బుధవారం 03 మార్చి 2021
Jayashankar - Jan 24, 2021 , 03:27:42

ఉడుత ఊపులకు భయపడేది లేదు

ఉడుత ఊపులకు భయపడేది లేదు

  • రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్‌, 
  • ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
  • చిట్యాలలో ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక సమావేశం

చిట్యాల, జనవరి 23 : ఉడుత ఊపులకు భయపడేది లేదని రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. చిట్యాల పీఏసీఎస్‌ ఆవరణలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అధ్యక్షతన శనివారం ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పల్లా హాజరై మాట్లాడారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ వృద్ధి రేటులో మూడో స్థానంలో ఉన్నట్లు నీతి అయోగ్‌ గుర్తించిందని తెలిపారు. దేశ తలసరి ఆదాయం కంటే రెట్టింపు ఆదాయం పెరిగిందన్నారు. అభివృద్ధిని చూసి కూడా బీజేపీ నాయకులు బికారీ, బీమారీ తెలంగాణ అని తప్పుడు కూతలు కూయడం సరికాదని హితవు పలికారు. మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సీఎం కేసీఆర్‌ దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. కరోనా కష్టకాలంలోనూ ప్రజలకు అండగా నిలిచారని గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెంచడంతో పాటు నూతన నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. తప్పుడు లెక్కలు, ఆరోపణలు చేస్తూ విర్రవీగుతున్న బీజేపీ నాయకులకు ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎంపీ దయాకర్‌ మాట్లాడుతూ.. కాకతీయుల కాలం నాటి చెరువులకు పూర్వ వైభవం తీసుకొచ్చి కోటి ఎకరాలకు నీరందించిన ఘనత కేసీఆర్‌దే అన్నారు.  చేతగాని సన్నాసుల మాటలకు లొంగిపోవద్దని సీఎం చేస్తున్న కృషిని గుర్తించి టీఆర్‌ఎస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దివ్యాంగుల కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ వాసుదేవరెడ్డి, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌ రూరల్‌, పెద్దపల్లి, జనగామ జిల్లాల జడ్పీ చైర్మన్‌, చైర్‌ పర్సన్లు జక్కు శ్రీహర్షిణి, గండ్ర జ్యోతి, పుట్ట మధు, సంపత్‌రెడ్డి, సాంబారి సమ్మరావు, ఎంపీపీ దావు వినోద, జడ్పీటీసీ గొర్రె సాగర్‌, సర్పంచ్‌ పూర్ణచందర్‌రావు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కుంభం రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, నాయకులు కార్యకర్తలు, పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo