శనివారం 28 మార్చి 2020
Kamareddy - Jan 26, 2020 , 05:44:49

సగం ఓట్లు కారు గుర్తుకే...!

 సగం ఓట్లు కారు గుర్తుకే...!
  • -కేసీఆర్‌ పథకాలు, అభివృద్ధి పనులకు వెల్లువలా మద్దతు
  • -మూడు మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌కే గంపగుత్తగా ఓట్లు
  • -స్వతంత్రులతోనూ పోటీ పడలేక పోయిన బీజేపీ, కాంగ్రెస్‌
  • -జిల్లాలో ఎదురులేని శక్తిగా టీఆర్‌ఎస్‌
  • -ఖాతా తెరవని ఎంఐఎం.. టీడీపీ, సీపీఐ, సీపీఎం కనుమరుగు


కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కామారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. శాసనసభ, లోక్‌సభ స్థానాలకు తోడుగా సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను భారీగా కైవసం చేసుకుని జిల్లాకు గులాబీ కంచుకోటగా మారింది. ఈ దశలోనే పట్టణ పోరులోనూ స్పష్టమైన మెజార్టీ సాధించడంతో కామారెడ్డి కేరాఫ్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ మాదిరిగా మారిపోయింది. జిల్లాలో అత్యధిక మంది ఓటర్ల మద్ధతుతో మూడు మున్సిపాలిటీలు గులాబీ పార్టీపరం కావడంతో శ్రేణుల్లో నూతనుత్తేజం రెట్టింపు అవుతోంది. ఏ ఎన్నికైనా వార్‌ వన్‌ సైడే అన్నట్లుగా ప్రజలంతా తీర్పును ఇస్తుండడంతో గులాబీ సైన్యంలో ఆనందోత్సవాలు అంబరాన్ని తాకుతున్నాయి. పురపాలక సంఘాల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు అవలంభించిన వ్యూహాల వెనుక పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కృషి వెలకట్టలేనిది. పురపాలక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలకే పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. పోటీ తీవ్రంగా ఉన్న వార్డుల్లో ఆశావహులను బుజ్జగించే బాధ్యతను కూడా వారికే అప్పగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా మం త్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశాలు నిర్వహించి పురపాలికల ఎన్నికలకు పూర్తి స్థాయిలో దిశానిర్దేశనం చేశారు. జిల్లాలో ప్రభుత్వ విప్‌ గంప గోవర్దన్‌, ఎమ్మెల్యేలు జాజాల సురేందర్‌, హన్మంత్‌ షిండే, పోచారం భాస్కర్‌ రెడ్డిలు కీలకమైన భూమికను పోషించారు. పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, ప్రాదేశిక పోరులో అంతగా ప్రభావం చూపకపోవడంతో అయోమయంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి పుర ఫలితాలు మరింతగా కుంగదీశాయి. ఇప్పటికే పీసీసీ సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ కనీసం పరువు నిలబెట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆశించినంతగా ఫలితాలు రాకపోవడం శోచనీయం. మైనార్టీల్లో ప్రత్యేక ఓటు బ్యాంకు ఏర్పాటు చేసుకోవడం మూలంగా ఆయా స్థానాల్లో కాసింతగా పోటీనిచ్చినప్పటికీ టీఆర్‌ఎస్‌ దూకుడు ముందు హస్తం కకావికలమైంది.

కారు గుర్తుకే సగం ఓట్లు...

కామారెడ్డి జిల్లాలో జరిగిన మూడు మున్సిపాలిటీ ఎన్నికల్లో మొత్తం 1,17,354 మంది ఓటర్లున్నారు. ఇందులో 22వ తారీఖున జరిగిన పోలింగ్‌లో 82,656 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటేసిన వారిలో కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డిలో టీఆర్‌ఎస్‌ పార్టీకి సగం మంది కారు గుర్తుకే మద్ధతు తెలిపినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పోలైన ఓట్లలో దాదాపుగా 44.55 శాతం మంది టీఆర్‌ఎస్‌కు మద్ధతు తెలిపారు. కాంగ్రెస్‌కు 26 శాతం మంది ఓట్లేశారు. బీజేపీకి 12శాతం మంది మాత్రమే ఓట్లేశారు. భారతీయ జనతా పార్టీకి పడిన ఓట్ల శాతం విలువ స్వతంత్రులకు పడిన ఓట్ల శాతంతో పోలిస్తే తక్కువ కావడం విశేషం. కామారెడ్డి మున్సిపాలిటీలో స్వతంత్రులకు 10,383 మంది ఓట్లెయ్యగా బీజేపీకి కేవలం 9,495 మంది ఓట్లేశారు. అత్యధికంగా టీఆర్‌ఎస్‌కు 23,200 మంది ఓటర్లు మద్ధతు తెలిపారు. బాన్సువాడలో బీజేపీ ఒక్క వార్డును గెలుచుకోలేక పోయింది. 19 వార్డుల్లో పదుల సంఖ్యలోనే ఓట్లు పడ్డాయి. ఇక్కడ టీఆర్‌ఎస్‌కు 8,692 ఓట్లు, కాంగ్రెస్‌కు 3,973 ఓట్లు నమోదు అయ్యాయి. ఎల్లారెడ్డిలో టీఆర్‌ఎస్‌కు 4,938 ఓట్లు, కాంగ్రెస్‌కు 3,472 ఓట్లు, బీజేపీకి 356 ఓట్లు పడ్డాయి. ఎల్లారెడ్డిలో స్వతంత్రులకు 927 ఓట్లేశారు.

ఖాతా తెరవని ఎంఐఎం...

జిల్లా వ్యాప్తంగా జరిగిన పురపాలక ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ మొత్తం 9 స్థానాల్లో పోటీ చేసింది. కామారెడ్డిలో ఆరు వార్డుల్లో నిలబడగా ఒక్కటీ గెలుచుకోలేక పోయింది. బాన్సువాడలో 3 స్థానా ల్లో బరిలో నిలిచినా ఒక్క స్థానంలోనూ కనీసం ప్రభావం చూపలేకపోయింది. ఎల్లారెడ్డిలో ఎంఐ ఎం పార్టీ పోటీకి దూరంగా ఉంది. ఇక టీడీపీ, సీపీఐ, సీపీఎం పార్టీలు అక్కడక్కడ పోటీకి నిలబడినప్పటికీ ఎక్కడా పది ఓట్ల ను సంపాదించకలేక పోయింది. మొ త్తానికి పురపాలక ఎన్నికలతో ఆం ధ్రా పార్టీ టీడీపీ పూర్తిగా కనుమరుగైందని రుజువైంది. సీపీఐ, సీపీఎం పార్టీలకు గత మున్సిపల్‌ పోరులో కామారెడ్డిలో ఒక సీటు వచ్చినప్పటికీ ఈసారి ఆ ఒక్కటీ చేజారింది. బల్దియా ఎన్నికల్లోనూ ఆయా పట్టణాల్లో తమ పట్టును నిలబెట్టుకుని ప్రతిపక్ష పార్టీలకు గులాబీ పార్టీ తగిన బుద్ధి చెప్పింది. పట్టణ ఓటర్ల ఆదరణ తమకు ఉన్నందున పురపాలికల ఎన్నికల్లో సునాయాసంగా విజయాన్ని సాధించింది. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో సత్తా చాటి సోమవారం రోజున బల్దియాపై గులాబీ జెండాను ఎగురవేయనుంది. మున్సిపాలిటీల్లో 50 శాతం రిజర్వేషన్‌ మూలంగా మగువలకే అందలం దక్కింది. ఫలితంగా వారి ప్రాతినిధ్యం అమాంతం పెరగనుంది. పంచాయతీ, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌లో 50శాతం మహిళలు ఇప్పటికే కొలువు దీరారు. ఇక బల్దియాల్లోనూ నారీమణుల హవా కొనసాగనుంది.


logo