దివ్యాంగులు ఆర్థికంగా ఎదగాలి
లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలో కలెక్టర్ జితేశ్ పాటిల్
కామారెడ్డి టౌన్, జనవరి 4 : దివ్యాంగులు వైకల్యం ఉందని బాధపడొద్దని, పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో మంగళవారం లూయిస్ బ్రెయిలీ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నతమైన వ్యక్తి లూయిస్ బ్రెయిలీ అని పేర్కొన్నారు. అంధులు ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించాలని సూచించారు. స్వయం ఉపాధి కోసం బ్యాంకుల ద్వారా రుణాలు పొంది ఆర్థికంగా ఎదగాలని కోరారు. జిల్లా గ్రంథాలయంలో కంప్యూటర్ గదిలో ఐదు కంప్యూటర్లు అంధులకు కేటాయించి బ్రెయిలీ లిపి సాఫ్ట్వేర్ ఏర్పాటు చేయిస్తామన్నారు. ఈ అవకాశాన్ని అంధులు వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణించిన అంధులను సన్మానించారు. అనంతరం బ్రెయిలీ లిపి 2022 క్యాలెండరును ఆవిష్కరించారు. సమావేశంలో ఇన్చార్జి జిల్లా అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, జిల్లా మహిళా శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ అధికారిణి సరస్వతి, మెప్మా పీడీ శ్రీధర్ రెడ్డి, దివ్యాంగులు పాల్గొన్నారు.
పల్లె ప్రకృతి వనం పనులను వేగవంతం చేయాలి
బృహత్ పల్లె ప్రకృతి వనాల పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని కలెక్టర్ జితేశ్ పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో మంగళవారం మండల స్థాయి అధికారులతో పల్లె ప్రగతి పనులపై సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లోని నర్సరీల్లో బ్యాగ్ ఫిల్లింగ్ పూర్తిచేయాలని సూచించారు. బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో 100 శాతం మొక్కలు నాటడం పూర్తిచేయాలని ఆదేశించారు.