సోమవారం 06 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 15, 2020 , 01:54:17

తన్నుకున్నారు !

తన్నుకున్నారు !
  • -టికెట్ల కోసం బీజేపీ, కాంగ్రెస్‌లో కుస్తీలాట
  • -బీజేపీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డిపై పిడిగుద్దులు
  • -భయంతో మున్సిపాలిటీ కార్యాలయంలోకి పరుగులు
  • -దుర్భాషలాడుతూ ఆందోళనకు దిగిన కార్యకర్తలు
  • -షబ్బీర్‌ అలీ, నయీం,కైలాస్‌ శ్రీనివాస్‌లపై కాంగ్రెస్‌ లీడర్ల తీవ్ర ఆరోపణలు
  • -ఉద్రిక్త పరిస్థితులకు వేదికగా మారిన మున్సిపాలిటీ కార్యాలయం

కౌన్సిలర్‌ టికెట్ల అంశం కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల్లో అగ్గి రాజేసింది. బీ-ఫారాలు అందని నాయకులంతా సొంత పార్టీ నేతలపైనే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టికెట్లను అంగట్లో సరుకులు అమ్ముకున్నట్లుగా విక్రయించారని ఆందోళన చేశారు. కష్టపడిన వ్యక్తులను కాదని అడ్డంగా పక్క పార్టీల నుంచి వచ్చి దూరిన వారికే టికెట్లు అందించారంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులైతే పీసీసీ సీనియర్‌ నాయకుడు షబ్బీర్‌ అలీ, ఆయన సోదరుడు నయీం, డీసీసీ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. బీ-ఫారాల ముసుగులో కాంగ్రెస్‌ పార్టీ నేతలే తమను నయవంచనకు గురి చేశారంటూ పలువురు తీవ్రంగా ఆవేదన చెందారు. దశాబ్దాలుగా పార్టీకి చేస్తున్న సేవలను గుర్తించకుండా డబ్బులున్న వారికే టికెట్లు ఇచ్చారంటూ దుర్భాషలాడారు. ఇదిలా ఉండగా ఇప్పటికే నిత్య ఘర్షణలతో సతమతం అవుతున్న బీజేపీ పార్టీలో బీ-ఫారాల లొల్లి అగ్గికి ఆజ్యం పోసినట్లుగా మారింది. బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డిపై అసంతృప్త నేతలంతా కలిసి మూకుమ్మడిగా దాడి చేశారు. టికెట్లు ఇవ్వనందుకు గాను ఆగ్రహంతో మీద పడి పిడిగుద్దులు గుద్దారు. ఒక్కసారిగా కార్యకర్తల చేతుల్లో దెబ్బలు తిన్న లక్ష్మారెడ్డి వెంటనే   మున్సిపాలిటీ కార్యాలయంలోకి పరుగు తీశాడు. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి స్వల్ప లాఠీచార్జీ  చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.
- కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ / కామారెడ్డి, నమస్తే తెలంగాణ / రాజంపేట్‌ : పురపాలక ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన మంగళవారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పలు పార్టీల నుంచి ఆశావహులు భారీగా తరలి రావడంతో మున్సిపల్‌ కార్యాలయంలో సందడి ఏర్పడింది. ఉదయం నుంచి బారులు తీరిన ఔ త్సాహికులతో ప్రాంగణం కిక్కిరిసింది. ప్రధానంగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, ముఖ్య నాయకులంతా మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకుని టికెట్ల అంశాన్ని కొలిక్కి తీసుకు వచ్చారు. గడువు సమయం దగ్గర పడిన సమయంలో పరిస్థితి కాస్తా ఉద్రిక్తతలకు దారి తీసింది. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లో అసంతృప్తి నేతలంతా ముఖ్య నాయకుల ఆదేశాలను శిరసావహించారు. తమ నామినేషన్లను వెనక్కి తీసుకుని పార్టీ సూచించిన వ్యక్తుల గెలుపునకు కృషి చేసేందుకు సిద్ధమయ్యారు. టీఆర్‌ఎస్‌ ఆశావహులంతా క్రమశిక్షణతో మెలగగా జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్‌, బీజేపీలో మాత్రం క్రమశిక్షణ ఎప్పటిలాగే పూర్తిగా గాడి తప్పి తన్నులాటకు దారి తీసింది. తమ నాయకులనే బ జారులో కొట్టే వరకూ చేరిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమైన పార్టీలకు చెందిన కార్యకర్తల ఆందోళనతో మున్సిపాలిటీ రణరంగమైంది.

మారుమోగిన షబ్బీర్‌ అలీ డౌన్‌ డౌన్‌ నినాదాలు

మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత కూడా బీ-ఫారాలు చేతికి అందకపోవడంతో కాంగ్రెస్‌ ఆశావహులంతా అవాక్కయ్యారు. అప్పటి వరకూ టికెట్లు ఇస్తామంటూ చెప్పిన నాయకులే వేరే వారికి బీ-ఫారాలు ఇవ్వడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. ఇదేమని అడిగితే స్పందించేవారు లేరు. ఫోన్లు చేస్తే స్విచ్ఛాఫ్‌ రావడంతో మున్సిపల్‌ కార్యాలయం ముందే అంతా కలిసి ఆందోళన చేశా రు. షబ్బీర్‌ అలీ డౌన్‌ డౌన్‌, నయీం డౌన్‌ డౌన్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశా రు. డీసీసీ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌ స్వ యంగా పైసల్‌ తీసుకుని బీ-ఫారాలు అందజేశారంటూ పలువురు నాయకులు ఆరోపించారు. పార్టీలో కష్టపడిన వారికి స్థానం లే కుండా చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అంటే షబ్బీర్‌ అలీ, ఆయన తమ్ముడు నయీం, కైలాస్‌ శ్రీనివాస్‌ తమ కుటుంబ పార్టీగా ఫీలవుతున్నారని, సామాన్య కార్యకర్తలను మెడ పట్టి బయటకు గెంటుతున్నారని విమర్శించారు. కామారెడ్డి పట్టణంలో మత రాజకీయాలు, కుల రాజకీయాలు నడుపుతూ కాంగ్రెస్‌ పార్టీని పూర్తిగా నాశనం చేస్తున్న వ్యక్తి షబ్బీర్‌ అలీ, ఆయన తమ్ముడు నయీంలేనని కాంగ్రెస్‌ నాయకులు మల్లేశ్‌ యాదవ్‌, కన్నయ్యలు దుయ్యబట్టారు.

బాణాల లక్ష్మారెడ్డి ఓ బ్రోకర్‌...

బీజేపీలో అసంతృప్తి జ్వాలలు మున్సిపాలిటీ ఎన్నికల సాక్షిగా భగ్గుమన్నాయి. గడిచిన ఏడాది కాలంగా ముదురుకుంటున్న విభేదాలు మంగళవారం మున్సిపల్‌ కార్యాలయంలో బయటపడ్డాయి. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి తమకు ద్రోహం చేశారంటూ రెండు వర్గాలుగా చీలిపోయిన బీజేపీ నేతలు పెద్ద ఎత్తున వ్యతిరేక నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా రూ.లక్షలకు కౌన్సిలర్‌ టికెట్లను అమ్ముకున్నారంటూ ఆరోపణలు చేశారు. బీ-ఫారాల పేరిట బీజేపీ అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి పలుమార్లు మున్సిపాలిటీ కార్యాలయంలోకి వెళ్లి రావడం కార్యకర్తలకు అయోమయానికి గురి చేసింది. ఎవరికి ఇచ్చారో? ఎవరికి ఇవ్వలేదో సమాచారం తెలియకపోవడంతో గందరగోళం నెలకొంది. సమయం అయిపోయిన తర్వాత కొంత మంది చేతికి బీ-ఫారాలు అందివ్వడం వెనుక కుట్ర దాగి ఉందంటూ ముఖ్య నాయకులపై బీజేపీ శ్రేణులు మండిపడ్డారు. నామినేషన్ల ప్రక్రియకు సమయం అయిపోయాక కౌన్సిల్‌ నుంచి బయటకు వచ్చిన బాణాల లక్ష్మారెడ్డిని వెంబడిస్తూ కార్యకర్తలు పిడిగుద్దులు గుద్దారు. కొందరైతే మీద పడి చొక్కా పట్టుకుని లాగే ప్రయత్నం చేశారు. తీవ్ర తోపులాట మధ్య కిందపడిపోతుండగా పోలీసులు రంగ ప్రవేశం చేసి బీ జేపీ శ్రేణులను చెదరగొట్టారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య పరుగులు తీసిన బాణాల లక్ష్మారెడ్డి మున్సిపల్‌ కార్యాలయం లోపలికి వెళ్లి తల దాచుకున్నారు. రోడ్డుపైనా ఆందోళన చేసిన కాషాయ పార్టీ కార్యకర్తలంతా బా ణాల కోసం ఎదురు చూడగా పోలీసులు వా రిని సుదూరానికి తరమడంతో గంటన్నర తర్వాత బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేరే మార్గం గుండా పలాయనం చిత్తగించడం కొసమెరుపు.logo