12 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

భూపాలపల్లి కలెక్టరేట్, డిసెంబర్ 11 : నేటి నుంచి జరుగనున్న డిగ్రీ ఇయర్ కామన్ కోర్సు సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు భూపాలపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్యాం ప్రసాద్ తెలిపారు. కేయూ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో 2016 వరకు చదువుకుని డిగ్రీ ఇయర్ కామన్ కోర్సులో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు సప్లమెంటరీ పరీక్షలు ఈనెల 12 నుంచి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు తృతీయ సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 12 నుంచి 2 గంట ల వరకు మొదటి సంవత్సరం, సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు విధిగా శానిటైజర్ తీసుకుని, మాస్క్ ధరించి అరగంట ముందుగా పరీక్షకు హాజరు కావాలని ప్రిన్సిపాల్ సూచించారు.