e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 9, 2021
Home జనగాం కాకతీయుల శిల్పకళ ప్రపంచానికి దిక్సూచి

కాకతీయుల శిల్పకళ ప్రపంచానికి దిక్సూచి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త కృషితోనే రామప్పకు యునెస్కో గుర్తింపు
సబ్సిడీ ధరలతో పర్యాటకులకు విమాన యానం
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి
సీఎం కేసీఆర్‌ చొరవతోనే రామప్పకు అరుదైన గౌరవం
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
రామప్ప, వేయిస్తంభాల ఆలయం, వరంగల్‌ కోట సందర్శన

ములుగు, అక్టోబర్‌ 21(నమస్తేతెలంగాణ)/ వెంకటాపూర్‌/ ములుగు రూరల్‌/ హనుమకొండ చౌరస్తా/ ఖిలావరంగల్‌ : అతి ప్రాచీన కట్టడమైన రామప్ప ఆలయం ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు సాధించడం ద్వారా కాకతీయుల కట్టడాలు శిల్పకళలో ప్రపంచానికి దిక్సూచిగా మారాయని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి అన్నారు. గురువారం ములుగు జిల్లాలోని వెంకటాపూర్‌ మండలం పాలంపేటలోని కాకతీయ రుద్రేశ్వర (రామప్ప) ఆలయంలో యునెస్కో శిలా ఫలకాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో నిరాదరణకు గురైన తెలంగాణ సాంస్కృతి, సంప్రదాయాలకు ఇప్పుడిప్పుడే గుర్తింపు లభిస్తున్నదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త కృషితో 800 ఏళ్ల చరిత్ర కలిగిన రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వచ్చిందన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకుల కోసం వరంగల్‌ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి పర్యాటకులకు మెరుగైన ప్రయాణ వసతిని కల్పించనున్నట్లు తెలిపారు. ఉడాన్‌ పథకం ద్వారా సబ్సిడీ ధరలకు విమాన టికెట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

- Advertisement -

తెలంగాణలో అడుగడుగునా చరిత్రే : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
తెలంగాణలో అడుగగుడునా ఘన చరిత్ర దాగి ఉందని, రామప్పకు యునెస్కో గుర్తింపు తేవడంలో సీఎం కేసీఆర్‌ చేసిన కృషి ఎంతో గొప్పదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. గత పాలకులు చారిత్రక నిర్మాణాలపై పూర్తి నిర్లక్ష్యం చేశారని, నేడు వాటికి సీఎం కేసీఆర్‌ వన్నె తెస్తున్నారన్నారు. యునెస్కో గుర్తింపు కోసం 20ఏళ్లుగా కృషి చేసిన కాకతీయ హెరిటేజ్‌ సభ్యులు నిట్‌ ప్రొఫెసర్‌ పాండురంగారావు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి పాపారావుల కృషి మరువలేనిదన్నారు. రామప్ప అభివృద్ధి కోసం ఇప్పటికే 50 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ గిరిజన యూనివర్సిటీకి కేంద్రం త్వరగా నిధులు మంజూరు చేయాలని, మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలన్నారు. అంతకుముందు గట్టమ్మ ఆలయం వద్ద హరిత గ్రాండ్‌ గట్టమ్మ హోటల్‌ను కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రారంభించి గట్టమ్మ తల్లికి మొక్కులు చెల్లించారు.

వేయిస్తంభాల ఆలయంలో కల్యాణ మండపం పనులు వెంటనే పూర్తిచేయాలి
వంద రోజుల్లో వేయిస్తంభాల ఆలయంలోని కల్యాణమండపం పనులు పూర్తి చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం హనుమకొండలోని వేయిస్తంభాల ఆలయాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి సందర్శించారు. వారికి ఆలయ ప్ర ధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో స్వా గతం పలికి తీర్థప్రసాదాలు, శేషవస్ర్తాలు అందజేశారు. త్రికూటాలయంలో రుద్రేశ్వరుడు, వాసుదేవర, సూర్యదేవర విగ్రహాలుండేవని ముష్కరుల దాడిలో విష్ణు, సూర్య విగ్రహాలు ధ్వంసమయ్యాయని, ఇక్కడ విష్ణు, సూర్య, విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు అనుమతివ్వాలని ఉపేందశర్మ కోరారు.

త్వరలో మామునూరుకు విమానాలు
మామునూర్‌ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు త్వరలో ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి వరంగల్‌ కోటలో కాకతీయుల కీర్తితోరణాలను, శిల్పసంపదను, సౌండ్‌ అండ్‌ లైట్స్‌ షోను వీక్షించారు. మంత్రుల వెంట రాష్ట్ర టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ గుప్తా, కలెక్టర్లు కృష్ణ ఆదిత్య, బీ గోపి, ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌, కాకతీయ హెరిటేజ్‌ సభ్యులు ప్రొఫెసర్‌ పాండురంగారావు, టూరిజం ఎండీ మనోహర్‌రావు, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, డీటీవో శివాజీ, కేంద్ర పురావస్తు శాఖ సూపరింటెండెంట్‌ స్మిత ఎస్‌. కుమారి, డైరెక్టర్‌ విద్యావతి, రాష్ట్ర పర్యాటక శాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరాజు శివాజీ, రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు రాములునాయక్‌, నాగరాజు, అసిస్టెంట్‌ టూరిజం ఆఫీసర్‌ కుసుమ సూర్యకిరణ్‌, ములుగు ఆర్డీవో రమాదేవి, ఎంపీపీ బుర్ర రజిత, జడ్పీటీసీ రుద్రమదేవి, సర్పంచ్‌ డోలి రజిత పాల్గొన్నారు. మంత్రుల పర్యటన సందర్భంగా ములుగులో ఏఎస్పీలు సాయిచైతన్య, గైస్‌ ఆలాం, రూపేశ్‌కుమార్‌, డీఎస్పీ దేవేందర్‌రెడ్డి, సీఐలు శ్రీధర్‌, రవీందర్‌ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement