బుధవారం 08 ఏప్రిల్ 2020
Kamareddy - Jan 12, 2020 , 02:28:50

నిరక్షరాస్యత సర్వే పూర్తి చేయాలి

నిరక్షరాస్యత సర్వే పూర్తి చేయాలికామారెడ్డి, నమస్తే తెలంగాణ : జిల్లాలో నిరక్షరాస్యత సర్వే పూర్తి చేయాలని కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. మండల అభివృద్ధి అధికారులు, తహసీల్దార్లు, మండల పంచాయతీ అధికారులు, ఏపీవోలతో శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంపై సమీక్షించారు. 30 రోజుల కార్యాచరణ, ప్రస్తుతం రెండో విడత పల్లెప్రగతి కార్యక్రమాన్ని రాష్ట్రస్థాయిలో ఫ్లయింగ్‌ స్కాడ్స్‌ గ్రామాల్లో తిరిగి పరిశీలిస్తున్నారన్నారు. లక్ష్యాలు పూర్తి కాని గ్రామాల్లో వెంటనే పనులు పూర్తి చేసి నివేదికలు పంపాలని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో 125 ట్రాక్టర్లు కొనుగోలు చేశామని, 250 ట్రాక్టర్లు పంపిణీ దశలో ఉన్నాయని, మిగిలిన లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. ప్రతి గ్రామానికి వైకుంఠధామం, డంపింగ్‌యార్డు తప్పనిసరిగా ఉండాలన్నారు. స్థల సేకరణ జరగని గ్రామాల్లో వెంటనే సేకరణ చేపట్టి పనులు ప్రారంభించాలని సూచించారు. పల్లెప్రగతి పనులకు సంబంధించి బిఫోర్‌, ఆఫ్టర్‌ ఫొటోలు పంపాలన్నారు. నర్సరీల్లో మొక్కల పెంపకం పనులు ప్రారంభించాలని, ఇందుకు సంబంధించిన వివరాలు నమోదు చేయాలన్నారు. వంద శాతం మొక్కల సంరక్షణ చేపట్టాలని, ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటాలని అన్నారు. గ్రామాల్లో ప్రధాన రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలు తొలగించాలని, గ్రామాల పరిశుభ్రతకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కమ్యూనిటీ ప్రభుత్వ భవనాల్లో ఇంకుడు గుంతల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో చంద్రమోహన్‌రెడ్డి, జడ్పీ సీఈవో కాంతమ్మ, డీఎఫ్‌వో వసంత, జిల్లా మత్స్యశాఖ అధికారిణి పూర్ణిమ, పంచాయతీ రాజ్‌ ఈఈ సిద్ధిరాములు  పాల్గొన్నారు. 


logo