మంగళవారం 31 మార్చి 2020
Kamareddy - Jan 21, 2020 , 00:57:43

పుర ఎన్నికలపై డేగ కన్ను !

పుర ఎన్నికలపై డేగ కన్ను !
  • -సమస్యాత్మక పోలింగ్‌ బూత్‌లపై ప్రత్యేక దృష్టి
  • -ఇప్పటికే రౌడీ షీటర్లు, పాత నేరస్తుల బైండోవర్‌
  • -600 మంది పోలీసులతో ఎన్నికల బందోబస్తు
  • -చెక్‌పోస్టు తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.8లక్షలు సీజ్‌
  • -‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో ఎస్పీ శ్వేతారెడ్డి

‘మున్సిపాలిటీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు 
 పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం.  బుధవారం జరిగే ఎన్నికల్లో సుమారు 600 మంది సిబ్బందితో బందోబస్తు చేపట్టనున్నాం. సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాలపై ప్రత్యేక  నిఘా ఏర్పాటు చేశాం. నేరాలు జరగకుండా, నిర్భయంగా ప్రజలు ఓటు హక్కును  వినియోగించుకునేందుకు పోలీసు బృందాలు సునిశితంగా పర్యవేక్షించేలా  చర్యలు  చేపట్టాం..’ అని ఎస్పీ శ్వేతారెడ్డి తెలిపారు.  పురపాలక ఎన్నికల్లో ఇప్పటి వరకు కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ కింద ఒకటే
కేసు నమోదైందన్నారు. చెక్‌పోస్టుల వద్ద తనిఖీల్లో దాదాపు రూ.8లక్షల నగదును సీజ్‌ చేశామని,  కామారెడ్డిలోని 27వ  వార్డులో మద్యం పంపిణీ చేసిన బీజేపీ నాయకులపై కేసు నమోదు చేశామని వివరించారు. బుధవారం నిర్వహించనున్న  ఎన్నికల నేపథ్యంలో   ‘నమస్తే తెలంగాణ’కు   ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు..  

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ప్రతి ఓటరు నిర్భయం గా ఓటు వేసేలా అన్ని ఏ ర్పాట్లు చేస్తున్నారు. సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 600 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. 188 పోలింగ్‌ కేంద్రాల్లో 67 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించినట్లు ఎస్పీ శ్వేతారెడ్డి తెలిపారు. ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నికల్లో చేపడుతున్న చర్యలను వెల్లడించారు.
నమస్తే : మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి పోలీస్‌ శాఖ నుంచి ఎలాంటి చర్యలు చేపట్టారు?
ఎస్పీ: కామారెడ్డి జిల్లాలో మూడు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డిలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను పూర్తి చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. ఇతర జిల్లాలకు చెందిన బలగాల అవసరం లేకుండానే మన జిల్లాకు చెందిన 600 మంది సిబ్బందితోనే పోలింగ్‌కు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. పోలింగ్‌ బూత్‌ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇప్పటికే రౌడీ షీటర్లు, పాత నేరస్తులను బైండోవర్‌ చేశాం.

మద్యం, డబ్బుల పంపిణీని నిరోధించేందుకు తీసుకున్న జాగ్రత్తలేంటి?

ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసులు మొదట్నుంచి పటిష్టవంతమైన నిఘాను ఏర్పాటు చేశాం. మూడు మున్సిపాలిటీల పరిధిలో సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేశాం. ఇప్పటి వరకు రూ.8లక్షల నగదు స్వాధీనం చేసుకున్నాం. కామారెడ్డి పట్టణంలోని 27వ వార్డులో ఓటర్లకు మద్యం పంపిణీ చేస్తుండగా బీజేపీ నాయకులపై కేసులు నమోదు అయ్యాయి.
పట్టణాల్లో పోలింగ్‌ కేంద్రాల పరిధి తక్కువ. ఓటర్ల సంఖ్య ఎక్కువ. రద్దీ వాతావరణాన్ని ఎలా నియంత్రిస్తారు?
ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. వంద మీ టర్ల మేర ప్రజలు గుమిగూడడం నే రం. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ప్రవర్తించడం కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ కిందకు వస్తుంది. ఎన్నికల నిర్వహణలో అలజడికి ప్రయత్నిస్తే వారు ఎంతటి వారైనా కఠిన శిక్షలు తప్పవు. ఎన్నికల విధుల్లో 8 స్ట్రైకింగ్‌ ఫోర్స్‌, 3 ప్రత్యేక స్ట్రైకింగ్‌ ఫోర్సు బృందాలను నియమించాం.

పేపర్‌ బ్యాలెట్‌ ఆధారిత ఎన్నికలు ఉన్నందున పోలింగ్‌ కేంద్రాల్లో తనిఖీలు ఉంటాయా?

పేపర్‌ బ్యాలెట్‌ ఆధారిత ఎన్నికలు అయినందున ఓటర్లు ఎవరూ ద్రవ పదార్థాలతో కూడిన వాటిని ఏవీ పట్టుకెళ్లడానికి వీల్లేదు. కేంద్రాల వద్ద సాధారణ తనిఖీలు తప్పకుండా ఉంటాయి. ఓటర్లు సైతం పోలీసులతో సహకరించి తమ ఓటు హక్కును వినియోగించుకుంటే బాగుంటుంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది సైతం టీ, కాఫీ, తాగు నీటి బాటిళ్లను పోలింగ్‌ కేంద్రం లోపలికి తీసుకెళ్లకుండా ఉంటే మంచిది.

సమస్యాత్మకమైన పోలింగ్‌ కేంద్రాల్లో పోలీసులు ఏ రకంగా జాగ్రత్తలు వహిస్తున్నారు?

మూడు మున్సిపాలిటీల్లో మొత్తం 188 పోలింగ్‌ కేంద్రాల్లో 67 సమస్యాత్మకమైనవిగా గుర్తించాం. కామారెడ్డి మున్సిపాలిటీలో 37 క్రిటికల్‌ పోలింగ్‌ బూత్‌లున్నాయి. బాన్సువాడలో 18, ఎల్లారెడ్డిలో 12 బూత్‌లను సమస్యాత్మకమైనవిగా గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. స్పెషల్‌ ఆఫీసర్ల పర్యవేక్షణలో క్రిటికల్‌ పోలింగ్‌ బూత్‌లపై నిఘా కొనసాగుతుంది. ప్రతీ పోలింగ్‌ కేంద్రాల్లో వీడియో రికార్డింగ్‌ తప్పనిసరిగా ఉంటుంది.

నేడు, రేపు కీలకమైన సమయం. ఓటర్లను ప్రభావితం చేసేందుకు చాలా మంది డబ్బు, మద్యం పంపిణీకి ప్రయత్నిస్తుంటారు. వీటి నిరోధానికి తీసుకుంటున్న చర్యలేమిటి?

డబ్బులు, మద్యం పంపిణీని అరికట్టేందుకు ఓటర్లే చైతన్యవంతులై తిరస్కరించి ఓటు హక్కును స ద్వినియోగం చేసుకోవాలి. ఎక్కడైన నజరానాల పంపిణీ జరిగితే వెంటనే ఫ్లయింగ్‌ స్వాడ్‌ బృం దాలు, స్థానిక పోలీసులకు, ఆయా పురపాలక సంఘాల కమిషనర్లకు ఫిర్యాదు చేయాలి. మద్యం, నజారానాలు పంపిణీ చేసే వారిపై ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం.logo
>>>>>>