సోమవారం 30 మార్చి 2020
Kamareddy - Jan 15, 2020 , 01:55:32

బరిలో 360 మంది

బరిలో 360 మంది
  • -అత్యధికంగా కామారెడ్డిలో 238 మంది పోటాపోటీ
  • -బాన్సువాడలో 67 ఎల్లారెడ్డిలో 56 మంది నామినేషన్లు
  • -పురపోరులో 133 మంది స్వతంత్రులు
  • -కామారెడ్డిలో అత్యధికంగా 96 మంది, బాన్సువాడలో 14, ఎల్లారెడ్డిలో 23 మంది
  • -బాన్సువాడ మున్సిపాలిటీలో 4వ వార్డు ఒక్కటే ఏకగ్రీవం

నామినేషన్లు తుది ఘట్టం ముగియడంతో ఇక పోరు మాత్రమే మిగిలింది. కామారెడ్డి జిల్లాలో మూడు మున్సిపాలిటీల్లో ఎవరెవరు పోటీ చేయబోతున్నారో తేటతెల్లమైంది. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో మొత్తం 360 మంది బరిలో నిలిచారు. అత్యధికంగా కామారెడ్డి మున్సిపాలిటీల్లో 238 మంది నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు ఆయా పార్టీల నుంచి బీ-ఫారాలు అందిన వారంతా సంతోషం వ్యక్తంచేయగా టికెట్‌ ఖరారు కాని వారంతా నిరసనలు, ఆందోళనలు చేస్తూ ఇంటిముఖం పట్టారు. కొందరైతే బుజ్జగింపులకు లొంగి చివరి నిమిషంలో నామినేషన్లు విత్‌ డ్రా చేసుకోగా.. మరికొందరైతే బరిలో తలపడేందుకే ఇష్టపడ్డారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 133 మంది స్వతంత్రులు పోటీలో నిలిచినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 63  మంది ఆయా పార్టీల్లో బీ-ఫారాలు దక్కని వారే ఉండడం విశేషం. కామారెడ్డి మున్సిపాలిటీలో 96 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారు. బాన్సువాడలో 14, ఎల్లారెడ్డిలో 23 మంది పోటీ స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా బాన్సువాడ మున్సిపాలిటీలోని 4వ వార్డు ఏకగ్రీవంగా టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడింది.    - కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ

అన్ని చోట్లా టీఆర్‌ఎస్‌...

అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ జిల్లా వ్యాప్తంగా 80 వార్డుల్లో పోటీ చేస్తున్నది. మొదట్నుంచి అభ్యర్థుల మధ్య పోటీ నెలకొనగా తీవ్ర కసరత్తు ద్వారా టికెట్లను కేటాయించారు. స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు కలిసి గెలుపు గుర్రాలకే బీ-ఫారాలు అందించారు. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డిలో తీవ్రమైన పోటీ నెలకొనగా సమన్వయంతో రెబల్‌ అభ్యర్థులను బుజ్జగిస్తూ ముందుకుపోయారు. పార్టీకి చేసిన సేవలు, ఉద్యమ నేపథ్యం వంటి అంశాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి అభ్యర్థులే లేక తీవ్రంగా సతమతమయ్యింది. కామారెడ్డిలో 49 వార్డులకు 48 చోట్ల, బాన్సువాడలో 19 వార్డులకు 18చోట్ల, ఎల్లారెడ్డిలో 12 వార్డులకు 11 చోట్ల మాత్రమే పోటీకి నిలిపింది. బీజేపీ పార్టీకి చివరి దాకా ఆయా వార్డుల్లో అభ్యర్థులే లేకపోవడం శోచనీ యం. 49 వార్డులు గల కామారెడ్డి మున్సిపాలిటీలో 35వార్డుల్లోనే అభ్యర్థులకు బీ-ఫారాలు అందించారు. బాన్సువాడలో 19 వార్డులకు 10 చోట్ల బీజేపీ పోటీ చేసింది. ఎల్లారెడ్డిలో 12 వార్డులకు 10 వార్డులకే అభ్యర్థులు ముందుకు రావడం విశేషం. బాన్సువాడ మున్సిపాలిటీలో మినహా జిల్లాలో ఎక్కడా ఏకగ్రీవ వార్డులు నమోదు కాలేదు. బాన్సువాడలోని 4వ వా ర్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గైక్వాడ్‌ రుక్మిణిపై వేసిన నామినేషన్లు విత్‌ డ్రా కావడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవ మైనట్లు అధికారులు ప్రకటించారు.

బరిలో ఎంఐఎం...

ఎంఐఎం పార్టీ కామారెడ్డి మున్సిపాలిటీల్లో ఆరు చోట్ల పోటీకి తమ అభ్యర్థులను నిలబెట్టింది. మైనార్టీలు అత్యధికంగా ఉండే 5, 8, 24, 31, 42, 47 వార్డుల్లో అభ్యర్థులకు టికెట్లు ఖరారు చేసింది. బాన్సువాడలో మూడు చోట్ల ఎంఐఎం పార్టీ పోటీ చేస్తుండడం విశేషం. జిల్లా వ్యాప్తంగా మొత్తం 9 చోట్ల ఎంఐఎం పుర పోరులో నిలవడం ఆసక్తిగా నిలిచింది. ఇక సమైక్యాంధ్ర పార్టీ తెలుగుదేశం సైతం 02 చోట్ల పోటీకి నిలబడటం విశేషం. కామారెడ్డి మున్సిపాలిటీల్లో 6, 31 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. సీపీఐ, సీపీఎం సైతం పోటీకి ముందుకు వచ్చింది. కామారెడ్డిలో 8, 32 వార్డుల్లో సీపీఎం పోటీ చేస్తుండగా సీపీఐ పోటీకి అభ్యర్థులనే నిలబెట్టలేదు.


logo