కాళేశ్వరాన జలవిధాత

- సుమారు ఐదు గంటల పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన
- కాళేశ్వర ముక్తీశ్వరుడికి, గోదావరి మాతకు సీఎం దంపతుల ప్రత్యేక పూజలు
- తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులు
- ఆలయంలోనే గంట పాటు గడిపిన సీఎం
- లక్ష్మీ బరాజ్‌ను తిలకించి పులకించిన అపర భగీరథుడు
- మేడిగడ్డ, తుపాకులగూడెం, దుమ్ముగూడెం బరాజ్‌ల వద్ద కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని ఆదేశం
- ప్రాజెక్టుల నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచన
తెలంగాణ జలవిధాత, ముఖ్యమంత్రి కేసీఆర్ మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మంగళవారం సుమారు ఐదుగంటల పాటు పర్యటించారు. సతీసమేతంగా వచ్చి మొదట కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం గోదావరి నదికి వెళ్లి నదీమాతల్లికి పసుపు కుంకుమ, చీరెసారె సమర్పించి మొక్కులు చెల్లించుకుని నిండుగా పారుతున్న నదిని చూసి మురిసిపోయారు. అటునుంచి లక్ష్మీ బరాజ్ వద్దకు వెళ్లి నీటికి వాయినం ఇచ్చి, పుష్పాభిషేకం చేసి పరిసరాలను తిలకించి పులకించి పోయారు. ఇంజినీరింగ్ అధికారులతో గత అనుభవాలను పంచుకుంటూనే ప్రాజెక్టులో జలకళను చూసి తాను అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతున్నదని సంబురపడ్డారు. సాగునీరు లేక దశాబ్దాలుగా తెలంగాణ రైతులు పడ్డ గోస కాళేశ్వరం ప్రాజెక్టుతో తీరిపోయిందని సంతోషం వ్యక్తం చేశారు.
- జయశంకర్ భూపాలపల్లి, జనవరి 19 (నమస్తే తెలంగాణ) ‘నాడు ఎట్లున్న గోదావరి.. ఇప్పుడు ఎట్ల పారుతాంది.. అప్పట్ల కాళేశ్వరం వచ్చి గోదావరి నదిల స్నానం చేయాల్నంటే ఒడ్డు నుంచి నీళ్లున్నకాడికి ఇసుకల ఎడ్లబండి మీద పోవాల్సి వచ్చేది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుతోని 54 కిలోమీటర్ల దాక బ్యాక్‌వాటర్‌తో నది నిండుగ ప్రవహిస్తుంటె మనసు పులకించిపోతాంది. నిజంగ ఇంత అద్భుతం జరుగుతదని కలలగుడ అనుకోలె. రాష్ట్రంల భావితరాల వారు గర్వంగ చెప్పుకునే అద్భుత ప్రాజెక్టు కాళేశ్వరం. ఇదంత ఇంజనీర్ల కృషి ఫలితమే.
- గోదావరి మాతకు పూజల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్
అపర భగీరథుడు.. జల సాధకుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, శోభ దంపతులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మీబరాజ్ సందర్శనలో భాగంగా ముందుగా హైదరాబాద్ నుంచి కాళేశ్వరానికి రాగా హెలీప్యాడ్ వద్ద మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం దేవస్థాన రాజగోపురం వద్ద దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో కేసీఆర్ దంపతులను సాదరంగా ఆలయంలోకి ఆహ్వానించారు. అక్కడినుంచి గర్భగుడిలో కాళేశ్వర, ముక్తీశ్వరుడిని దర్శనం చేసుకున్నాక స్వామివారికి పట్టు వస్ర్తాలు సమర్పించి అభిషేక పూజలు చేశారు. ఆలయం ఎదుట ఉన్న నంది విగ్రహం నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం పార్వతీ మాత ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. తర్వాత కల్యాణ మండపంలో అర్చకులు సీఎం దంపతులకు ఆశీర్వచనం చేశారు. దేవాదాయ కమిషనర్ అనిల్‌కుమార్, ఆలయ ఈవో మారుతి స్వామివారి చిత్రపటాన్ని ముఖ్యమంత్రి దంపతులకు అందజేశారు. మంత్రులు, అధికారులను పెద్దపల్లి జడ్పీ అధ్యక్షుడు పుట్ట మధు సన్మానించారు. అనంతరం మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి సన్మానం చేశారు. కాళేశ్వర ముక్తీశ్వరుడికి, గోదావరి మాతకు సీఎం దంపతుల ప్రత్యేక పూజలు తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఆలయంలోనే గంట పాటు గడిపిన సీఎం లక్ష్మీ బరాజ్‌ను తిలకించి పులకించిన అపర భగీరథుడు మేడిగడ్డ, తుపాకులగూడెం, దుమ్ముగూడెం బరాజ్‌ల వద్ద కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని ఆదేశం
గోదావరి మాతకు పూజలు
కాళేశ్వర, ముక్తీశ్వర స్వామివార్ల దర్శనానంతరం సీఎం కేసీఆర్ దంపతులు నేరుగా గోదావరి పుష్కర ఘాట్ వద్దకు వెళ్లారు. అక్కడ ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మతో కలిసి కొద్దిసేపు గోదావరి నది ప్రస్తుతం ఎలా ఉంది.. గతంలో ఎలా ఉండేది అంటూ తన మనసులో మాటలు చెప్పుకొచ్చారు. అప్పుడెప్పుడో కాళేశ్వరానికి వచ్చినప్పుడు గోదావరిలో స్నానం చేయాలంటే ఒడ్డు నుంచి నీటి వరకు ఎడ్లబండిపై ఇసుకలో వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 54 కిలోమీటర్ల బ్యాక్ వాటర్‌తో నది నిండుగా ప్రవహించడం చూస్తుంటే మనసు పులకించిపోతున్నదని ఆనందపడ్డారు. ఇదంతా ఇంజినీర్ల కృషి ఫలితమేనని అక్కడ ఉన్న వాళ్లతో చెబుతూనే ప్రాజెక్టు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, ఇంజినీర్లను అభినందించారు. అనంతరం సీఎం తన సతీమణి శోభతో కలిసి గోదావరి జలాలను శిరస్సుపై చల్లుకుని, నదీమాతకు చీరె, సారె పెట్టి, హారతి ఇచ్చి, నాణేలను నదిలో వేసి మొక్కులు చెల్లించుకున్నారు.
లక్ష్మీబరాజ్‌ను సందర్శించి తనివితీరా తన్మయత్వం
ఆలయం నుంచి నేరుగా లక్ష్మీ బరాజ్‌కు హెలికాప్టర్లో చేరుకుని వ్యూపాయిం ట్ నుంచి నీటితో నిండుగా ఉన్న బరాజ్‌ను కనులారా వీక్షించి ఇంజినీరింగ్ అధికారులతో తన ఆనందాన్ని పంచుకున్నారు. సుమారు అరగంట పాటు పరిసరాలను పరిశీలించారు. గతానికి భిన్నంగా తొణికిసలాడుతున్న గోదావరిని చూసి ఉప్పొంగిపోయారు. తాను కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం పడిన వ్యయప్రయాసలను వివరిస్తూ ఉద్వేగం చెందారు. అనుకున్నది అనుకున్నట్లు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రాజెక్ట్ పూర్తయిందని, ఇందుకు సహకరించిన ఇంజినీరింగ్ అధికారులు, నిర్మాణ సంస్థను ప్రశంసించారు. అనంతరం ప్రత్యేక బస్సులో వంతెన మీద గల 62, 63వ గేట్ల వద్దకు చేరుకుని గోదావరి మాతకు పూలు, నాణేలు, పట్టు వస్ర్తాలతో వాయినాలు సమర్పించి పూజలు చేశారు. బస్సులోనే వంతెనపై మహారాష్ట్ర వైపు ఉన్న 85వ గేటు వద్దకు వెళ్లి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ఆ తర్వాత ఎల్అండ్టీ కంపెనీ కార్యాలయంలో భోజనం చేశారు. అనంతరం ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమీక్షించి పలు సూచనలు చేసి హైదరాబాద్‌కు పయనమయ్యారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎంపీ వెంకటేశ్ నేత, సీఎస్ సోమేశ్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, డీజీపీ మహేందర్‌రెడ్డి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, టీఎస్ఎండీసీ చైర్మన్ సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, చందర్, దివాకర్‌రావు, మనోహర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీలు పురాణం సతీశ్, నారదాసు లక్ష్మణ్‌రావు, కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీలు మురళీధర్‌రావు, నల్లా వెంకటేశ్వర్లు, వరంగల్ రూరల్, పెద్దపల్లి జడ్పీ అధ్యక్షులు గండ్ర జ్యోతి, పుట్ట మధు, నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి, తెలంగాణ ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్‌రావు ఉన్నారు.
భారీ బందోబస్తు..
సీఎం కేసీఆర్ కాళేశ్వర పర్యటన కోసం పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు చేపట్టింది. రామగుండం సీపీ సత్యనారాయణ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్ ఆధ్వర్యంలో సుమారు 700 మంది పోలీసులు, ఆలయ పరిసరాలు, లక్ష్మీ బరాజ్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కాటారం నుంచి మహదేవపూర్ మండలంలోని లక్ష్మీ బరాజ్ వరకు పహారా కాశారు. డ్రోన్ కెమెరాల సాయంతో గోదావరి పరీవాహక ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. బాంబు, డాగ్ స్కాడ్‌తో ప్రాజెక్టు పరిసరాలను తనిఖీ చేశారు. సీఎం పర్యటన ముగిసేవరకు ప్రాజెక్టు పరిసరాలకు ఎవరినీ అనుమతించలేదు. బందోబస్తులో జయశంకర్ భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు, ఓఎస్డీ శోభన్‌బాబు, ములుగు ఏఎస్పీ సాయిచైతన్య, ఏటూరునాగారం ఏఎస్పీ గౌస్ ఆలం, గణపురం ట్రైనీ ఐపీఎస్ సుధీర్ రాంనాథ్‌కేకాన్, కాటారం, భూపాలపల్లి డీఎస్పీలు బోనాల కిషన్, తిరుమల్‌రావు, మహదేవపూర్, కాటారం సీఐలు అంబటి నర్సయ్య, హాథీరాం, మహదేవపూర్, పలిమెల, మంగపేట ఎస్ఐలు అనిల్‌కుమార్, శ్యాంరాజ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.