మంగళవారం 31 మార్చి 2020
Kamareddy - Jan 10, 2020 , 12:32:06

ఎడపల్లిలో పారిశుద్ధ్యం ఇంత అధ్వానమా!

ఎడపల్లిలో పారిశుద్ధ్యం ఇంత అధ్వానమా!

ఎడపల్లి: మండల కేంద్రం ఎడపల్లిలో పల్లె ప్రగతి పనులను కలెక్టర్ నారాయణరెడ్డి గురువారం పరిశీలించారు. గ్రామంలోని పలు వీధులను ఆయన కాలినడకన పర్యటించి పరిసరాలను పరిశీలించారు. గ్రామంలో ఎక్కడ చూసినా చెత్తాచెదారం పేరుకుపోవడం, అపరిశుభ్రత, ప్లాస్టిక్ కవర్లు కనిపించడం, రోడ్లు శుభ్రంగా లేకపోవడం వంటి దృశ్యాలు కలెక్టర్ కంట పడ్డాయి. వీటిపై గ్రామ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, ఎంపీడీవోను కలెక్టర్ ప్రశ్నించగా.. వారు సరైన సమాధానం చెప్పక పోవడంతో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మండల కేంద్రమైన ఎడపల్లి కంటే మారుమూల పల్లెల్లో పరిస్థితులు బాగున్నాయని, పల్లెప్రగతి పనులుపై జారీచేసిన ఆదేశాలు ఏ ఒక్కరూ పాటించలేదని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యుడిని చేస్తూ గ్రామ కార్యదర్శి నగేశ్‌ను సస్పెండ్ చేశారు. సర్పంచ్ ఆకుల మాధవి, ఎంపీడీవో శంకర్‌కు నోటీసులు జారీ చేశారు.

గ్రామంలో కలియదిరిగిన కలెక్టర్..
కలెక్టర్ నారాయణరెడ్డి బుధవారం ఎడపల్లిలో కలియ దిరిగారు. ముందుగా మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్న ఆయన.. ఎంపీడీవో కార్యాలయంలో ఉద్యోగుల అటెండెన్స్ రిజిస్టర్‌ను పరిశీలించారు. ఉద్యోగుల పేర్లు చదువుతూ అందరూ విధులకు హాజరయ్యారా లేదా అని పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఉద్యోగుల అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించారు. తహసీల్ కార్యాలయానికి పెయింట్ వేసి అందంగా తీర్చిదిద్దాలని తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్‌ను ఆదేశించారు. అక్కడి నుంచి వెళ్లి పశువుల దవాఖానను తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీ వారు నీటి సౌకర్యం కల్పించడం లేదని వైద్యుడు జైపాల్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే కుళాయి కనెక్షన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత ఎస్సీ వాడలో కాలినడకన కలెక్టర్ తిరిగారు. వాడలో చెత్తాచెదారం, అపరిశుభ్రం పేరుకుపోవడంతో కార్యదర్శి , సర్పంచ్‌పై అసహనం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి ఎడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లి కలెక్టర్ తనిఖీలు చేశారు. పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు ఉండడంతో శ్రమదానం చేయలేదా అంటూ హెచ్‌ఎంను ప్రశ్నించారు. హెచ్‌ఎం సాయిలుకు మెమో జారీ చేయాలని ఆదేశించారు. అనంతరం తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడి 100 డిక్షనరీలను అందజేశారు. కలెక్టర్ వెంట జడ్పీ సీవో గోవింద్, జడ్పీ వైస్ చైర్ పర్సన్ రజితాయాదవ్, ఎంపీపీ కొండెంగల శ్రీనివాస్, ఎంపీడీవో శంకర్, తహసీల్దార్ అశోక్‌కుమార్, ఈవోపీఆర్డీ వేణుగోపాల్, సర్పంచ్ ఆకుల మాధవి, టీఆర్‌ఎస్ నాయకుడు ఎల్లయ్య యాదవ్ తదితరులు ఉన్నారు.


logo
>>>>>>