మంగళవారం 31 మార్చి 2020
Kamareddy - Jan 20, 2020 , 03:31:23

నేటితో ప్రచారానికి తెర..!

నేటితో ప్రచారానికి తెర..!మైకుల హోరు.. ప్రచార జోరు..


వార్డుల వారీగా ఆయా పార్టీల్లో పోటాపోటీగా ప్రచారం హోరెత్తుతోంది. ఒకరిని చూసి మరొకరు అన్నట్లుగా ప్రచారాన్ని సవాల్‌గా తీసుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు. ముఖ్యంగా గులాబీ సైన్యం వినూత్నంగా ప్రజల మధ్యకు వెళ్లి ఓటర్లను కలుసుకుంటున్నారు. బల్దియా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు సిద్ధం అవుతున్నది. బల్దియా ఎన్నికల్లో పోటాపోటీ ప్రచారానికి నేటితో తెర పడనుండడంతో చివరి రోజు వీలైనంత మందిని కలుసుకొని ఓట్లను అభ్యర్థించే పనిలో నాయకగణం నిమగ్నమైంది. వారం రోజుల నుంచి ఏకధాటిగా సాగుతోన్న ప్రచార హోరుకు సాయంత్రం 5గంటలకు ఫుల్‌స్టాప్‌ పడనుండడంతో సమయాన్ని వృథా చేయకుండా ప్రజల్లో కలియ తిరిగేందుకు నేతలంతా ప్లాన్‌ వేసుకున్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన సమయంలోపే ప్రచారానికి ముగింపు పలకడంతో పాటుగా కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ను గౌరవించాలనే ఆలోచనతోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులంతా సిద్ధమయాయ్యారు. ఇంతకు ముందు ఎన్నికల ప్రచారమంటే కాలనీల్లో గోడల మీద రాతలు కనిపించేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఓటర్లను వ్యక్తిగతంగా కలుసుకోవడం, వారి మద్దతును కూడగట్టుకోవడంలో పోటీ ఏర్పడడంతో అభ్యర్థులకు కత్తిమీది సాములా మారింది. మారిన పరిస్థితులకు అనుగుణంగా అభ్యర్థులందరూ ఓటర్లను తమవైపునకు తిప్పుకునే ప్రయత్నాలనే చేస్తున్నారు.

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ

పురపాలక సమరానికి సమయం ఆసన్నమవుతున్నది. కీలక ఘట్టాలు ఒక్కోటి ముగింపునకు చేరుతుండడంతో పుర పోరు చివరి దశకు చేరుకుంటున్నది. వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తం గా మూడు మున్సిపాలిటీల్లో 80 వార్డుల్లో సాగిన ప్రచారం నేటి సాయంత్రం 5గంటల్లోపు ముగియనుంది. సాయంత్రం 5గంటల తర్వాత ఎవ్వరు ప్రచారం చేసినా కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ కింద కేసులు నమోదు చేసేందుకు ఎన్నికల యంత్రాంగం స ర్వం సిద్ధమైంది. మొదటి నుంచి ప్రచార కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి క్యాడర్‌ పెద్ద ఎత్తున భాగస్వామ్యమైంది. పోలింగ్‌ తేదీ దగ్గర పడడంతో ప్రచారంలో వెనుకబడిన అభ్యర్థులను అప్రమత్తం చేస్తూ, వార్డుల వారీగా స్థితిగతులను అంచనా వేస్తూ ఎమ్మెల్యేలు, ఎంపీలు కదనరంగంలో దూసుకపోతున్నారు.

కామారెడ్డిలో అన్నీ తానై...

కామారెడ్డి జిల్లాలో మూడు మున్సిపాలిటీలో 80వార్డులుండగా కేవలం కామారెడ్డిలో 49 వార్డులున్నాయి. ఇక్కడ జరుగుతోన్న పోరు రసవత్తరంగా నెలకొంది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి షబ్బీర్‌ అలీ పోటీకి ముందే చేతులు ఎత్తేసినప్పటికీ తన ఓటమిని సానుభూతి బూచిగా చూపించి జనాల్లో తిరుగుతున్నారు. తద్వారానైనా ఓట్లను రాబట్టి పరువును నిలబెట్టుకునేందుకు  కాంగ్రెస్‌ నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నట్లుగా వారం రోజుల ప్రచార శైలిని చూస్తుంటేనే అర్థమవుతున్నది. ఇక బీజేపీకి అభ్యర్థుల కరువు కొట్టొచ్చినట్లుగా కనిపించగా గత ఎన్నికల్లో దక్కిన సీట్లనే కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నది. ఇందుకోసం జనాలను రెచ్చగొట్టేందుకైనా సిద్ధపడుతుందంటే అతిశయోక్తి కాదు. 49 వార్డుల్లో పోటీ చేస్తోన్న టీ ఆర్‌ఎస్‌ పార్టీ అత్యధిక సీట్లను కైవసం చేసుకునేందుకై సిద్ధమైంది. ఇందుకోసం ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ తీవ్రంగా శ్రమిస్తున్నారు. వారం రోజులుగా ఉదయం నుంచి రాత్రి 10గంటల వరకూ విరామం లేకుండా ప్రచారం చేస్తున్నారు. ఒక్కో రోజు ఏడు నుంచి ఎనిమిది వార్డు ల్లో ఏకధాటిగా ప్రచారం చేసి వార్డు అభ్యర్థుల్లో ఉత్సాహం నింపుతూ గెలుపు ధీమాను వారికి కల్పిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తోన్న పథకాల్లో లబ్ధిదారులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులందరినీ పలుకరిస్తున్నారు. అంతేగాక కామారెడ్డిలో అభివృద్ధి చెందిన తీరుతెన్నులను చూపిస్తూ ఓటర్లను మంత్రముగ్ధులు చేస్తున్నారు.

పోచారం కంచుకోటలో...

శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి కంచుకోట బాన్సువాడలో పోరు ఏకపక్షంగానే ఉండేలా టీఆర్‌ఎస్‌ నేతలంతా కృషి చేస్తున్నారు. బాన్సువాడలో రూ.100 కోట్లతో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ బాన్సువాడ మున్సిపాలిటీ ఎన్నికల ఇన్‌చార్జి, జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే, రాష్ట్ర నాయకుడు పోచారం భాస్కర్‌రెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారు. నిరాటంకంగా ప్రచారాన్ని సాగి స్తూ ఓటర్లను తమవైపునకు తిప్పుకుంటున్నారు. ముస్లిం, మైనార్టీ వర్గాలతో పాటుగా డబుల్‌ లబ్ధిదారులు, పెన్షన్‌దారుల ఆశీస్సులు పొందుతున్నారు. విజయాన్ని ఏకపక్షంగా కైవసం చేసుకునేందుకు పకడ్బందీగా గులాబీ సైన్యాన్ని బరిలో దించి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. 19 వార్డుల్లో ఇప్పటికే 4వ వార్డు ఎన్నిక ఏకగ్రీవం కావడంతో అదే స్ఫూర్తితో మిగిలిన 18 వార్డుల్లోనూ విజయ దుందుబి మోగించాలనే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ నాయకుడు పోచారం భాస్కర్‌ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇక ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ సైతం నూతన మున్సిపాలిటీపై గులాబీ జెండాను ఎగురవేయాలనే కసితో పని చేస్తున్నారు. 12 వార్డుల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకొని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు బహుమానంగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు.

సోషల్‌ మీడియాలోనూ హోరు

అభ్యర్థుల ప్రచారం ఊపందుకోగా మరి కొద్ది గంటల్లోనే ప్రచారానికి పరిసమాప్తం పడనుంది. అయితే, ఈసారి జరుగుతోన్న మున్సిపల్‌ ఎన్నికల రణరంగంలో సామాజిక మాధ్యమాల పాత్ర అంతా ఇంతా కాదు. పోటీలో నిలిచిన వారిలో అత్యధికులు చదువుకున్న వారే కావడంతో ఓటర్లను కలుసుకునేందుకు సులువుగా ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ఇన్‌స్ట్రాగ్రామ్‌ వంటి సౌకర్యాలను వాడుకుంటున్నారు. ప్రచారానికి సంబంధించిన అంశాలను ఫొటోలు తీయడం, ఆకట్టుకునేలా వాటిని రూపకల్పన చేసి గ్రూపుల్లో వదిలేస్తున్నారు. అంతేకాక, అభ్యర్థుల వీడియో సందేశాలు, ఫొటోలతోనూ సందేశాత్మకమైన వీడియోలను రూపొందించి ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా సెల్‌ఫోన్లకు పంపుతుండడం విశేషం. సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారం కొత్త తరహాలో సాగుతున్నది. మనుషులు కనిపించకున్నప్పటికీ చెప్పాలనుకున్నదీ సులువుగా ఓటర్లకు చేరవేస్తున్నారు. పండుగలొస్తే శుభాకాంక్షలు, విషాద సమయంలో సంతాపాలకే కాకుండా ఎన్నికల సమయంలో ప్రచారాలకూ వాట్సప్‌, ఫేస్‌బుక్‌లను అభ్యర్థులు వేదికగా మార్చుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా మూడు మున్సిపాలిటీల్లో ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు, అనుచరులు, ఔత్సాహికులు, నాయకులు, కార్యకర్తలు ఈ సౌకర్యాన్ని తమకు అనుకూలంగా తీర్చిదిద్దుకుంటున్నారు. ఇంటర్నెట్‌ సాయంతో సామాజిక మాధ్యమాల్లో ప్రచారాన్ని మారుమోగిస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఎవరి ప్రచారం వారిదే అన్నట్లుగా పోటాపోటీగా కనిపిస్తుండడం విశేషం.logo
>>>>>>