గర్భిణులు, బాలింతల కోసం టోల్ ఫ్రీ నంబర్
24గంటలు పనిచేసేలా సౌలత్
అందుబాటులో గైనకాలజిస్టులు,మహిళా వైద్య నిపుణులు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం
వరంగల్‌రూరల్, మే 4(నమస్తేతెలంగాణ): కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం గర్భిణులు, బాలింతలకు ఫోను ద్వారా వైద్య సేవలంచేందుకు టోల్‌ఫ్రీ నంబర్ 180059912345 ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కార్యాలయంలో ప్రతి రోజూ ఇరవై నాలుగు గంటలు ఇది పని చేయనుంది. ఈ టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేస్తే ఆయా జిల్లాలోని గైనకాలజిస్టులు, మహిళా వైద్య నిపుణులు గర్భిణులు, బాలింతలకు ఫోను ద్వారా కౌన్సెలింగ్, వైద్య సేవలు, సలహాలు అందిస్తారు. ఇందుకోసం ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఒక సూపర్వైజర్ను నియమించారు. సబ్ సెంటర్లు, గ్రామాలు ఎక్కువగా ఉన్న కొన్ని పీహెచ్‌సీలకు ఇద్దరు సూపర్వైజర్లను కేటాయించారు. నిరంతరం పనిచేసే టోల్‌ఫ్రీ నెంబర్లో ప్రత్యేక వైద్యు లు, గైనకాలజిస్టులు, మహిళా వ్యాధి నిపుణులతోపాటు సూపర్వైజర్లు అందుబాటులో ఉంటారని వరంగల్ రూరల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి చల్లా మధుసూదన్ వెల్లడించారు.
సేవలందే విధానం..
దవాఖానకు వెళ్లలేని స్థితిలో గర్భిణులు, బాలింతలు టోల్‌ఫ్రీ నంబర్ 18005 9912345కి ఫోను చేస్తారు. వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు కాల్ రిసీవ్ చేసుకుని కాల్ చేసిన వారి వివరాలు నమోదు చేస్తారు. వెంటనే సంబంధిత గైనకాలజిస్టు, మహిళా వైద్య నిపుణులను కాన్ఫరెన్స్‌లోకి తీసుకుంటారు. ఫోన్ చేసిన వారికి వాట్సాప్ కాల్ ద్వారా మాట్లాడే అవకాశం ఉంటే గైనకాలజిస్టు, మహిళా వైద్య నిపుణులు వీడియో కాల్ ద్వారా కౌన్సెలింగ్ ఇచ్చి వైద్య సలహాలు, సేవలందిస్తారు. ఈ వసతి లేని వారికి ఫోన్ ద్వారా కాన్ఫరెన్స్ కాల్‌లోనే వైద్య సలహాలు ఇస్తా రు. వారి సమస్యలు, సందేహాలను నివృత్తి చేస్తారు. టోల్‌ఫ్రీ నంబరు ద్వారా గర్భిణులు, బాలింతలు ఫోన్ ద్వారా చెప్పిన సమస్యలు, వైద్యులు అందించిన సేవలన్నీ రికార్డు అవుతాయి. ఇది కాల్ చేసిన గర్భిణి, బాలింత గ్రామం, పట్టణం, నగరంలోని సంబంధిత పీహెచ్‌సీకి చేరుతుంది. కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సమ యంలో అక్కడి సూపర్వైజర్ కూడా లైన్లో ఉండి పర్యవేక్షిస్తారు. టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా గైనకాలజిస్టులు, మహిళా వైద్య నిపుణులు గర్భిణి, బాలింతలకు ట్రీట్ మెంట్ కూడా చేస్తారు. ఇంటి నుంచే గర్భిణి, బాలింతలు ఫోన్‌ద్వారా తమ సమ స్యలు, సందేహాలు చెప్పడం ద్వారా సులువుగా వైద్య సేవలు పొందవచ్చు. ఈ సేవలు 100 వంటివని చెప్పవచ్చు.