మంగళవారం 02 మార్చి 2021
Jayashankar - Jan 03, 2021 , 03:37:03

మొదటి దఫా 2191 మందికి వ్యాక్సిన్‌

మొదటి దఫా 2191 మందికి వ్యాక్సిన్‌

  • 14 కోల్డ్‌చైన్‌ సెంటర్ల ఏర్పాటు
  • పీహెచ్‌సీల వారీగా సిబ్బందికి శిక్షణ
  • డీఎంహెచ్‌వో సుధార్‌సింగ్‌ 

భూపాలపల్లి టౌన్‌, జనవరి 2 : కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి సర్వం సిద్ధం చేస్తున్నామని, ప్రభుత్వం ఎప్పుడు అందజేస్తే అప్పుడు వ్యాక్సిన్‌ వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సుధార్‌సింగ్‌ తెలిపారు. శనివారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇప్పటికే టాస్క్‌ఫోర్స్‌ మీటింగ్‌ సైతం పూర్తయిందని, శనివారం జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లో మెడికల్‌ ఆఫీసర్లు సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. జిల్లాలో 12 పీహెచ్‌సీలు, 2 సీహెచ్‌సీలు ఉన్నాయని మొత్తం 14 కోల్డ్‌చైన్‌ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. మొదటి విడుత ప్రభుత్వ, ప్రైవేటు, సింగరేణి వైద్యులు, సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు మొత్తం 2191 మందికి వ్యాక్సిన్‌ వేసేందుకు పేర్లు నమోదు చేసినట్లు తెలిపారు. పీహెచ్‌సీల వారీగా ఎంత మంది ఉన్నారో వివరాలు తీసుకుని సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. ప్రతి సెంటర్‌లో మూడు రూమ్‌లు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రతి సెంటర్‌కు ఐదుగురు వ్యాక్సినేటర్లు ఉంటారని, గైడ్‌లైన్స్‌ ప్రకారం వ్యాక్సిన్‌ అందజేస్తామన్నారు. మొదటి విడుత వ్యాక్సిన్‌ పంపిణీ తేదీ ఖరారు కాలేదని, మొదటి దఫా పూర్తయిన వెంటనే రెండో దఫా పంపిణీ ప్రారంభిస్తామని అన్నారు. 

దివ్యాంగులు వివరాలు ఇవ్వండి

జిల్లాలోని దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ల కోసం వివరాలు ఇవ్వాలని డీఎంహెచ్‌వో సుధార్‌సింగ్‌ కోరారు. కరోనా నేపథ్యంలో క్యాంపులు నిర్వహించడంలో జాప్యం జరిగిందని, ప్రస్తుతం ఆయా పీహెచ్‌సీల పరిధిలో ఉన్న వారు మెడికల్‌ ఆఫీసర్లు, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లకు వివరాలు అందించాలని కోరారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి , అందులో ఏ విభాగాల్లో ఎంత మంది ఉన్నారో తెలుసుకుని క్యాంపు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తామన్నారు.  

VIDEOS

logo