బుధవారం 08 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 24, 2020 , 02:01:29

నేడు 41వ వార్డులో రీపోలింగ్‌..!

 నేడు 41వ వార్డులో రీపోలింగ్‌..!
  • - టెండర్‌ ఓటు మూలంగా రద్దయిన ఎన్నిక...
  • - ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
  • - 101 పోలింగ్‌ బూత్‌లో 580 మంది ఓటర్లు
  • - బాధ్యులపై చర్యలు శూన్యం

కామారెడ్డి మున్సిపాలిటీలో టెండర్‌ ఓటు వెలుగుచూసిన 41 వార్డులో నేడు రీపోలింగ్‌ జరుగనున్నది. రాజ్‌బీ అనే మహిళ ఓటెయ్యాల్సి ఉండగా.. ఈవిడకు బదులు వేరే వ్యక్తి ఎవరో వచ్చి ఓటేసినట్లుగా రికార్డుల్లో నమోదైంది. 41 వార్డులో రెండు పోలింగ్‌ బూత్‌లుండగా 101 పోలింగ్‌ బూత్‌లో టెండర్‌ ఓటుపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం రీపోలింగ్‌పై ఆదేశాలు ఇచ్చింది. నేడు జరిగే రీపోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. యథావిధిగా ఉదయం ఏడు నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నట్లు రిటర్నింగ్‌ అధికారి వెల్లడించారు. రీపోలింగ్‌ నిర్వహిస్తున్న పోలింగ్‌ బూత్‌లోని ఓట్లను రేపే అన్ని వార్డులతో కలిపి లెక్కిస్తారు.
- కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ / కామారెడ్డి, నమస్తే తెలంగాణ : కామారెడ్డి మున్సిపాలిటీలో ఎన్నికల సిబ్బంది అత్యుత్సాహం మూలంగా ఓ వార్డులో బుధవారం జరిగిన పోలింగ్‌ రద్దు చేయబడింది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో ప్రశాంతంగా ఎన్నికలు ముగియగా.. జిల్లా కేంద్రంలోని 41వ వార్డులో టెండర్‌ ఓటు వెలుగు చూడడం కలకలం సృష్టించింది. ఒక వ్యక్తి ఓటును మరొక వ్యక్తి వేయడంతో టెండర్‌ ఓటుగా గుర్తించిన రిటర్నింగ్‌ అధికారి వెంటనే జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సత్యనారాయణకు సమాచారం అందించారు. తప్పును నిర్ధారించిన జిల్లా కలెక్టర్‌ వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘానికి టెండర్‌ ఓటు విషయాన్ని వివరించారు. నివేదిక రూపంలో ఎస్‌ఈసీ కమిషనర్‌కు సమాచారం తెలుపగా గురువారం నిర్ణయాన్ని వెలువరించారు. కామారెడ్డి మున్సిపాలిటీలోని 41వ వార్డులో రెండు పోలింగ్‌ బూత్‌లుండగా అందులో టెండర్‌ ఓటు జరిగిన 101 పోలింగ్‌ బూత్‌లో రీపోలింగ్‌ నిర్వహించాలని ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో హుటాహుటిన అధికార యంత్రాంగం నేడు తిరిగి ఎన్నికలు నిర్వహించేందుకు సమాయత్తమైంది.

నిర్లక్ష్యం మూలంగానే...

ఎన్నికల ప్రక్రియ కత్తిమీది సాములాంటిది. ప్రభుత్వ సిబ్బందికి ఎన్నికల ప్రక్రియపై శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. పోలింగ్‌ బూత్‌లలో నిర్లక్ష్యానికి తావు లేకుండా పోలింగ్‌ ముగిసే వరకూ అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఓటేసేందుకు వచ్చిన పౌరులను ఒకటికి పది సార్లు రుజువు చేసుకున్న తర్వాతే ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రక్రియలో నిర్లక్ష్యం కారణంగానే కామారెడ్డి మున్సిపాలిటీ పంచముఖి హనుమాన్‌ కాలనీ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 41వ వార్డులోని 101 పోలింగ్‌ బూత్‌లో టెండర్‌ ఓటు పడింది. దీంతో ఆ పోలింగ్‌ బూత్‌లో పడిన ఓట్లన్నింటినీ రద్దు చేసి తిరిగి ఎన్నికలు జరుపుతున్నారు. ఓటరు సంఖ్య 440లో ఉన్నటువంటి రాజ్‌బీ అనే మహిళ ఓటెయ్యాల్సి ఉండగా.. ఈవిడకు బదులు వేరే వ్యక్తి ఎవరో వచ్చి ఓటేసినట్లుగా రికార్డుల్లో నమోదైంది. దీంతో అవాక్కైన అధికారులంతా ఏమి చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు. చివరికి ఉన్నతాధికారుల సూచనతో టెండర్‌గా ఓటుగా గుర్తించి ఎన్నికల సంఘానికి సమాచారం చేరవేశారు. రాజ్‌బీ బదులుగా ఓటు వేసిన వ్యక్తి ఎవరు అన్న అంశంపై అధికారులు విచారిస్తున్నారు.

ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌...

టెండర్‌ ఓటుపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం రీపోలింగ్‌పై ఆదేశాలు ఇచ్చింది. దీంతో అధికారులంతా 41 వార్డులోని టెండర్‌ ఓటు చోటు చేసుకున్న 101 పోలింగ్‌ బూత్‌లో రీపోలింగ్‌ నిర్వహించనున్నారు. 41 వార్డులో 101, 102 పోలింగ్‌ బూత్‌లున్నాయి. ఇందులో మొత్తం 1742 ఓట్లున్నాయి. రీపోలింగ్‌ జరుగుతున్న పోలింగ్‌ బూత్‌లలో 580 ఓట్లుండగా బుధవారం జరిగిన ఎన్నికల్లో 378 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 199 మహిళా ఓటర్లు, 179 పురుషులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నేడు జరిగే రీపోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. యథావిధిగా ఉదయం ఏడు నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నట్లు రిటర్నింగ్‌ అధికారి వెల్లడించారు. బుధవారం ఓటు వేసిన పౌరులందరికీ ఎడమ చేతి చూపుడు వేలుకు సిరా చుక్కను వేశారు. శుక్రవారం ఓటు వేసే ఓటర్లకు ఎడమ చేతి మధ్య వేలికి సిరా చుక్కను పెట్టనున్నట్లుగా అధికారులు వెల్లడించారు. పోలింగ్‌ జరిగే ప్రాంతంలో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని పోలీసులు వెల్లడించారు. రీపోలింగ్‌ నిర్వహిస్తున్న పోలింగ్‌ బూత్‌లోని ఓట్లను రేపే అన్ని వార్డులతో కలిపే లెక్కిస్తారు.


logo