శుక్రవారం 05 మార్చి 2021
Jayashankar - Dec 12, 2020 , 02:34:17

ఈ-ఆఫీస్‌.. పేపర్‌లెస్‌

ఈ-ఆఫీస్‌.. పేపర్‌లెస్‌

  • కలెక్టరేట్లలో కాగితరహిత పాలన
  • కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌లోనే కార్యకలాపాలు
  • ఈ నెలాఖరులోగా అన్ని కార్యాలయాల్లో అమలు

కొవిడ్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ‘ఈ-ఆఫీస్‌'కు శ్రీకారం చుట్టడంతో అన్ని కలెక్టరేట్లలో కాగితరహిత పాలన కొనసాగుతున్నది. ఎక్కువ మంది ఉద్యోగులు, సిబ్బంది కరోనా బారిన పడిన సమయంలో వివిధ పనులు, అర్జీలు పెట్టుకునేందుకు వచ్చే ప్రజల కోసం రాష్ట్రమంతటా కొత్తగా ఆన్‌లైన్‌ విధానాన్ని తెచ్చింది. ప్రస్తుతం రెవెన్యూ సహా అన్ని విభాగాల్లో ఈ-ఆఫీస్‌ సాఫ్ట్‌వేర్‌ సాయంతో ఫైళ్లు ఎప్పకప్పుడు క్లియర్‌ అవుతున్నాయి. పారదర్శకంగా వేగంగా పనులవుతుండడంతో అర్జీదారుల తిప్పలు తప్పుతున్నాయి. నెలాఖరులోగా అన్ని కార్యాలయాల్లో పేపర్‌లెస్‌ కార్యకలాపాలు అందుబాటులోకి రానున్నాయి. 

- భూపాలపల్లి కలెక్టరేట్‌

జిల్లా కలెక్టరేట్లలో ఈ-ఆఫీస్‌ ద్వారా కార్యకలాపాలు వేగంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీస్‌ ప్రారంభించాలని నిర్ణయించగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ జిల్లా కలెక్టర్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి ఈ-ఆఫీస్‌ సేవలు సత్వరమే ప్రారంభించాలని ఆదేశించారు. ఈ మేరకు జయశంకర్‌ భూపాలపల్లి కలెక్టరేట్‌లో 20 రోజుల క్రితం కాగితరహితపాలన మొదలైంది. జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో ప్రజలతో పాటు కలెక్టరేట్‌లోని ఉద్యోగులు, పలువురు అధికారులు కొవిడ్‌ బారినపడ్డారు. దీంతో ప్రభు త్వ కార్యాలయాల్లోని అధికారులు, ఉద్యోగులు సందర్శకులను కలిసి వినతుల స్వీకరణ, వివరాల నమోదుకు భయపడుతున్న నేపథ్యం లో కలెక్టరేట్‌లో కాగితరహిత పాలనకు యంత్రాం గం పూనుకున్నది. రెవెన్యూతో పాటు ఇతర విభాగాల ఉద్యోగులు, అధికారులు ఈ-ఆఫీస్‌ ద్వారా ఆన్‌లైన్‌లో పాలనా వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ఈ నెలాఖరుకల్లా కలెక్టరేట్‌ బయట ఉన్న జిల్లా కార్యాలయాల్లోనూ అమలుచేసేందుకు కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య పర్యవేక్షణలో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ-ఆఫీస్‌ 

సాఫ్ట్‌వేర్‌పై శిక్షణ

జిల్లా కలెక్టరేట్‌కు వచ్చే ఫిర్యాదులు, వినతులు, ఇతర శాఖల అన్ని ఫైళ్లు మొదట ఇన్‌వార్డుకు చేరుతాయి. అక్కడ ఫైళ్లు నమోదు చేసుకున్న తర్వాత రెవెన్యూ శాఖలోని అన్ని విభాగాలకు పంపుతారు. మొదట కలెక్టరేట్‌లోని రెవెన్యూ విభాగంలోని అన్ని కంప్యూటర్లలో ఈ-ఆఫీస్‌ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేశారు. అలాగే జూనియర్‌ అసిస్టెంట్‌ నుంచి కలెక్టర్‌ వరకు నిర్దేశిత ఫైళ్లు ఆన్‌లైన్‌లో వారికి చేరేలా మ్యాపింగ్‌ ప్రక్రియను ఏర్పాటుచేశారు. అలాగే కలెక్టరేట్‌లోని ప్రతి ఉద్యోగి, అధికారి తమ కంప్యూటర్‌ ద్వారా లాగిన్‌ అయ్యేందుకు వీలుగా డిజిటల్‌ కీ ఇచ్చారు. ఈ-ఆఫీస్‌ అమలుపై కలెక్టరేట్‌లోని రెవెన్యూ అధికారులు, ఉద్యోగులకు ఈడీఎం శ్రీకాంత్‌ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించి పూర్తిగా అవగాహన కల్పించారు.

ఇన్‌వార్డు నుంచి ఫైళ్ల చేరవేత

ఈ-ఆఫీస్‌లో భాగంగా మొదట కలెక్టరేట్‌కు వచ్చే ఫిర్యాదులు, వినతులు, ఇతర శాఖల ఫైళ్లను ఇన్‌వార్డు విభాగంలో స్కాన్‌ చేస్తారు. స్కాన్‌ చేసిన సదరు ఫైళ్లు, పత్రాలకు నంబర్‌ కేటాయించి మొదట రెవెన్యూ సెక్షన్‌ జూనియర్‌ లేదా సీనియర్‌ అసిస్టెంట్‌కు ఆన్‌లైన్‌లో పంపుతున్నారు. ఈ-ఆఫీస్‌లో వచ్చిన ఫైళ్లను పరిశీలించిన వెంటనే సెక్షన్‌ సూపరింటెండెంట్‌కు చేరవేస్తున్నారు. సెక్షన్‌ సూపరింటెండెంట్‌ తనకు వచ్చిన ఫైళ్లను కలెక్టరేట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌కు అక్కడి నుంచి అదనపు కలెక్టర్‌, లేదా జేసీకి పంపుతారు. ఈ ప్రక్రియ అంతా ఈ-ఫైలింగ్‌ విధానం ద్వారా ఒక అధికారి నుంచి ఇంకో అధికారికి చివరగా కలెక్టర్‌కు చేరుతాయి. అనంతరం కలెక్టర్‌ ఆమోదం పొందిన తర్వాత ఫైళ్లు తిరిగి వెనక్కి వచ్చేస్తాయి. ఈ-ఆఫీస్‌లో భాగంగా ఏ సెక్షన్‌లో ఎన్ని ఫైళ్లు సంతకాలయ్యాయి?, ఎంతమంది ఉద్యోగులు, అధికారులు ఎన్ని ఫైళ్లు పూర్తి చేశారు?, పెండింగ్‌ ఎన్ని ఉన్నాయి అనే విషయాలను కలెక్టర్‌ ఈ-ఆఫీస్‌ విధానంలో ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. దీని వల్ల అధికారులు, ఉద్యోగులు ఫైళ్ల క్లియరెన్స్‌లో ప్రత్యేక శ్రద్ధ చూపే అవకాశం ఉంటుంది. అంతేగాక పనులు ఎప్పటికప్పుడు పూర్తవుతాయి.

వేగంగా పనులు పూర్తవుతున్నాయి

కరోనా నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జిల్లా కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య ఆధ్వర్యంలో ఈ-ఆఫీస్‌ విధానాన్ని అమలుచేస్తున్నాం. మొదట 20రోజుల క్రితం జిల్లా కలెక్టర్‌ ప్రారంభించారు. అప్పటినుంచి కలెక్టరేట్‌కు వచ్చే ఫిర్యాదులు, ఫైళ్లు, వినతులను ఈ-ఆఫీస్‌ ద్వారా వేగంగా స్వీకరిస్తున్నాం. కొత్త పద్ధతి ప్రారంభమైనప్పటి నుంచి కలెక్టరేట్‌ ఉద్యోగులు, సిబ్బంది కరోనాకు భయపడకుండా నిర్భయంగా పనులను చేస్తున్నారు. దీని వల్ల సమయం ఆదా కూడా అవుతున్నది. పనులు త్వరగా పూర్తవుతున్నాయి.

-మహేశ్‌బాబు, కలెక్టర్‌ ఏవో, భూపాలపల్లి

VIDEOS

logo