మంగళవారం 31 మార్చి 2020
Kamareddy - Jan 18, 2020 , 03:10:41

ఆరోగ్య సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలి

ఆరోగ్య సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలి


విద్యానగర్‌ : ఆరోగ్య సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని జనహిత సమావేశంలో వైద్య సిబ్బందితో కన్వర్జెన్సీ మీటింగ్‌ను శుక్రవారం నిర్వహించారు. జిల్లాలో ఆరోగ్య సంక్షేమ పథకాల అమలు తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ వైద్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ ఆదేశాల మేరకు గర్భిణుల వివరాలు, ప్రభుత్వ దవాఖానల్లో కాన్పులు, పసిపిల్లలకు అందాల్సిన టీకాలు, ఆరోగ్య సేవలు, హైరిస్క్‌ గర్భిణులకు అందించాల్సిన ఆరోగ్య సేవల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామాల్లో వివరించి సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్న జాతీయ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని అందరి సహకారంతో విజయవంతం చేయాలని అన్నారు. కార్యక్రమంలో వైద్యులు డి.శోభారాణి, అనిల్‌ కుమార్‌, మోహన్‌, కరుణ శ్రీ, ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు, సూపర్‌వైజర్లు చలపతి, సంజీవ్‌రెడ్డి, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

పోలియో చుక్కలు వేయించాలి

ఐదేండ్ల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలని డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాలులో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ నిర్వహించిన జాతీయ టీకాల దినం సందర్భంగా జిల్లా స్థాయి సన్నాహక సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. 19వ తేదీన పోలియో చుక్కలు వేసేందుకు జిల్లావ్యాప్తంగా 638 పోలియో బూత్‌లు, 34 స్థిర బృందాలు, 21 సంచార బృందాలు ఏర్పాటు చేశామని వివరించారు. జిల్లాలో 0-5 ఏండ్ల లోపు పిల్లలు 1,04,661 మంది ఉన్నారని, వారందరికీ పోలియో చుక్కలు వేస్తామన్నారు. జిల్లా ఏరియా దవాఖానలో పోలియోపై శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించనున్నామని, ర్యాలీని కలెక్టర్‌ సత్యనారాయణ ప్రారంభిస్తారని తెలిపారు.  కార్యక్రమంలో పారామెడికల్‌ వైద్య సిబ్బంది, ప్రోగ్రాం అధికారులు, డాక్టర్‌ అనిల్‌ కుమార్‌, డాక్టర్‌ రాజు, కార్యాలయ సిబ్బంది సంజీవ్‌రెడ్డి, సూర్యప్రకాశ్‌, వేణు,  వైద్యసిబ్బంది పాల్గొన్నారు.


logo
>>>>>>