e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home జయశంకర్ సైబర్‌ నేరాల కట్టడే లక్ష్యంగా..

సైబర్‌ నేరాల కట్టడే లక్ష్యంగా..

సైబర్‌ నేరాల కట్టడే లక్ష్యంగా..

ఒక్కో పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులతో ఎంపిక
భూపాలపల్లి జిల్లాలో 50పాఠశాలలకు వాట్సాప్‌ గ్రూపులు
‘సైబర్‌ కాంగ్రెస్‌’ పేరుతో ఆన్‌లైన్‌లో తరగతులు
సరికొత్త విధానానికి విద్యాశాఖ, మహిళా రక్షణ విభాగం పోలీసుల శ్రీకారం
బాలికలపై ఆగడాలు, అకృత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు దోహదం

సైబర్‌ నేరగాళ్లకు చిక్కకుండా విద్యార్థుల్లో చైతన్యం కలిగించి వాటికి అడ్డుకట్ట వేయడంతో పాటు బాలికల భద్రతకు భంగం వాటిల్లకూడదనే లక్ష్యంతో రాష్ట్ర విద్యాశాఖ, మహిళా రక్షణ విభాగం పోలీసులు కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆరు నుంచి పదో తరగతి చదివే విద్యార్థులను పాఠశాలకు ఇద్దరు చొప్పున ఎంపిక చేసి ‘సైబర్‌ కాంగ్రెస్‌’ పేరిట ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈమేరకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 50 పాఠశాలల నుంచి చురుకైన 100మంది విద్యార్థులను ఎంపిక చేసి వారం రోజుల నుంచి జూమ్‌ యాప్‌ ద్వారా శిక్షణ ఇస్తున్నారు.

భూపాలపల్లిలో 50 బృందాల ఏర్పాటు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో మొత్తం 425 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ఎక్కువమంది విద్యార్థులు చదువుకుంటున్న 50 పాఠశాలలను విద్యాశాఖ అధికారులు ఎంపిక చేశారు. ముఖ్యంగా బాలికల భద్రతకు సంబంధించిన అంశం కావడంతో జిల్లాలోని అన్ని కేజీబీవీలను భాగస్వామ్యం చేశారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో 8, 9, 10 తరగతుల నుంచి ఇద్దరు విద్యార్థులను ఎంపిక చేశారు. ఇందులో ఒకరు బాలురు, ఒకరు బాలిక ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లా నుంచి మొత్తం 100మంది విద్యార్థులను సైబర్‌ కాంగ్రెస్‌ బృందంగా జిల్లా విద్యాశాఖ అధికారులు ఎంపిక చేశారు. అలాగే ఇందులో స్థానిక పోలీస్‌, షీటీం సిబ్బంది, డీఎస్పీ సభ్యులుగా ఉంటారు. ఈ బృందాన్ని సమన్వయపర్చేలా జిల్లాస్థాయి అధికారిని సమన్వయకర్తగా నియమించారు. వీరికి సైబర్‌ నేరాలపై విద్యావేత్తలు, మేధావులతో ఆన్‌లైన్‌లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయనున్నారు. అనంతరం 50 బృందాల పేరు మీద 50 వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్‌లో శిక్షణ పొందిన ఇద్దరు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు కలిసి పాఠశాలల్లోని మిగతా విద్యార్థులకు సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు. పాఠశాలలు ప్రారంభమైన వెంటనే సైబర్‌ బృందాలకు శిక్షణ తరగతులు ప్రారంభించే అవకాశం ఉందని జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు.

సైబర్‌ కాంగ్రెస్‌ వల్ల ఉపయోగాలు..
విద్యార్థులకు సైబర్‌ నేరాలపై ప్రతి వారం తరగతులు నిర్వహిస్తారు. సమస్యలకు పరిష్కారం చూపుతారు. ఇంటర్నెట్‌ను ఏవిధంగా సద్వినియోగం చేసుకోవాలో చెబుతారు. తరచూ సర్వేల పేరుతో విద్యార్థుల నుంచి సమాచారం సేకరిస్తారు. ఇందులో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను భాగస్వామ్యం చేస్తారు. నిపుణులతో ఎప్పటికప్పుడు అవగాహన కల్పించి సందేహాలను నివృత్తి చేస్తారు.

రాష్ట్రంలో కరోనా విజృభించడంతో విద్యార్థుల విద్యాసంవత్సరం నష్టపోకుండా ప్రభుత్వం మొన్నటివరకు ఆన్‌లైన్‌ తరగతుల ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు అవకాశమిచ్చింది. అయితే ఈ సమయంలో తల్లిదండ్రులు విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్లు ఇప్పించడంతో ఆన్‌లైన్‌ క్లాసులతో పాటు ఇతర యాప్‌లు ఉపయోగించడం, ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడడం, స్మార్ట్‌ఫోన్‌పై పూర్తి అవగాహ న లేకపోవడంతో సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారు. అలాగే బాలికల భద్రత విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సరైన దృష్టి పెట్టకపోవడం వల్ల కొందరు పెడదారిన పడుతున్నారని విద్యాశాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. ఈక్రమంలో షీటీం, మహిళా పోలీస్‌ విభాగం ఆధ్వర్యంలో సైబర్‌ కాంగ్రెస్‌ పేరుతో బృందాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది.

విజయవంతంగా నిర్వహిస్తాం..
ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లాలో 50 పాఠశాలలను ఎంపిక చేశాం. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయ్యింది. సామాజిక స్పృహ, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన విద్యార్థులు, ఉపాధ్యాయులను బృందంలో సభ్యులుగా చేర్చాం. విద్యార్థుల సెల్‌ నెంబర్లతో వాట్సాప్‌ గ్రూప్‌లు ఏర్పా టు చేసి ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ ఇస్తున్నాం. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తాం.

శివరంజని, జిల్లా సమన్వయకర్త

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సైబర్‌ నేరాల కట్టడే లక్ష్యంగా..

ట్రెండింగ్‌

Advertisement