సింగరేణి ఉద్యోగాల్లో ఆరు శాతం రిజర్వేషన్ కల్పించాలి

- సింగరేణి ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్
- కేంద్ర కమిటీ అధ్యక్షుడు పంతులయ్య
భూపాలపల్లి రూరల్, ఫిబ్రవరి7: సింగరేణి ఉద్యోగాల్లో ఎస్టీలకు ఆరు శాతం రిజర్వేషన్ కల్పించాలని సింగరేణి ఎస్టీ ఎంప్లాయిస్ వెల్పేర్ అసోసియేషన్ కేంద్ర కమిటీ అధ్యక్షుడు పంతులయ్య అన్నారు. ఆదివారం సింగరేణి ఇల్లందు క్లబ్ హౌస్‌లో సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సింగరేణి ఎస్టీ ఎంప్లాయీస్ వెల్పేర్ అసోసియేషన్ కేంద్ర కమిటీ అధ్యక్షుడు హాజరై మాట్లాడారు. అంతకుముందు 11 ఏరియాల నుంచి వచ్చిన సింగరేణి ఎస్టీ ఉద్యోగులతో కలిసి అంబేద్కర్, కొమురంభీం, సేవాలాల్ మహరాజ్‌ల చిత్ర పటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర కమిటీ అధ్యక్షుడు మాట్లాడుతూ సింగరేణిలో ప్రస్తుతం 4 శాతం మాత్రమే గిరిజన ఉద్యోగులను ఎంపిక చేసుకుంటున్నందున గిరిజన యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. తమకు రావాల్సిన 6 శాతం రిజర్వేషన్లను తమకే కేటాయించాలని కోరారు. అనంతరం కొత్త కమిటీలను నియమించారు. కార్యక్రమంలో సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ బీ.నాగేశ్వర్రావు, చీఫ్ లైజన్ అధికారి క్రిష్టయ్య, భూపాలపల్లి బ్రాంచ్ అధ్యక్షుడు రూప్సింగ్, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.