సోమవారం 08 మార్చి 2021
Jayashankar - Dec 21, 2020 , 01:33:06

నాఊరే నాఇల్లు

నాఊరే నాఇల్లు

  • పనిచేస్తూ.. చేయిస్తున్న ఆశిరెడ్డిపల్లి సర్పంచ్‌
  • పరిసరాల పరిశుభ్రతలో ప్రత్యక్షంగా పాల్గొంటున్న స్వర్ణలత
  • గ్రామ స్వచ్ఛత కోసం ప్రజలకు నజరానాలు
  • ప్రభుత్వ అభివృద్ధి పనులకూ పెద్దపీట
  • పచ్చదనం.. పరిశుభ్రత అంటే ఆమెకు ప్రాణం

కొడవలి పట్టి దారి వెంట ఉన్న పిచ్చిమొక్కలు, చెత్తాచెదారాన్ని స్వయంగా ఆమే తొలగిస్తుంది.. రోడ్డు వెంట మొక్కలకు నీళ్లు పోస్తుంది.. పచ్చదనం.. పరిశుభ్రత అంటే ఆమెకు అంత ప్రాణం. ఓ ఇల్లాలిగా భర్త, పిల్లల్ని చూసుకున్నట్లే.. తనపై నమ్మకంతో గెలిపించిన ఊరిని తన ఇంటిలా పచ్చగా పరిశుభ్రంగా మార్చుతోంది. చెప్పడం కంటే మనం చేసి చూపిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందంటున్నారు టేకుమట్ల మండలం ఆశిరెడ్డిపల్లి సర్పంచ్‌ వెలిశెట్టి స్వర్ణలత.

- టేకుమట్ల 

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం ఆశిరెడ్డిపల్లి గ్రామాన్ని సర్పంచ్‌గా వెలిశెట్టి స్వర్ణలత సొంతింటిలా తీర్చిదిద్దుతున్నారు. ఇటు పచ్చదనంతో పాటు పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమిస్తూ స్వయంగా తాను కూడా పాల్గొంటున్నారు.గ్రామంలో పెరిగిన పిచ్చిమొక్కలను తన కుటుంబసభ్యులు, జీపీ కార్మికులతో కలిసి తొలగించి, హరితహరంలో పెట్టిన మొక్కలకు నీరు పోయడం, చలికాలం ప్రారంభం కావడంతో సీజనల్‌ వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటోంది. గతంలో గ్రామ పంచాయతీ భవనాన్ని స్వయంగా తానే దుమ్ము, ధూళి, చెత్తాచెదారాన్ని శుభ్రపర్చింది. ఇంట్లో పిల్లలకు సేవ చేసినట్లే తనను నమ్మి ఏక్రగ్రీవంగా ఎన్నుకున్న ప్రజలకు, గ్రామానికి ఏదైనా చేయాలన్నదే తన లక్ష్యమని చెబుతున్నారు. ఇందుకోసం స్వయంగా కూలిగా మారి గ్రామం పరిశుభ్రంగా ఉండాలని, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని నిరంతరం శ్రమిస్తున్నారు.

 చేసి చూపించాలి..

ఇది చేయి, అది చేయి అని చెప్పడం కాదు.. వీలైతే మనం చేసి చూపించాలి. ఇతరులతో చేయించాలన్నదే నా ఉద్దేశం. అందుకే ముఖ్యంగా గ్రామ పరిశుభ్రత, అభివృద్ధి పనుల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నా. నా భర్త మీద, నా మీద నమ్మకంతో మా గ్రామ ప్రజలు నన్ను ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. ఆ నమ్మకం వమ్ముచేయకుండా ఇటు ప్రజాసేవతో పాటు గ్రామ ప్రగతి కోసం కృషిచేస్తున్నా.- వెలిశెట్టి స్వర్ణలత, సర్పంచ్‌, ఆశిరెడ్డిపల్లి గ్రామంలో గతేడాది స్వచ్ఛ గ్రామం పేరిట పరిశుభ్రత పోటీలు కూడా నిర్వహించారు. పరిసరాలు ఎవరు పరిశుభ్రంగా మార్చుకుంటారో వారికి బహుమతులు ఇస్తామని ప్రకటించి చెప్పినట్లే అందజేశారు. ఇందులో మిడిదొడ్డి భిక్షపతికి మొదటి బహుమతి కింద రూ.1500, రెండో బహుమతిని కింద మేడిపల్లి కుమారస్వామికి రూ.1000 నజరానా ఇచ్చి పరిశుభ్రతపై ఆమెకున్న శ్రద్ధను చాటుకున్నారు. ఇలా స్వచ్ఛత పోటీలతో ఆశిరెడ్డిపల్లి గ్రామానికి మండలంలో మంచి గుర్తింపు వచ్చేలా చేసింది. శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాల భవానాన్ని లాక్‌డౌన్‌ కాలంలో సొంత ఖర్చులు రూ.లక్షా 67 వేలుతో సత్రం నిర్మించింది. తన కుటుంబసభ్యులతో పనిచేస్తూ, కూలిపోయిన గొడలను కొత్త నిర్మించి, రేకుల కప్పు, రంగులు వేయించి వేంకటేశ్వరస్వామి ఆలయ సత్రంగా తీర్చిదిద్దింది. వైకుంఠధామానికి తన వంతు సాయం చేశారు. అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు అవసరమైన స్థలం లేకపోవడంతో రూ.లక్షా 90వేలు వెచ్చించి 15 గుంటల భూమి కొనుగోలు చేసింది. ఆ భూమిని గ్రామానికి దానంగా ఇచ్చి, నాణ్యతలో రాజీపడకుండా నిర్మించింది. అలాగే గ్రామంలో రూ.4లక్షలతో పోచమ్మ గుడి కట్టించారు. అలాగే వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టుకునేందుకు సాయం చేసింది. కట్టుకునేందుకు డబ్బుల్లేక ఇబ్బంది పడ్డ 12మందికి తానే నగదు ఇచ్చి నిర్మాణాలు పూర్తయ్యేలా ప్రోత్సహించింది. ఇవేగాక గ్రామంలో వరద నీరు ఇండ్లలోకి చేరుతుండడంతో సైడ్‌ కాల్వలను నిర్మించి, ఎక్కడా బురద రోడ్లు లేకుండా మొరం పోయించింది.

VIDEOS

logo