మంగళవారం 02 మార్చి 2021
Jayashankar - Dec 24, 2020 , 00:40:25

భూసేకరణ త్వరగా పూర్తి చేయండి

భూసేకరణ త్వరగా పూర్తి చేయండి

కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య

భూపాలపల్లి కలెక్టరేట్‌, డిసెంబర్‌ 23: పెండింగ్‌లో ఉన్న భూసేకరణను పూర్తి చేసేందుకు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ, ల్యాండ్‌ సర్వే శాఖలు, సింగరేణి, జెన్కో సంస్థలు, దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడాలేనివిధంగా జిల్లాలో సింగరేణి, జెన్కో సంస్థలతో పాటు ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు, దేవాదుల పైప్‌లైన్‌ ఉన్నాయని, వాటికి అవసరమైన భూసేకరణ జిల్లాలో ఇప్పటికే చాలా వరకు పూర్తయిందన్నారు. ఇంకా ఏమైనా పెండింగ్‌లో ఉంటే  భూసేకరణను పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ క్రమంలో రెవెన్యూ, సర్వే ల్యాండ్‌ అధికారులు జాగ్రత్తగా వ్యవహరించి భూమిని కోల్పోతున్న భూ యజమానులకు రెవెన్యూ రికార్డు, మోకాను పరిశీలించి లబ్ధిచేకూరేలా చూడాలని ఆదేశించారు. వివాదాస్పదమైన భూముల విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి భూసేకరణ యాక్ట్‌ ప్రకారం సేకరించాలన్నారు. భూసేరకణలో ఇండ్లు కోల్పోతున్న కుటుంబాలకు పునరావాస చట్టం ప్రకారం పునరావాసం కల్పించాలన్నారు. ప్రతి తహసీల్‌లో భూ సేకరణకు సంబంధించి గ్రామాల వారీగా పూర్తి వివరాలతో రికార్డులను మెయింటెన్‌ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో భూపాలపల్లి ఆర్డీవో శ్రీనివాస్‌, జెన్కో సీఈ సిద్ధయ్య, ఏడీ ల్యాండ్‌ సర్వే సుదర్శన్‌, తహసీల్దార్లు, సింగరేణి అధికారులు, కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల ఇంజినీర్లు, సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo