ఆదివారం 29 మార్చి 2020
Kamareddy - Jan 25, 2020 , 01:43:34

కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

కౌంటింగ్‌కు సర్వం సిద్ధం


పురపోరు ఉత్కంఠకు నేటితో తెరపడనుంది.  నేడు నిర్వహించిన ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కామారెడ్డి మున్సిపల్‌ ఓట్ల లెక్కింపును అడ్లూర్‌ శివారులోని ఏఎంసీ గోదాం, బాన్సువాడ ఓట్ల లెక్కింపును ఎస్‌ఆర్‌ఎన్‌కే డిగ్రీ కాలేజీ, ఎల్లారెడ్డి ఓట్ల లెక్కింపును మోడల్‌ డిగ్రీ కళాశాలలో నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేశారు.  శుక్రవారం అధికారులు ఏర్పాట్లను అధికారులు పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు.

రెండు రౌండ్లలోనే తేలనున్నఫలితాలు

బాన్సువాడ, నసమ్తే తెలంగాణ: బాన్సువాడలోని ఎస్‌ఆర్‌ఎన్‌కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వంసిద్ధం చేశారు. కౌంటింగ్‌లో మొదటగా ఒకటో వార్డు నుంచి 13వ వార్డు వరకు మొదటి రౌండ్‌లో ఓట్ల లెక్కింపు జరగనుంది. 13వ వార్డు నుంచి 19వ వార్డు వరకు రెండో రౌండ్‌లో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. వెయ్యి ఓట్లు వరకు ఉన్న వార్డుల ఫలితాల వెల్లడి మొదటి రౌండ్‌లోనే పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్‌ ను ప్రారంభిస్తున్నట్లు ఆర్డీవో రాజేశ్వర్‌ తెలిపారు. రెండు హాళ్లలో ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రతి హాల్‌లో 12టేబుల్స్‌పై ఓట్ల లెక్కింపు జరుగు తుందని తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద 150 మంది పోలీస్‌ సిబ్బందితో బందోబస్తు కొనసాగుతుందని, పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని డీఎస్పీ దామోదర్‌ రెడ్డి తెలిపారు. 

కౌంటింగ్‌పై అధికారులతో ఆర్డీవో సమీక్ష

బాన్సువాడ మున్సిపల్‌ ఎన్నికల లెక్కింపు పకడ్బందీగా జరిగేలా అధికారులు కృషి చేయాలని బాన్సువాడ ఆర్డీవో రాజేశ్వర్‌ రిటర్నింగ్‌ అధికారులకు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులకు, సహాయ సిబ్బందికి సూచించారు. శుక్రవారం ఆయన ఎస్‌ఆర్‌ఎన్‌కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రంలో కౌంటింగ్‌ సిబ్బందితో సమీక్షించారు. కౌంటింగ్‌ సందర్భంగా సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఆయన వెంట బాన్సువాడ తహసీల్దార్‌ గంగాధర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ కుమారస్వామి, ఎంపీడీవో సూఫీ, బిచ్కుంద ఎంపీడీవో పర్బన్న, సిబ్బంది తదితరులు ఉన్నారు.
logo