శుక్రవారం 05 మార్చి 2021
Jayashankar - Feb 24, 2021 , 01:41:12

లక్షణాలు లేకున్నా పరీక్షలు చేయించుకోవాలి

లక్షణాలు లేకున్నా పరీక్షలు చేయించుకోవాలి

  • నేటి నుంచి అన్ని పీహెచ్‌సీల్లో కరోనా నిర్ధారణకు ప్రత్యేక చర్యలు
  • జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి సుధార్‌ సింగ్‌  
  • జిల్లా కేంద్రంలోని పీహెచ్‌సీ తనిఖీ 

 కృష్ణకాలనీ, ఫిబ్రవరి 23: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని అన్ని మండలాల్లోని ప్రజలు కరోనా లక్షణాలు ఉన్నా లేకున్నా స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి సుధార్‌సింగ్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కారల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం నుంచి జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ఓపీ పేషెంట్లకు తప్పకుండా కరోనా పరీక్షలు చేయాలని అన్నారు. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల్లో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అనవసర ప్రయాణాలు మానుకోవాలన్నారు. పీహెచ్‌సీలతోపాటు సామాజిక ఆరోగ్య కేంద్రాలు, బస్‌ స్టేషన్లు, మొబైల్‌ టీమ్స్‌ ద్వారా కరోనా టెస్టులు చేస్తున్నామని అన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్ర సంచాలకుడు శ్రీనివాస్‌ ఆదేశాల మేరకు జిల్లాలో కరోనా నివారణ చర్యలు తీసుకుంటున్నామని డీఎంహెచ్‌వో తెలిపారు. అనంతరం భూపాలపల్లి పీహెచ్‌సీలోని హాజరు రిజిస్టరును పరిశీలించారు. ఆయన వెంట వైద్యుడు బోడ రవికుమార్‌ నాయక్‌, సీహెచ్‌వో రాజయ్య, పీహెచ్‌సీ సిబ్బంది ఉన్నారు.    

అప్రమత్తంగా ఉండాలి 

ములుగురూరల్‌, ఫిబ్రవరి23: కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టినప్పటికీ పక్క రాష్ర్టాల్లో వస్తున్న పాజిటివ్‌ కేసుల దృష్ట్యా జిల్లాలోని వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రజలను చైతన్యవంతులను చేయాలని  ములుగు డీఎంహెచ్‌వో అల్లెం అప్పయ్య అన్నారు. జిల్లాలోని వైద్యాధికారులు, సూపర్‌వైజర్లకు డీఎంహెచ్‌వో తన కార్యాలయం నుంచి జూమ్‌ యాప్‌లో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రతి రోజు 50కి తగ్గకుండా కరోనా పరీక్షలను నిర్వహించాలని అన్నారు. ఇతర రాష్ర్టాల నుంచి వలస వస్తున్న కూలీలకు కరోనా పరీక్షలు నిర్వహించాలని వైద్యాధికారులను ఆదేశించారు. జనసమూహాలు అధికంగా ఉన్న సమయాల్లో టెస్టుల సంఖ్య పెంచాలని అన్నారు. 


VIDEOS

logo