అందుబాటులో ఆక్సిజన్ బెడ్లు
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
పరకాల సివిల్ హాస్పిటల్లోకరోనా వార్డు పరిశీలన
శానిటేషన్ పనులపై ఎమ్మెల్యే ఆగ్రహం
పరకాల, మే 24 : ప్రభుత్వ దవాఖానల్లోనే కరోనాకు మెరుగైన చికిత్స అందుతున్నదని, బాధితులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందిపడొద్దని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం ఆయన పరకాల పట్టణంలోని సివిల్ ఆస్పత్రిని సందర్శించారు. నూతనంగా అందుబాటులోకి రానున్న ఆక్సిజన్ బెడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా కట్టడికి ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరిస్తున్నదన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ బెడ్ల నుంచి ఆక్సిజన్ బెడ్ల వరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పట్టణంలోని సివిల్ వైద్యశాలలో రెండు మూడు రోజుల్లో ఆక్సిజన్ బెడ్లు అందుబాటులోకి వస్తాయన్నారు. రానున్న రోజుల్లో మరికొన్ని ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కలిసి విన్నవించగా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. కాగా, దవాఖాన ఆవరణలో చె త్త పేరుకుపోవడాన్ని చూసిన ఎమ్మెల్యే శానిటేషన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శానిటేషన్ సిబ్బంది ఉన్నా మున్సిపల్ సిబ్బందితో పారిశుధ్య పనులు ఎందుకు చేయిస్తున్నారని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ సంజీవయ్యను ప్రశ్నించారు. రెండు రోజుల్లో మళ్లీ సందర్శిస్తానని, దవాఖాన ఆవరణంతా పరిశుభ్రంగా ఉండాలన్నారు.
త్వరలోనే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు
పట్టణంలో త్వరలోనే అత్యాధునిక హంగులతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే చల్లా తెలిపారు. సోమవారం డాబ్ బంగ్లా పరిసరాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక కూరగాయల మార్కెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ప్రజలు, వ్యాపారులకు ఇబ్బంది కలుగకుండా కూరగాయల మార్కెట్‌ను తాత్కాలికంగా ఓపెన్ ప్లేస్‌కు తరలించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనితా రామకృష్ణ, వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శేషాంజన్ స్వామి, జడ్పీటీసీ సిలివేరు మొగిలి, ఎంపీపీ తక్కళపల్లి స్వర్ణలత, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.