శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 12, 2020 , 05:35:49

పరువు కోసం పాకులాట..!

పరువు కోసం పాకులాట..!
  • అభ్యర్థులు లేక చతికిలపడిన బీజేపీ
  • ఇతర పార్టీలపై ఆధారపడిన కాంగ్రెస్‌
  • ఉనికి చాటుకోలేకపోయిన వామపక్ష పార్టీలు
  • పురపోరులో జాతీయ పార్టీలకు చిక్కులు
  • గులాబీ పార్టీకి పోటాపోటీగా ఆశావహులు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : బల్దియా ఎన్నికల నేపథ్యంలో జాతీయ పార్టీలు పరువు కోసం పాకులాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీ, వామపక్ష పార్టీలకు బరిలో నిలిపేందుకు అభ్యర్థులు కరువయ్యారు. ఎన్నికల సందర్భంగా బల్దియాల్లోని అన్ని వార్డుల్లో అభ్యర్థులను నిలుపలేని దుస్థితి ఏర్పడింది. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు గులాబీ పార్టీలో ఆశావహులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
పార్టీల ఆపసోపాలు..

తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకగా నిలిచిన టీఆర్‌ఎస్‌ పార్టీకి ఇంటా బయట ఆదరణ రెట్టింపు అవుతున్నది. జాతీయ పార్టీల కన్నా అత్యధిక సభ్యత్వాలను కలిగి ఉన్న గులాబీ పార్టీ వరుస ఎన్నికల్లో తిరుగులేని శక్తిగా ఏర్పడింది. గడిచిన ఏడాది కాలంలో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించి కాంగ్రెస్‌, బీజేపీలకు ముచ్చెమటలు పట్టించింది. అనంతరం వచ్చిన గ్రామ పంచాయతీ పోరులోనూ గులాబీ పార్టీ బలపర్చిన అభ్యర్థులే విజయం సాధించి గ్రామ స్థాయిలోనూ బలోపేతమైంది.
ఇక సార్వత్రిక ఎన్నికల్లోనూ అదే విధమైన సత్తాను చాటి ఇరు పార్టీలకు బుద్ధి చెప్పింది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ భారీ విజయాన్ని కైవసం చేసుకుని జడ్పీ పీఠాలను, మండల పరిషత్‌ అధ్యక్ష స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకున్నది. వరుసగా జరిగిన అన్ని ఎన్నికల్లోనూ కనీస ప్రాధాన్యత స్థాయిని అందుకోలేక పోయిన జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఐ, సీపీఎంలు తాజాగా మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఘోరంగా పరాభావాన్ని ఎదుర్కొనబోతున్నట్లుగా స్పష్టం అవుతున్నది. ఈనెల 22న జరిగే పురపాలక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయా పార్టీలైతే అభ్యర్థుల కోసం పాకులాడడం విస్తు గొలుపుతున్నది. వార్డులకు కౌన్సిలర్‌గా పోటీ చేసేందుకు ఔత్సాహికులే ముందుకు రాకపోవడంతో ఆ పార్టీ బలాబలాలను ఇట్టే తెలియజేస్తున్నదని ప్రజలంతా గుసగుసలాడుతున్నారు. నిత్యం ఆయా పార్టీల నాయకులు చేసే భారీ ప్రకటనలకు క్షేత్ర స్థాయిలో పరిస్థితికి ఉన్న తేడాను ఓటర్లు నిశితంగా గమనిస్తున్నట్లుగా విశ్లేషకులు కూడా చెబుతున్నారు.

కంగుతిన్న బీజేపీ..

కామారెడ్డి మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల కోసం చివరి దాకా వెంపర్లాడింది. ఎవరొస్తే వారికి బి-ఫారాలను ఇచ్చేందుకు సిద్ధమైనప్పటికీ ఔత్సాహికులు ముఖం చాటేయడంతో కాషాయ పార్టీ కంగుతినాల్సి వచ్చింది. కామారెడ్డి మున్సిపాలిటీలో 4, 5, 20, 21, 22, 23, 25, 28, 29, 30, 48, 49 వార్డుల్లో కనీసం ఒక్క నామినేషన్‌ దాఖలు కాకపోవడం ఆ పార్టీ పరిస్థితిని కండ్లకు కడుతున్నది.

మిగిలిన చోట ఒక్కొక్కరుగా వచ్చి చివరి నిమిషంలో నామినేషన్లు వేసి పరువు నిలుపుకొనే ప్రయత్నం చేశారు. ఎల్లారెడ్డిలో 12 వార్డులకు గాను బీజేపీ నుంచి 12 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. అందులో 5, 8 వార్డుల్లో ఒక్కటీ దాఖలు కాకపోవడం గమనార్హం. బాన్సువాడలోనూ కాషాయ పార్టీకి స్పందనే లేదు. వార్డు నెంబర్లు 1, 2, 3, 4, 8, 15, 16, 17, 19లో ఆ పార్టీ నుంచి ఒక్క నామినేషన్‌ కూడా రాలేదంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు.

‘హస్త’వ్యస్తం..

అసెంబ్లీ ఎన్నికల నుంచి వరుసగా పరాజయం మూట కట్టుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీకి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. పురపాలక ఎన్నికల్లో ఎలాగైనా గులాబీ పార్టీకి పోటీ ఇచ్చేందుకు చేయరాని ప్రయత్నాలు చేశారు. చివరకు అభ్యర్థులు లేక ఆగమాగం కావాల్సి వచ్చింది. టీఆర్‌ఎస్‌ పార్టీలో టికెట్‌ రాక నిరాశకు గురైన వారినే టార్గెట్‌ చేసుకొని వారికి పిలిచి మరీ బి-ఫారాలు అందించాల్సిన పరిస్థితి కాంగ్రెస్‌కు ఎదురవ్వడం గమనార్హం. షబ్బీర్‌ కంచుకోటగా చెప్పుకొనే కామారెడ్డి పాత పట్టణంలోనూ అభ్యర్థులంతగా నామినేషన్లు వేసేందుకు ఆసక్తి చూపలేదు. పోరు ఏకపక్షంగానే ఉంటుందనే భావనలో చాలా మంది గులాబీ పార్టీ నుంచి టికెట్‌ కోసమే ప్రయత్నించారు. టీఆర్‌ఎస్‌ టికెట్‌ వస్తే కౌన్సిలర్‌గా గెలిచినట్లే అన్న భావనతో అనేక మంది ఆయా వార్డులకు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. బాన్సువాడ, ఎల్లారెడ్డిలోనూ టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థులనే హుటాహుటిన హస్తం పార్టీలోకి ఆహ్వానించి టికెట్లు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్‌కు ఎదురైందంటే పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు.

టీడీపీ కనుమరుగు.. పత్తాలేని వామపక్షాలు..

దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశం, వామపక్ష పార్టీలకు పురపాలక ఎన్నికలు గడ్డు కాలాన్ని మోసుకొచ్చినట్లు అయ్యింది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో ఆ పార్టీల నుంచి వచ్చిన నామినేషన్లు అత్యల్పం. ఒక వార్డుకు దాఖలైన సీపీఐ, సీపీఎం, టీడీపీ అభ్యర్థుల నామినేషన్ల కంటే ఒకే వార్డుకు వచ్చిన టీఆర్‌ఎస్‌ నామినేషన్లే ఎక్కువగా ఉండడం విశేషం. ఎల్లారెడ్డిలో వామపక్షాలు, టీడీపీ నుంచి ఒక్క నామినేషన్‌ రాలేదు. కామారెడ్డి మున్సిపాలిటీలో ఇద్దరు, బాన్సువాడలో ఒకరు చొప్పున టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కామారెడ్డిలో సీపీఐ నుంచి ఒకటి, సీపీఎం నుంచి ఒకే వార్డుకు నామినేషన్లు రావడం విడ్డూరం. బాన్సువాడలోనూ సీపీఐ నుంచి రెండు వార్డులకు, సీపీఎం నుంచి మూడు వార్డులకు మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయి. మరోవైపు ఈనెల 14న మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఉంది. అంతలోపే ఇతర పార్టీల నేతలకు బి-ఫారాలు అందించి తమ అభ్యర్థులుగా ప్రకటించుకునేందుకు జాతీయ పార్టీలు కుటిల ప్రయత్నాలకు తెర లేపినట్లు తెలుస్తున్నది.


logo