గురువారం 25 ఫిబ్రవరి 2021
Jayashankar - Jan 22, 2021 , 00:15:30

తీరు మారలే..!

తీరు మారలే..!

  • ఏసీబీ వలలో కుందనపల్లి వీఆర్వో
  • రూ.2లక్షలు లంచం తీసుకుంటూ చిక్కిన జక్కు రవీందర్‌
  • పట్టాదారు పాస్‌ పుస్తకం ఇచ్చేందుకు రైతు నుంచి డిమాండ్‌
  • హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు

టేకుమట్ల, జనవరి21: రెవెన్యూ వ్యవస్థలో అవినీతిని నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా కొందరు అధికారుల తీరు మారడం లేదు. వీఆర్వోల ఆగడాలకు అడ్డూ అదు పు లేకుండా పోతున్నది. ఆ వ్యవస్థను రద్దు చేసినా ఇక్కడో వీఆర్వో తన వక్రబుద్ధిని వదల్లేదు. ఓ రైతుకు పట్టాదారు పాస్‌ పుస్తకం ఇచ్చేందుకు రూ.2లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండ లం కుందనపల్లి వీఆర్వో జక్కు రవీందర్‌ గురువారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డాడు. ఘటనకు సంబంధించి వివరాలు.. టేకుమట్ల మండలం ద్వారకపేటలో ఓ ప్రాంతానికి చెందిన భూమి వివాదంలో ఉండగా దానిపై పట్టాదారు పాస్‌ పుస్తకం కోసం రైతు ఎక్కటి విజయపాల్‌రెడ్డి వీఆర్వో రవీందర్‌ను ఆశ్రయించాడు. ఈ పనికి సదరు వీఆర్వో లంచం డిమాండ్‌ చేయగా హైదరాబాద్‌లో ఉండే సదరు రైతు అక్కడికే వచ్చి తీసుకోవాలని చెప్పి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. గురువారం హైదరాబాద్‌లో హబ్సీగూడలోని ఓ హోటల్‌లో సదరు రైతు నుంచి డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని రవీందర్‌ను పట్టుకున్నారు. వీఆర్వో వ్యవస్థ రద్దయి, భూ రిజిస్ట్రేషన్లు ధరణి పోర్టల్‌ ద్వారా జరుగుతున్నా పట్టాదారు పాస్‌పుస్తకం కోసం ఓ రైతు నుంచి వీఆర్వో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం చర్చనీయాంశమైంది.

VIDEOS

logo