మంగళవారం 31 మార్చి 2020
Kamareddy - Jan 24, 2020 , 02:01:29

ఎరువుల విక్రయాల్లో మాయాజాలం

ఎరువుల విక్రయాల్లో మాయాజాలం
  • -ఆధార్‌ వివరాలు నమోదు చేయకుండానే ఎరువుల విక్రయాలు
  • -మూలన పడిన ఈ -పాస్‌ మిషన్లు

ఎరువుల విక్రయాలు పారదర్శకంగా చేపట్టేందుకు, రాయితీ దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ  పాస్‌ మిషన్ల ప్రక్రియలోనూ వ్యాపారులు బిల్లుల మాయాజాలానికి పాల్పడుతున్నారు. ఎరువుల కోసం వచ్చిన రైతు ఆధార్‌ వివరాలు ఈ-పాస్‌ మిషన్‌లో నమోదు చేసి ఎరువులు విక్రయించాలి. కానీ, వ్యాపారులు అవేవీ లేకుండానే ఎరువులను ఇష్టం వచ్చినట్టుగా విక్రయించి బిల్లులు తయారు చేస్తున్నారు. ఎరువులు కొనుగోలు చేసిన రైతులకు కనీసం బిల్లులు సైతం అందించడం లేదు. ఈ-పాస్‌ మిషన్లు అందించి రెండు సంవత్సరాలు కావస్తున్నా.. ఏ ఒక్క వ్యాపారి వాటిని వినియోగించిన దాఖలాలు లేవు. దుకాణాల్లో స్టాకు వివరాలు, ధరల వివరాలు  సైతం రాసి పెట్టకపోవడంతో వ్యాపారులు చెప్పిన ధరలకే రైతులు కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి ఈ-పాస్‌ విధానం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు
 కోరుతున్నారు.- లింగంపేట విలేకరి

లింగంపేట : ఎరువుల విక్రయాల్లో వ్యాపారులు అక్రమాలకు పాల్పడకుండా రైతులకు ఎరువులు అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ -పాస్‌ మిషన్లు అందించింది. కానీ వ్యాపారులు వాటిని వినియోగించకుండానే ఎరువులను విక్రయిస్తున్నారు. ఎరువుల కోసం వచ్చిన రైతు నుంచి ఆధార్‌ వివరాలు నమోదు చేసుకుని ఈ-పాస్‌ మిషన్‌లో వివరాలు నమోదు చేయాల్సి ఉండగా& అవేమీ పట్టించుకోకుండా ఎరువుల విక్రయాలు కొనసాగిస్తున్నారు. ఈ-పాస్‌ మిషన్‌ ద్వారా ఎరువుల విక్రయాలు చేయడం ద్వారా రాయితీ దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ విధానం అమలు చేసింది. సాంకేతిక సమస్యలు వస్తున్నందున జిల్లావ్యాప్తంగా ఈ-పాస్‌ అమలు చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈ-పాస్‌ విధానం అమలుకు నోచుకోకపోవడంతో ఎరువులు పక్కదారి పడుతున్నాయి. మండల కేంద్రంలోని ప్రైవేటు వ్యాపారులు ఈ -పాస్‌ మిషన్‌ వినియోగించకపోవడంతో పాటు ఎరువులు కొనుగోలు చేసిన రైతులకు కనీసం బిల్లులు సైతం అందించడం లేదు. ఈ-పాస్‌ మిషన్లు అందించి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఏ ఒక్క వ్యాపారీ వినియోగించిన దాఖలాలు లేవు. కేంద్ర ప్రభుత్వం రాయితీ నేరుగా కంపెనీలకు చెల్లిస్తుంది. ప్రైవేటు వ్యాపారులు రైతుల వేలిముద్రలు, ఆధార్‌ కార్డు నమోదు చేసిన రైతులకు మాత్రమే ఎరువులు విక్రయించాలని నిబంధనలు ఉన్నాయి. మండలంలోని కోమట్‌పల్లి, పోతాయిపల్లి, లింగంపేట, ఐలాపూర్‌, లింగంపల్లి, పర్మళ్ల, ఎక్కపల్లి, శెట్పల్లి, రాంపల్లి, ఒంటర్‌పల్లి, భవానీపేట, బోనాల్‌, బాణాపూర్‌, కోర్పోల్‌, మెంగారం తదితర గ్రామాల్లో రైతులు యాసంగి పంటలు సాగు చేస్తున్నారు. యాసంగి పంటలు సాగు చేస్తున్న రైతులు కాంప్లెక్స్‌ ఎరువులు, యూరియా, పోటాష్‌ ఎరువులు వినియోగిస్తుంటారు.

మండల కేంద్రంలోని ఐదుగురు వ్యాపారులకు, కోమట్‌పల్లిలో ఒకరికి, లింగంపేట సహకారం సంఘానికి ఒకటి, నల్లమడుగు సహకార సంఘానికి మూడు, శెట్పల్లి సంగారెడ్డి సహకార సంఘానికి ఒకటి చొప్పున వ్యవసాయశాఖ అధికారులు ఈ-పాస్‌ మిషన్లు అందించారు. ప్రైవేటు వ్యాపారులే కాకుండా సహకార సంఘం అధికారులు సైతం ఈ-పాస్‌ మిషన్‌లు వినియోగించడం లేదు. ఈ -పాస్‌ మిషన్లు లేకపోవడంతో ఎరువులను తమ ఇష్టానుసారంగా విక్రయాలు చేపడుతున్నారు. ప్రైవేటు వ్యాపారులు ఎరువులు విక్రయించిన అనంతరం తమకు కావాల్సిన రైతుల పేరిట బిల్లులు చింపుతున్నారు. ఎరువుల కొనుగోలు చేసిన సమయంలో రైతులకు బిల్లులు ఇచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. ఈ-పాస్‌ మిషన్‌లో రైతుల వివరాలు నమోదు చేయకపోవడంతో వ్యాపారులకు కలిసివస్తుంది. రైతుల అవకాశాన్ని ఆసరాగా తీసుకున్న వ్యాపారులు ఇష్టానుసారంగా విక్రయాలు చేపడుతున్నారు. దుకాణాల్లో స్టాకు వివరాలు, ధరల వివరాలు రాసి పెట్టాల్సి ఉంటుంది. కానీ వివరాలు లేకపోవడంతో వ్యాపారులు చెప్పిన ధరలకే రైతులు కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అధికారులు పట్టించుకోని కారణంగా ఎరువుల వ్యాపారులు ఇష్టానుసారంగా విక్రయాలు చేపడుతున్నారు. సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి ఈ-పాస్‌ మిషన్లు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. logo
>>>>>>