బుధవారం 08 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 13, 2020 , 01:53:19

పల్లెల్లో వికసించిన ప్రగతి

పల్లెల్లో వికసించిన ప్రగతి


ఎల్లారెడ్డి, నమస్తే తెలంగాణ: గ్రామాలను అభివృద్ధి బాట పట్టించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన పల్లె ప్రగతికి ప్రతి ఊరు ఉప్పెనలా కదిలింది. తాము సైతం అంటూ గ్రామ గ్రామానా అభివృద్ధి పనులకు సర్పంచులు, ప్రజా ప్రతినిధు లు, గ్రామస్తులు నడుం బిగించారు. ఇప్పటికే మొదటి విడతలో ప్రగతి పనులు చేసుకున్న ఆ యా గ్రామాల వారు మరోమారు పల్లె ప్రగతిలో వికసించారు. ప్రారంభించిన పనులను పూర్తి చే యడంతో పాటు కొత్త పనులను ప్రారంభించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ అమలును ప్రత్యేక అధికారులు పల్లెల్లో పర్యటించి పరిశీలించగా జిల్లా స్థాయి అధికారులు వాటిని ఆకస్మిక తనిఖీలు చేశారు. మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డితో పాటు పంచాయతీ రాజ్‌ శాఖ  మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జిల్లాలో పర్యటించి అపరిశుభ్రతపై కన్నెర్ర చేయడంతో అధికారులు స్పందించి లక్ష రూపాయల వరకు జరిమానాలు విధించారు. రెండో విడత పల్లె ప్రగతిలో గ్రా మాలు మరోమారు శుభ్రతకు నోచుకోగా విద్యుత్తు సమస్యలకు చెక్‌ పెట్టారు. మురికి కాలువలు శుభ్రం చేయడం, గ్రామాల్లో డంపింగ్‌ యా ర్డులు ఏర్పాటు చేయడం, వైకుంఠధామాలు ప్రా రంభించడం, పచ్చదనం కోసం ఇప్పటి వరకు నా టిన మొక్కలను  సంరక్షించడంతో పాటు చని పో యిన వాటి స్థానంలో కొత్త వాటిని నాటడం, ప్లాస్టిక్‌ చెత్తను సేకరించడం, అక్షరాస్యత కోసం చర్యలు చేపట్టడం, గ్రామాల్లో పచ్చదనం కోసం ప్రత్యేకంగా నర్సరీలను ఏర్పాటు చేయడం వంటి పనులు ఉద్యమ స్థాయిలో జరుగడం విశేషం. రాష్ట్ర స్థాయి ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో జిల్లాలో పనులు శభాష్‌ అనిపించుకోవడంతో జిల్లాలో పల్లె ప్రగతి వికసించిందని ప్రజలే పేర్కొంటున్నారు.

ముగిసిన రెండో విడత పల్లె ప్రగతి పనులు...

తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో ప్రారంభమైన పల్లె ప్రగతి పనులు ఆదివారంతో ముగిసాయి. ఈ నెల 2 నుంచి 11 రోజుల పాటు జరిగిన ప్రగతి పనులతో పల్లెలకు కళ వచ్చింది. ప్రతి గ్రామంలో ప్రారంభమైన పరిశుభ్రత పనులతో పాటు డంపింగ్‌ యార్డులను ఏర్పాటు చేశా రు. గ్రామాల్లో పవర్‌ వీక్‌ పనుల్లో భాగంగా అవసరమైన పనులు విద్యుత్తు శాఖ అధికారులు చేపట్టడంతో చాలా సమస్యలకు పరిష్కారం లభించింది. గ్రామాల్లో శ్మశాన వాటికల సమస్యలు ఎక్కువగా ఉండడంతో ప్రత్యేక నిధులు కేటాయించినందున వైకుంఠధామలను ఏర్పాటు చేశారు. వర్షాకాలంలో నాటిన హరితహారం మొక్కలను రక్షించేందుకు అవసరమైన కంచెలను ఏర్పాటు చేయడంతో పాటు వాటికి నీటిని పోసే ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ పై ప్రజలకు అవగాహన కల్పించిన గ్రామ స్థాయి అధికారులు చెత్త ప్లాస్టిక్‌ను వేసేందుకు ప్రతి గ్రామ శివారులో కుండీలను ఏర్పాటు చేశారు.

ప్రత్యేక అధికారుల పరిశీలనలో పనులు...

జిల్లాలో పల్లె ప్రగతి పనులు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో జరిగాయి. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల్లో విద్యాశాఖ ప్రిన్సిపాల్‌ కార్యద ర్శి జనార్ధన్‌ రెడ్డి పర్యటించారు. జిల్లాలోని లింగంపేట మండలంలో ప్రత్యేక అధికారి పీవీఎస్‌ ప్రసా ద్‌ ఆకస్మికంగా పర్యటించి పనులను అభినందించారు. కలెక్టర్‌ సత్యనారాయణతో పాటు జేసీ యాదిరెడ్డి ప్రతి రోజు ప్రగతి పనులును పర్యవేక్షించారు.పనుల్లో నిర్లక్ష్యం వహించిన వారికి కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులకు, సర్పంచులకు షోకాజు నోటీసులు జారీ చేశారు. దీంతో జిల్లాలో ని అన్ని గ్రామాల్లో పనులు ఊపందుకున్నాయి.

మంత్రి ఎర్రబెల్లి ఆదేశాలతో భారీగా జరిమానాలు...

 పల్లె ప్రగతి పనుల పరిశీలన కోసం వచ్చిన పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావ్‌ ఆదేశాలతో తాడ్వాయి మండల కేంద్రంలోని పలువురు షాపుల యజమానులకు భారీగా జరిమానాలు వేశారు అధికారులు. పర్యటనలో భాగంగా మంత్రి పలు షాపుల వద్ద ఉన్న అపరిశుభ్రతపై ప్రశ్నించారు. నిషేధించిన ప్లాస్టిక్‌ కవర్లు వాడకం, విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించడంతో స్పందించిన మండల అధికారులు అన్ని షాపులను తనిఖీ చేశారు. దీంతో జిల్లాలోని అన్ని మండలాలలో అధికారులు తనిఖీలు ప్రారంభించి చర్యలు తీసుకున్నారు.


logo