ఆదివారం 29 మార్చి 2020
Kamareddy - Jan 26, 2020 , 05:46:34

గులాబీ గూటికి స్వతంత్రులు !

గులాబీ గూటికి స్వతంత్రులు !
  • -ప్రభుత్వ విప్‌గంప గోవర్ధన్‌ సమక్షంలో చేరిక
  • -గెలిచిన వెంటనే ప్రభుత్వానికి మద్ధతు తెలిపిన ఆరుగురు కౌన్సిలర్లు
  • -రేపు కామారెడ్డి మున్సిపాలిటీ చైర్మన్‌, డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక
  • -టీఆర్‌ఎస్‌కు 29 మంది కౌన్సిలర్ల బలం,కాంగ్రెస్‌ 12, బీజేపీ 8 మంది


కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కామారెడ్డి మున్సిపాలిటీ పీఠంపై తెలంగాణ రాష్ట్ర సమితి జెండా ఎగురవేయనుంది. రేపు జరిగే చైర్మన్‌, డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక లాంఛనం కానుంది. ఉదయం 10.30 గంటలకు మొదలయ్యే ప్రత్యేక సమావేశంలో కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు మున్సిపల్‌ చైర్మన్‌, డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికను నిర్వహిస్తారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేయడంతో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. మొత్తం 49 వార్డులున్న కామారెడ్డి మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌కు 23 మంది కౌన్సిలర్ల బలం చేకూరింది. మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్న పార్టీగా టీఆర్‌ఎస్‌ నిలవగా ఎమ్మెల్యే గంప గోవర్దన్‌కు ఎక్స్‌ఆఫీషియో మెంబర్‌గా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. దీనికి తోడుగా ఆరుగురు ఇండిపెండెంట్‌ కౌన్సిలర్లు సైతం శనివారం సాయంత్రమే టీఆర్‌ఎస్‌ గూటికే చేరడంతో టీఆర్‌ఎస్‌ బలం  పెరిగింది.చైర్మన్‌ ఎన్నికలో ఓటింగ్‌ ప్రక్రియ జరిగితే ఎమ్మెల్యే ఓటుతో టీఆర్‌ఎస్‌కు 30 ఓట్లు ఉండడంతో ఎన్నిక లాంఛనమే కానుంది.

గులాబీ గూటికి స్వతంత్రులు...

ఉత్కంఠభరిత పోరులో స్వతంత్రులుగా గెలుపొందిన ఆరుగురు కౌన్సిలర్లు టీఆర్‌ఎస్‌ పార్టీ తీర్థం పు చ్చుకున్నారు. ఆయా పార్టీల్లో టికెట్లు ఆశించి భంగపడిన వారంతా స్వతంత్రులుగా నామినేషన్లు వేసి ప్రజా మద్దతుతో ఘన విజయం సాధించారు. విజయం సాధించిన వారంతా శనివారం సాయంత్రం ప్రభుత్వ విప్‌ గంప గోవర్దన్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. స్వతంత్రులుగా గెలుపొందిన ఆరుగురు కౌన్సిలర్ల నిర్ణయాన్ని స్వాగతిస్తూ గంప గోవర్దన్‌ వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన వారిలో 3వ వార్డు కౌన్సిలర్‌ పొదల్ల రాజు, 5వ వార్డు కౌన్సిలర్‌ కారంగుల అంజల్‌ రెడ్డి, 10 వ వార్డు కౌన్సిలర్‌ ఉరుదొండ వనిత, 22వ వార్డు కౌన్సిలర్‌ జహీరా బేగం, 40వ వార్డు కౌన్సిలర్‌ సాహెబ్‌ విజయ భాస్కర్‌ గౌడ్‌, 46వ వార్డు కౌన్సిలర్‌ కోయిల్కర్‌ కన్నయ్యలు ఉన్నారు.

5 స్థానాల నుంచి...

కామారెడ్డి మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ గెలుపు చారిత్రాత్మకంగా నిలుస్తున్నది. కామారెడ్డి బల్దియా ఏర్పాటు నుంచి నేటి వరకూ స్వతంత్రంగా టీఆర్‌ఎస్‌ పార్టీ జెండా ఎగురలేదు. రాజకీయ పునరేకీకరణలో కేసీఆర్‌ పిలుపును అందుకున్న ఆయా పార్టీలకు చెందిన నాయకులు టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలపడంతో గత పాలకవర్గం సభ్యులంతా గులాబీ పార్టీకి చేరారు. తాజా ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు భారీ స్థాయిలో సీట్లు రావడంతో ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు కంగుతింటున్నాయి. 2014 మున్సిపల్‌ ఎన్నికల్లో 33 వార్డులున్న కామారెడ్డి పురలో కాంగ్రెస్‌కు 17 వార్డులు, బీజేపీకి 8వార్డులు, టీఆర్‌ఎస్‌కు 5 వార్డులు మాత్రమే వచ్చాయి. సరిగ్గా ఆరేళ్ల కాలంలో పట్టణంలో చేసిన అభివృద్ధి, కేసీఆర్‌ ప్రభుత్వ పథకాల అమలుకు ముగ్ధులైన ప్రజలంతా ఏకపక్షంగా 2020 మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు భారీగా వార్డు స్థానాలను ఓటర్లు పట్టం కట్టారు. వార్డుల పునర్విభజనతో పెరిగిన కామారెడ్డి పురలో 49 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా టీఆర్‌ఎస్‌ గతం కంటే దాదాపుగా ఐదు రెట్లు ఎక్కువ వార్డులను కైవసం చేసు కుంది. కాంగ్రెస్‌ పార్టీ 12 వార్డులకు పతనమైంది. బీజేపీ 8 వార్డులతోనే సరిపెట్టుకోగా... ఆరు స్థానాల్లో గెలిచిన స్వతంత్రులు కూడా ఫలితాల రోజే టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరడంతో బల్దియాలో గులాబీ బలం 29కి చేరినట్లు అయ్యింది.logo