గురువారం 02 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 21, 2020 , 00:59:11

బల్దియా ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

బల్దియా ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
  • -మూడు మున్సిపాలిటీల్లో 80 వార్డులు, 188 పోలింగ్‌ బూత్‌లు
  • -ఎన్నికల విధుల్లో 1,130 మంది సిబ్బంది సేవలు
  • -ప్రతీ పోలింగ్‌ కేంద్రాల్లో వీడియో రికార్డింగ్‌
  • -ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై కఠిన చర్యలు
  • -‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలోజిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎన్‌. సత్యనారాయణ

జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో  పోలింగ్‌ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం   పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేశామని వివరించారు.  ఎన్నికల విధుల్లో పాల్గొనబోయే సిబ్బందికి నేడు ఆయా పోలింగ్‌ కేంద్రాల బాధ్యతలు అప్పగిస్తామన్నారు.  స్థానికేతరులకే ఎన్నికల విధులు అప్పగించి పారదర్శకంగా పోలింగ్‌ను చేపట్టేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.  బరిలో అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండడంతో ఎన్నికల సిబ్బందిని అప్రమత్తం చేశామని ఎక్కడా ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా పారదర్శకంగా ఓటర్లు తమ హక్కును వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు  ఆయన వివరించారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాట్లపై  నమస్తే తెలంగాణ
ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను వెల్లడించారు.
- కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: “మున్సిపల్‌ ఎన్నికల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం.. ఎన్నికల విధుల్లో పాల్గొనబోయే సిబ్బందికి నేడు ఆయా పోలింగ్‌ కేంద్రాల బాధ్యతలను అప్పగించనున్నాం.. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో స్థానికేతరులకే ఎన్నికల విధులు అప్పగించి పారదర్శకంగా పోలింగ్‌ను చేపట్టేందుకు చర్యలు తీసుకున్నాం.. ఎక్కడా లోటుపాట్లు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని” జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ తెలిపారు. నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి...

నమస్తే : రేపు జరుగబోయే పురపాలక ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయా? ప్రశాంతంగా పోలింగ్‌ను పూర్తి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
కలెక్టర్‌: జిల్లాలో మూడు మున్సిపాలిటీల్లో దాదాపుగా ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. సమస్యాత్మక, అతి సున్నిత పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి బందోబస్తుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. ఏడాది కా లంలో ఎదుర్కొన్న అసెంబ్లీ, లోక్‌సభ, పంచాయతీ, పరిషత్‌ ఎన్నికల అనుభవాలతో ముందుకు సాగుతున్నాం. ఎక్క డా అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నాం.

పుర ఎన్నికల్లో భాగంగా ఎంత మంది సిబ్బందిని నియమించారు?

మూడు మున్సిపాలిటీల్లో బుధవారం జరిగే ఎన్నికలకు 1,130 మంది పోలింగ్‌ సిబ్బందిని నియమించాం. వీరికి శిక్షణా కార్యక్రమాలు పూర్తి చేశాం. ఎన్నికల పరిశీలకులు సందీప్‌ ఆధ్వర్యంలో సిబ్బందికి పోలింగ్‌ కేంద్రాల కేటాయింపును చేపట్టాం. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ధేశించిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తున్నాం. ఎన్నికల్లో ఎవరైనా అభ్యర్థులు, ఏ రాజకీయ పార్టీ నాయకులైనా సరే నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

పురపాలక ఎన్నికల నేపథ్యంలో పట్టణ ఓటర్లకు మీరు ఇచ్చే సందేశం?

ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఎన్నికల ప్రక్రియలో ప్రజలంతా పాల్గొని తమకు నచ్చిన నాయకులను ఎన్నుకోవాలి. ఓటు వేసి పౌరుడిగా తమ బాధ్యతను నెరవేర్చాల్సిందిగా కోరుతున్నాను. స్వేచ్ఛాయుతంగా ఓటు వేసేందుకు ప్రభుత్వ యంత్రాం గం అన్ని ఏర్పాట్లు చేసింది.

కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో ఎక్కడెక్కడ ఎన్ని పోలింగ్‌ బూతులు ఏర్పాటు చేశారు?

జిల్లాలో మూడు మున్సిపాలిటీల్లో 80 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నాం. ఇందుకోసం మొత్తం 188 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశాం. కామారెడ్డిలో 49 వార్డులకు 126 పోలింగ్‌ కేంద్రాలు, బాన్సువాడలో 19 వార్డులకు 38 పోలింగ్‌ బూత్‌లు, ఎల్లారెడ్డిలో 12 వార్డులకు 24 పోలింగ్‌ స్టేషన్లు అందుబాటులో తెచ్చాం. ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి గరిష్టంగా 800 మంది ఓటర్లుంటారు. కనిష్టంగా సుమారుగా 4వందల మంది ఉంటారు. సగటున ఒక్కో వార్డుకు రెండు నుంచి మూడు కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. వీటితో ఓటర్లు బారులు తీరాల్సిన అవసరం అంతగా ఉండదు.

పేపర్‌ బ్యాలెట్‌ ఆధారంగా ఎన్నికలు జరుగుతున్నాయి. బ్యాలెట్‌ బాక్సులు ఎన్ని వినియోగిస్తున్నారు?

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల ప్రకారం మూడు మున్సిపాలిటీల్లో 188 బ్యాలెట్‌ బాక్సులు వాడుతున్నాం. అదనంగా తగినన్ని బ్యాలెట్‌ బాక్సులు సమీప ప్రాంతాల్లోనే ఉంటాయి. ఎన్నికల నిర్వహణకు 16మంది జోనల్‌ అధికారులు, 33 మంది రిటర్నింగ్‌ అధికారులు, మరో 33 మంది సహాయ రిటర్నింగ్‌ అధికారులను నియమించాం. సహాయ ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్న కమిషనర్లు తమ పరిధిలో ఎన్నికల ఏర్పాట్లు చూస్తున్నారు.
బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ, రవాణా తదితర ఏర్పాట్ల బాధ్యతలను జిల్లా స్థాయి అధికారులకు అప్పగించాం. స్టాటిస్టిక్‌, వీడియో సర్వేలెన్స్‌, ఫ్లయింగ్‌ స్కాడ్‌, వీడియో పరిశీలన, వ్యయ పరిశీలనకు బృందాలను నియమించాం. ఒక్కో పురపాలికలో ఒక్కో బృందం పని చేస్తుంది.

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారా? అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?

పోలింగ్‌ కేంద్రాల వద్ద వెబ్‌కాస్టింగ్‌ చేయనున్నాం. గతంలో మాదిరిగానే దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. మైక్రో అబ్జర్వర్ల పరిశీలనలో ప్రక్రియ సాగుతుంది. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో మొత్తం 67 సమస్యాత్మకమైన పో లింగ్‌ కేంద్రాలను గుర్తించాం. ఈ ప్రాంతా ల్లో మరింత శ్రద్ధ తీసుకుంటున్నాం. ఓటర్ల కోసం పోలింగ్‌ స్లిప్పులను ఇంటింటికీ పంపి ణీ చేస్తున్నాం. అందులో పోలింగ్‌ కేంద్రాల వివరాలు ఉంటాయి. స్లిప్పుల సహకారం ద్వారా సులువుగా ఓటు హక్కు వినియోగించుకునే ఆస్కారం ఉంటుంది. 100శాతం ఫొటో ఓటరు స్లిప్పులు పంపిణీ చేశాం.logo
>>>>>>