బుధవారం 08 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 25, 2020 , 01:47:35

బాక్సులోని భవితవ్యం తేలేది నేడే..!

బాక్సులోని భవితవ్యం తేలేది నేడే..!
  • - మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం
  • - ఉదయం 8గంటలకు ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు
  • - మొదట పోస్టల్‌ బ్యాలెట్‌,ఆ తర్వాత పేపర్‌ బ్యాలెట్‌
  • - కామారెడ్డి 43,బాన్సువాడ 12, ఎల్లారెడ్డి 8 టేబుళ్లు ఏర్పాటు
  • - కౌంటింగ్‌ విధుల్లో మొత్తం 207 మంది సిబ్బంది
  • - ప్రతీ టేబుల్‌కు ఒక పర్యవేక్షకుడు, ఇద్దరు సహాయకులు

పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో పోటీ చేసిన 360 మంది అభ్యర్థుల భవితవ్యం నేటి మధ్యాహ్నం లోపు తేలిపోనుంది. అంచనాలు, ఊహాగానాలకు తెరదించే బ్యాలెట్‌ బాక్సులు తెరవడానికి అధికార యంత్రాంగం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడుతారు. పుర పోరులో టెండర్‌ ఓటుతో కామారెడ్డి 41 వార్డులో రీపోలింగ్‌ జరిగినందున అధికారులు అప్రమత్తం అయ్యారు. ఓట్ల లెక్కింపులో లోపాలు జరుగకుండా సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణను ఇచ్చారు. ఎక్కడా కూడా పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలకు ఆయా పట్టణ కేంద్రాల్లోనే ఏర్పాట్లు చేశారు. కామారెడ్డి మున్సిపల్‌ ఓట్ల లెక్కింపును అడ్లూర్‌ శివారులోని ఏఎంసీ గోదాం, బాన్సువాడ ఓట్ల లెక్కింపును ఎస్‌ఆర్‌ఎన్‌కే డిగ్రీ కాలేజీ, ఎల్లారెడ్డి ఓట్ల లెక్కింపును మోడల్‌ డిగ్రీ కళాశాలలో నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే స్ట్రాంగ్‌ రూమ్‌లకు పోలీసులతో మూడు అంచెల భద్రత కల్పించారు.
- కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో మొత్తం 80 వార్డులున్నాయి. ఇందులో బాన్సువాడలో 4వ వార్డు ఒకటి ఏకగ్రీవం కాగా 79 వార్డులకు ఈ నెల 22న ఎన్నికలు జరిగాయి. కామారెడ్డిలోని 41వ వార్డు 101 పోలింగ్‌ బూ త్‌లో 24న రీపోలింగ్‌ నిర్వహించారు. ఓటర్లు తమ వార్డు సభ్యుడు ఎవరు కావాలన్న ఫలితాన్ని బ్యాలెట్‌ బాక్సుల్లో ఉంచారు. వీటిని లెక్కించే ప్ర క్రియ నేడు ఉదయం 8గంటలకు ప్రారంభం కా నుంది. మొదట ఒక్కో వార్డుకు ఒక్కో టేబుల్‌ను ఏర్పాటు చేయనున్నారు. మూడు మున్సిపాలిటీల్లోనూ ఒక్కో వార్డులో గరిష్టంగా మొత్తం ఓట్ల సంఖ్య 2వేలు కూడా దాటకపోవడం మూలంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ రెండు రౌండ్లలోనే పూర్తి కానుంది. ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీల ఫలితాలు మొదటి మూడు గంటల్లోనే తేలిపోనుం ది. కామారెడ్డిలో 49 వార్డులు ఉన్నందున ఫలితాలు కాసింత ఆలస్యం అయ్యే వీలుంది. కౌం టింగ్‌, ఫలితాల వెల్లడి సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు లెక్కింపు కేంద్రాల వద్ద మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఆయా పార్టీల అభ్యర్థులకు, వారు నియమించుకున్న ఏ జెంట్లకు ఎన్నికల సంఘం ద్వారా గుర్తింపు కార్డులను జారీ చేశారు. ఇతరులను లోనికి అనుమతిఇవ్వకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఒక రౌండ్‌కు వేయి ఓట్లు...

ఓట్ల లెక్కింపు కోసం మూడు మున్సిపాలిటీల్లో వేర్వేరుగా ఏర్పాట్లు చేస్తున్నారు. కామారెడ్డిలో 43 టేబుళ్లు, బాన్సువాడలో 12 టేబుళ్లు, ఎల్లారెడ్డిలో 8 టేబుళ్లు చొప్పున ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌కు ఒక పర్యవేక్షకుడు, ఇద్దరు కౌంటింగ్‌ సహాయకులు, ఒక మైక్రో అబ్జర్వర్‌ ఉంటారు. మొదట ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే బ్యాలెట్‌ ఓట్లను రిటర్నింగ్‌ అధికారులు లెక్కిస్తారు. అనంతరం ఒక పోలింగ్‌ కేంద్రానికి సంబంధించిన పేపర్‌ బ్యాలెట్‌ బాక్సును తెప్పించి అందులో పీవో డైరీ, బ్యాలెట్‌ పేపర్‌ అకౌంట్‌, పేపర్‌ సీల్‌ అకౌంట్‌ వివరాలను కౌంటింగ్‌ ఏజెంట్లకు చూపిస్తారు. పోలైన ఓట్లు, నమోదైన ఓట్ల వివరాలను సరిపోల్చుకుంటారు. అనంతరం బ్యాలెట్‌ బాక్సును తెరిచి అం దులోని ఓట్లన్నింటినీ ఒక డ్రమ్‌లో వేస్తారు. అం దులో నుంచి 25 ఓట్ల చొప్పున కట్టలు కట్టి ప క్కన పెడతారు. అనంతరం అదే వార్డుకు చెందిన రెండో పోలింగ్‌ కేంద్రం బ్యాలెట్‌ బాక్సును తెప్పిం చి ఓట్లను డ్రమ్‌లో వేసి 25 బ్యాలెట్‌ పేపర్లను కట్టలు కట్టి ఒక బాక్సులో వేస్తారు. అనంతరం ఓట్లను తెరిచి ఏజెంట్లకు చూపిస్తూ ఆయా గుర్తులకు పడిన ఓట్లను వేర్వేరుగా బాక్సులో వేస్తారు. ఇలా 40 కట్టలను ఒకసారి పరిగణలోకి తీసుకుని ఓట్ల లెక్కింపు చేపడతారు. వెయ్యి ఓట్లకు ఒక రౌండ్‌గా పరిగణించి లెక్కింపు పూర్తి చేస్తారు. మిగిలిన ఓట్లు ఉంటే అన్నింటిని ఒక బాక్సులో వేసి లెక్కింపు చేపడతారు. బ్యాలెట్‌ పేపర్‌లో పార్టీ గుర్తులపై ఓటరు వేసిన స్వస్తిక్‌ గుర్తు సరిగా పడని వాటిని పక్కన పెడతారు. అనుమానంగా ఉన్న ఓట్లను రిటర్నింగ్‌ అధికారి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత చెల్లని ఓట్లుగా గుర్తించి ఒక బాక్సులో భద్రపరుస్తారు. ఇలా అన్నింటినీ లెక్కించి ఎవరికి ఎక్కవ ఓట్లు వస్తే వారిని విజేతగా ప్రకటిస్తారు.

అక్కడికక్కడే నోటీసులు అందజేత...

ఓట్ల లెక్కింపు పూర్తవ్వగానే గెలిచిన వార్డు సభ్యులకు అదే రోజు నోటీసులు అందజేసేందుకు ము న్సిపాలిటీ కమిషనర్లు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల్లో 27వ తేదీ నాడు కౌన్సి ల్‌ ప్రత్యేక భేటీ నిర్వహించాలని ఉంది. ఎస్‌ఈసీ ఆదేశాల నేపథ్యంలో కౌంటింగ్‌ హాలులోనే విజేతలకు మున్సిపాలిటీ పాలక మండలి తొలి సమావేశానికి హాజరవ్వాల్సిందిగా నోటీసులు అందిస్తారు. సోమవారం ఉదయం 11గంటలకు వార్డు సభ్యులుగా ప్రమాణ స్వీకారానికి నోటీసుల ద్వారానే స మాచారాన్ని అందించనున్నారు. చైర్మన్‌, డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక ఉంటుందని అందులో పేర్కొంటారు.
మధ్యాహ్నం 12.30 గంటలకు చైర్మన్‌ ఆ తర్వాత డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక నిర్వహిస్తారు. రెండు పదవులకు ఒకే నామినేషన్‌ వస్తే ఎన్నికను ఏకగ్రీవం చేస్తారు. పోటీ ఉంటే చేతులు ఎత్తి ఎన్నుకునే పద్ధతిని అవలంబిస్తారు. కోరం సభ్యులు ఉంటేనే పట్టణ ప్రథమ పౌరుడి ఎన్నిక లాంఛనంగా జరుగుతుంది. లేదంటే మరుసటి రోజు వచ్చిన సభ్యులతోనే పాలక మండలి సారథుల ఎన్నికను పూర్తి చేస్తారు. ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించనున్నారు. వార్డు సభ్యులు, ఎక్స్‌ఆఫిషియో సభ్యులను కలిపి కోరం నిర్ణయిస్తారు. ఎక్స్‌ఆఫిషియో సభ్యులకు ఓటు వేసుకునే అవకాశం ఉంటుంది. వార్డును గెలిచిన ఒకరిని పార్టీ విప్‌గా నిర్ణయించుకునే అధికారం ఉంటుంది. పార్టీ విప్‌ను ధిక్కరిస్తే అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది.

ఎవరి అంచనాలు వారివే...

పుర ఎన్నికలు పూర్తవ్వడంతోనే పోటీలో నిలిచిన అభ్యర్థులంతా ఎవరికి వారు అంచనాల్లో మునిగిపోయారు. ఆయా సామాజిక వర్గాల వారీగా త మకు కలిసి వచ్చే ఓట్ల సంఖ్యను బేరీజు వేసుకుం టూ ముందస్తుగానే గెలుపోటములపై ఓ స్పష్టత కు వచ్చారు. ఎక్కడ తమకు అనుకూలించింది? ఎక్కడ ఎదురు దెబ్బ తగిలిందన్న అంచనాల్లో అ భ్యర్థులు ఇప్పటికే సిద్ధమైపోయారు. ఓట్ల లెక్కింపునకు సమయం ఆసన్నం కావడంతో గెలుపోటములపై అభ్యర్థుల్లో గుబులు రేపుతున్నది. ఓ వైపు పోలింగ్‌ శాతం పలు చోట్ల తక్కువగా నమోదు కా గా మరోవైపు పోలైన ఓట్లలోనూ ఎన్ని చెల్లకుండా పోతాయనేది అభ్యర్థులను వేధిస్తున్నది.ఎందుకం టే ఈవీఎంలలో చెల్లని ఓట్లంటూ ఉండవు. ప్ర స్తుతం బ్యాలెట్‌ పద్ధతిన ఎన్నికలు కావడంతో చా లా వరకు ఓట్లు చెల్లకుండా పోయే అవకాశాలు ఎక్కువ. అభ్యర్థుల సంఖ్య పలువార్డుల్లో ఎక్కువ గా ఉండడం, నోటా గుర్తు కూడా ముద్రితమై ఉం డడంతో ఓటర్లు ఏ గుర్తుపై స్వస్తిక్‌ గు ర్తును వే శారనేది ఓట్లలెక్కింపు తర్వాతే తేటతెల్లం కానుంది.



logo