. శాసన మండలి సభ్యులు సైతం ఇదే తరహాలో త మ పరిధిలోని ఏదో ఒక మున్సిపాలిటీలో ఎక్స్‌-అఫీషియో సభ్యునిగా కొనసాగేందుకు రాతపూర్వకంగా లేఖ ఇవ్వాల్సి ఉంటుంది. సాధారణంగా ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల ఓట్లు చైర్మన్‌, డిప్యూ టీ చైర్మన్‌ ఎన్నికల్లో కీలకంగా ఉపయోగపడతా యి. జిల్లాలో మ్యాజిక్‌ ఫిగర్‌ కంటే అత్యధికంగా కౌన్సిలర్‌ స్థానాలు టీఆర్‌ఎస్‌కే ఉండడంతో ఎక్స్‌-అఫీషియో ఓట్లు లేకున్నా ఏకగ్రీవంగానే టీ ఆర్‌ఎస్‌కు మూడు   పీఠాలు సులువుగా దక్కనుండడం ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది. 


logo