బుధవారం 01 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 22, 2020 , 00:44:48

సేడే పుర సమరం!

 సేడే పుర సమరం!
  • -కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో ఎన్నికలు
  • -జిల్లా వ్యాప్తంగా 1,17,705 మంది పట్టణ ఓటర్లు
  • -పురుషులు 57,557 మంది, మహిళలు 60,123 మంది
  • -సప్లిమెంటరీ జాబితాలో 744 మంది ఓటర్లు అదనం
  • -మున్సిపాలిటీ ఓటర్ల జాబితాలోమహిళలే అధికం
  • -పట్టణ ఓటర్లు కదిలేనా? ఓటింగ్‌ శాతం పెరిగేనా?


గడిచిన ఏడాది కాలంలో జరిగిన వరుస ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని గమనిస్తే పట్టణ ఓటర్లతో పోలిస్తే గ్రా మీణ ప్రాంత ప్రజలే తమ ఓటు హక్కును ఉత్సాహంగా  వినియోగించుకున్నారు. పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘాలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా పెరుగుదలలో మార్పు కనిపించడం లేదు. పైగా అక్షరాస్యత ఎక్కువగా ఉండే పట్టణాల్లోనే ఓటింగ్‌ శాతం  ఎందుకు తక్కువగా నమోదు అవుతున్నదనేది   అందరినీ కలిచి వేస్తున్న ప్రశ్న. పట్టణ ప్రజల్లో 75 శాతం మించి పోలింగ్‌ బూత్‌లకు వెళ్లడం లేదంటే అతిశయోక్తి కాదు. ఓటు చైతన్యంలో పట్టణాల కంటే పల్లెలే ముందున్నాయి. గ్రామాల్లో ఏ ఎన్నికలైనా ఓటేశాకే ప్రజలు తమ పనులకు వెళ్తారు.  పట్టణ వాసులు నేడు జరిగే పుర ఎన్నికల్లో ఓట్లేస్తారో? లేదంటే ఎప్పటిలాగే ముఖం చాటేస్తారో? వేచి చూడాలి. పోలింగ్‌ శాతం పెరుగుదలపై ఆశలు పెట్టుకున్న అభ్యర్థుల్లో మాత్రం ఓటర్ల స్పందనపై ఉత్కంఠ నెలకొంది.
- కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పార్లమెంట్‌ నుంచి మున్సిపాలిటీ వరకు అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ మనది. ప్రపంచంలోనే పేరెన్నిక గలది, ఎంతో విలువైనది. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిది. ఓటు అనే ఆయుధమే ఉంటే మనమే నిర్ణేత. ఓటు వేసే అవకాశాన్ని వరంగా స్వీకరించాలి. ఓటుతో మంచి రాజకీయాలను ఆహ్వానించాలి. పాలనా వ్యవస్థలో కీలకమైన ఓటు హక్కును సరిగా ఉపయోగించుకోకుంటే ప్ర జాస్వామ్యానికే చేటు. ఐదేండ్లు పాలించే నేతలను ఎన్నుకునేందుకు అరగంట వరుసలో నిలుచుని ఓటుహక్కు వినియోగించుకోకపోతే ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రతీ ఓటూ కీలకం అవుతుంది. గత ఎన్నికల్లో కొన్ని చోట్ల స్వల్ప ఓట్లతో ఓటమి పాలైన వారు కామారెడ్డిలోనే ఉన్నారు. ఇలాంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆయా పార్టీల అభ్యర్థులు ఏ ఒక్క ఓటును వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. ఉద్యోగాలు, వ్యాపారాల కోసం ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారు మొన్ననే సంక్రాంతి పర్వదినానికి ఇండ్లకు వచ్చారు. వారిని అభ్యర్థులు కలిసి పండుగకు వచ్చినట్లే ఓట్ల పండుగకు సైతం రావాలని కోరుతున్నారు. ఓటు వేసేందుకు వచ్చేందుకు అవసరమైన ఖర్చులు భరించడానికీ సిద్ధమేనని హామీలు సైతం ఇస్తున్నారు. పురపోరులో తలపడుతున్న అభ్యర్థులైతే ఒకడుగు ముందుకేసి ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న ఓటర్ల వివరాలను, వారి ఫోన్‌ నంబర్లను సేకరించి వారిని రప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆడపడుచుల నిర్ణయమే కీలకం...

కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో మహిళా ఓటర్లే కీలకంగా మారనున్నారు. వార్డు స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములను వారే శాసించే పరిస్థితి ఏర్పడింది. గత శాసనసభ, లోక్‌సభ ఎన్నికల సందర్భాల్లోనూ నియోజకవర్గంలో పురుషుల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. పోలింగ్‌లో సైతం ఎక్కువ మంది మహిళలే ఓటేశారు. పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు అధికంగా ఉండడంతో పురపాలిక తీర్పు మహిళల చేతుల్లోనే కనిపిస్తున్నది.  ఆడపడుచుల ఆశీర్వాదం ఎవరికి ఉంటే వారు విజయం సాధించినట్లే కనిపిస్తున్నది. ప్రతి ఎన్నికల్లో మహిళలే అత్యధికంగా ఓట్లు వేసేందుకు ఆసక్తి చూపడంతో ఈ ఎన్నికల్లోనూ వారి ఓట్లు ఏకంగా అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశించనున్నాయి. గత ఎన్నికల్లో మహిళల ఓట్ల కోసం కొందరు స్వయం సహాయక సంఘాల వారితో కలిసి ప్రచారం చేశారు. ఇంకొందరు ఏకంగా ఇంటింటికీ తిరుగుతూ మహిళలను కలిసి ప్రచారం చేసి వారికి కావాల్సిన ఓట్లు పడేలా చూసుకున్నారు. ఈ సారి మహిళలు తమ ఓట్లు ఎవరికి వేసి ఏ అభ్యర్థిని ఆశీర్వదిస్తారో వేచి చూడాల్సిందే. మొత్తం ఓటర్ల సంఖ్య 1,17,705 మంది ఉండగా ఇందులో పురుషులు 57,557 మంది, మహిళా ఓటర్లు 60,123 మంది ఉన్నారు. మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ నాటికి ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకున్న 744 మందిని సప్లిమెంటరీ జాబితాలో చేర్చారు.

ఉదయం 7గంటల నుంచే పోలింగ్‌...

కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో మొత్తం 80 వార్డులకు 188 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో బాన్సువాడలోని 4వ వార్డు ఏకగ్రీవమైనందున నేడు 79 వార్డులకే ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికల విధుల్లో 16 మంది జోనల్‌ అధికారులు, మూడు ఫ్లయింగ్‌ స్వాడ్‌    బృ ందాలు, 33 మంది రిటర్నింగ్‌ అధికారులు, 33 మంది సహాయ రిటర్నింగ్‌ అధికారులతో పాటు ఇతర సిబ్బంది పాల్గొననున్నారు. కామారెడ్డి ము న్సిపాలిటీ ఎన్నికలకు అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నం ద్‌లాల్‌ పవార్‌, బాన్సువాడ మున్సిపాలిటీకి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి జిల్లా స్పెషల్‌ ఆఫీసర్‌ వెంకటేశ్‌ ధోత్రెలు ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లలోనే బ్యాలెట్‌ బాక్సులను పొందుపరుస్తారు. అక్కడి నుంచి కౌంటింగ్‌ కేంద్రాలకు బ్యాలెట్‌ బాక్సులను తరలిస్తారు. కామారెడ్డి మున్సిపాలిటీకి అడ్లూర్‌ శివారులోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ గోదాం, ఎల్లారెడ్డికి మోడల్‌ డిగ్రీ కళాశాల, బాన్సువాడకు ఎస్‌ఆర్‌ఎన్‌కే డిగ్రీ కళాశాలలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు.logo
>>>>>>