శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 20, 2020 , 03:28:38

బాన్సువాడలో అభివృద్ధి జోరు..

 బాన్సువాడలో అభివృద్ధి జోరు..



బాన్సువాడ, నమస్తే తెలంగాణ: పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తున్నది. బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటోందనడానికి నిదర్శనమే బాన్సువాడలో జరుగుతున్న అభివృద్ధి పనులు. గతంలో గ్రామ పంచాయతీగా.. డివిజన్‌ కేంద్రంగా ఉన్న బాన్సువాడను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రభుత్వం మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది. సమైక్య పాలనలో అభివృద్ధి పనులే ఎరుగని బాన్సువాడ తెలంగాణ ప్రభుత్వ పాలనలో దినదినాభివృద్ధి సాధిస్తున్నది. విద్య, వైద్యం, మహిళా సంక్షేమం, పేదల సంక్షేమం, యువతను దృష్టిలో ఉంచుకొని బాన్సువాడ డివిజన్‌ అభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నది. దీంతో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. బాన్సువాడ పట్టణంలో ఒకనాడు నడువలేని స్థితి ఉండేది. నాడు గుంతలమయంగా ఉన్న రోడ్లు నేడు అద్దంలా మెరుస్తున్నాయి. పట్టణంలోని మున్సిఫ్‌కోర్డు నుంచి బోధన్‌ వెళ్లే పెద్దఫూల్‌ వాగు వరకు సుమారు 3.2 కిలోమీటర్ల మేర  రోడ్డుకు ఇరువైపు 50 ఫీట్లతో వెడల్పు చేపట్టారు. రోడ్డుకు మధ్యలో డివైడర్లను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు 28 కోట్ల రూపాయల విడుదల చేసింది. ఈ నిధులతో విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. పట్టణవాసులు సేద తీరేందుకు కల్కి చెరువు కట్టను మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చుతున్నారు. అందుకోసం రూ.7.35 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులతో కట్టను సర్వాంగసుందరంగా మార్చారు. మహిళలు, శిశు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సర్కారు పేద ప్రజలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యాన్ని ప్రభుత్వ దవాఖానల్లో అందిస్తున్నది.

దీంట్లో భాగంగా పట్టణానికి వంద పడకల మాతా శిశు దవాఖానను మంజూరు చేసింది. పట్టణంలోని జనరల్‌ దవాఖానలో సుమారు కోటి రూపాయల వ్యయంతో డయాలసిస్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. దీంతో చాలా మంది కిడ్నీ బాధితులు ఇక్కడే వైద్యసేవలు పొందుతున్నారు. దీంతో పాటు రూ.కోటి 50 లక్షలతో పట్టణ నడిబొడ్డున బ్లడ్‌బ్యాంక్‌ను ఏర్పాటు చేసింది. పట్టణంలోని అన్ని గల్లీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కోసం రూ.25 కోట్లను వెచ్చించింది. కొన్ని కాలనీల్లో ఇప్పటికే పనులు పూర్తికాగా, మరికొన్ని కాలనీల్లో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. గౌలిగూడ, వాసవికాలనీ, ఎన్‌జీవోస్‌ కాలనీ, అర్ఫత్‌కాలనీ, టీచర్స్‌కాలనీ, సాయికృపనగర్‌ కాలనీ, మదీనా కాలనీ, ఫిర్దోస్‌ కాలనీ, బండాగల్లి, పోచమ్మగల్లి, పట్టణంలో అతి పెద్ద కాలనీ అయిన సంగమేశ్వర కాలనీల్లోని అన్ని రోడ్లను ఆధునీకరించారు.
పట్టణంలో సుమారు రెండు వేల ఇండ్ల నిర్మాణాలను చేపట్టింది. పట్టణంలోని సికిందర్‌ కాలనీ, బీడీ వర్కర్స్‌ కాలనీ, పాత బాన్సువాడ, హరిజనవాడ, తాడ్కోల్‌ శివారులో కలిపి మొత్తం 500 ఇండ్లను నిర్మించింది. ఇప్పటి వరకు సుమారు వెయ్యి కుటుంబాలకు సొంతింటి కల నెరవేరింది. తాడ్కోల్‌ శివారులో 500 ఇండ్ల నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. విద్యార్థులు, యువతను క్రీడారంగంలో ప్రోత్సహించే చర్యల్లో భాగంగా పట్టణంలో రూ.రెండు కోట్ల 63 లక్షల వ్యయంతో మినీ స్టేడియాన్ని నిర్మించారు.


అభివృద్ది పనులు జరిగాయి ఇలా..

-బాన్సువాడ పట్టణంలో జాతీయ రహదారికి అనువుగా నిర్మించిన విశాలమైన సీసీ రోడ్లు, పుట్‌పాత్‌, సెంట్రల్‌ లైటింగ్‌, డివైడర్సు,తదతర పనులకు రూ.36 కోట్లు.
-పట్టణంలోని కాలనీల్లో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీలకు రూ.25 కోట్లు.
-పట్టణంలో మహిళల కోసం నిర్మించిన మాత శిశు అసుపత్రికి రూ.20 కోట్లు.
-బాన్సువాడ మంజీర పై బురుగు మైశవ్వ వద్ద చెక్‌ డ్యాంల నిర్మాణంకు రూ.19 కోట్లు.
-కల్కి చెరువు (మినిట్యాంక్‌) బండ్‌ నిర్మాణం సుంధరీకరణకు రూ. 8 కోట్లు.
-ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆధనపు తరగతుల నిర్మాణం కోసం  రూ. 2 కోట్ల 50 లక్షలు.
-బాన్సువాడ తాడ్కోల్‌ రోడ్డు లో డివైడర్లు, తాడ్కోల్‌ వరకు సీసీ రోడ్లు నిర్మాణానికి రూ.2 కోట్లు.
-యువతను క్రీడల్లో ప్రోత్సాహం అందించేలా మినిస్టేడియం నిర్మాణం కోసం రూ.3 కోట్లు.
-మండల పరిషత్తు, చేపల మార్కెట్‌ హోల్‌ సెంటర్‌, షాపింగ్‌ కాంప్లెక్సు నిర్మాణం, అ న్ని సామాజిక వర్గాల కు కమ్యూనిటి భవనాలు, పంట పోలాలకు వెల్లే సీసీ రోడ్డు, బ్లడ్‌ బ్యాంకు, డయాలసిస్‌ సెంటర్‌, వైకుంఠదామం, మందిరాలు, చర్చి, మజీద్‌ అభివృద్ది తదితర పనులకు రూ.250 కోట్లు.


logo