మంగళవారం 02 మార్చి 2021
Jayashankar - Jan 01, 2021 , 03:03:25

జిల్లాలో అతితక్కువ రోడ్డు ప్రమాదాలు

జిల్లాలో అతితక్కువ రోడ్డు ప్రమాదాలు

రాష్ట్రంలో జయశంకర్‌ భూపాలపల్లికి ప్రథమ స్థానం

ఎస్పీ సంగ్రాంసింగ్‌ జీ పాటిల్‌

భూపాలపల్లి రూరల్‌/ ములుగు, డిసెంబర్‌ 31 : రాష్ట్ర స్థాయిలో అతి తక్కువ రోడ్డు ప్రమాదాల జిల్లాగా జయశంకర్‌ భూపాలపల్లికి మొదటి స్థానం దక్కిందని ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జి.పాటిల్‌ తెలిపారు. గురువారం జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల పోలీస్‌ కార్యాలయాల్లో ఎస్పీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల 2020 వార్షిక నివేదికను వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సరిహద్దు రాష్ర్టాల పోలీసుల సమన్వయంతో మావోయిస్టుల చర్యలను అదుపు చేశామన్నారు. కొవిడ్‌-19 సందర్భంగా ప్రజలకు వైద్య శాఖతో పాటుపోలీస్‌ శాఖ రక్షణ కవచంలా నిలిచిందన్నారు. అధిక వర్షాలతో జన జీవనం స్తంభించడంతో పోలీసులు అందించిన సేవలు అభినందనీయమన్నారు. మేడారం జాతరలో పోలీసుల పనితీరు బాగుందని కొనియాడారు. ఆర్టీసీ బంద్‌ సమయంలో పోలీసు అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా పనిచేశారన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ వీ శ్రీనివాసులు, ఏఆర్‌ అదనపు ఎస్పీ సదానంద రెడ్డి, భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు  సంపత్‌రావు, బోనాల కిషన్‌, శిక్షణ ఐపీఎస్‌ సుధీర్‌రామ్‌నాథ్‌ కే ఖాకన్‌ పాల్గొన్నారు. 

పోలీసులకు ఎస్పీ అభినందన

బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష పడేలా అతి తక్కువ సమయంలో సాక్ష్యాధారాలు సమర్పించిన భూపాలపల్లి పోలీసులను ఎస్పీ సంగ్రాంసింగ్‌ జి.పాటిల్‌ అభినందించారు. నిందితుడికి శిక్ష పడేలా దర్యాప్తు చేసిన భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, సంఘటన జరిగిన సమయంలో తక్షణమే స్పందించిన చిట్యాల సీఐ సాయిరమణ, సకాలంలో సాక్షులను కోర్టులో  హాజరుపర్చేందుకు సహకరించిన మొగుళ్లపల్లి ఎస్సై మహేందర్‌కుమార్‌, కోర్టు కానిస్టేబుల్‌ సుభాశ్‌, కేసు వాదించిన పీపీ సత్యనారాయణను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే  వారికి అతి తక్కువ కాలంలోనే కఠిన శిక్షలు పడతాయి అనడానికి ఈ సంఘటన నిదర్శనమన్నారు.

VIDEOS

logo