గురువారం 25 ఫిబ్రవరి 2021
Jayashankar - Dec 02, 2020 , 06:17:48

అడవుల్లో హై అలర్ట్‌ !

అడవుల్లో హై అలర్ట్‌ !

  •  మావోయిస్టులపై పోలీసుల నజర్‌
  •  ప్రత్యేక బలగాలతో తనిఖీలు, కూంబింగ్‌లు
  •  టార్గెట్లను అప్రమత్తం చేస్తున్న పోలీసులు
  • నేటి నుంచి 8 వరకు  పీఎల్‌జీఏ వారోత్సవాలు

జయశంకర్‌ భూపాలపల్లి, నమస్తే తెలంగాణ :  మావోయిస్టుల అనుబంధ సంస్థగా పేరున్న పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) వారోత్సవాలను పురస్కరించుకుని ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిలాల్లో పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించినట్లు తెలిసింది. ప్రతి యేడు డిసెంబర్‌ 2 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించే వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు టార్గెట్‌లపై దాడులకు పాల్పడుతారనే సమాచారం మేరకు పోలీస్‌ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు సమాచారం. ప్రధానంగా జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల పరిధిలో  మావోయిస్టుల షెల్టర్‌ జోన్లపై నజర్‌ పెట్టి, వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న వారి కదలికలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గతంలో మావోయిస్టు లు ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట మండలాల్లో కరపత్రాలు, వాల్‌పోస్టర్లు  వేయడం, గోడలకు అంటించిన విషయం తెలిసిందే. వెంకటాపురంలో వ్యాపారి హత్య, మంగపేట మండలంలో ఇద్దరు మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌ అనంతరం తిరిగి మావోయిస్టులు ఇన్‌ఫార్మర్‌ నెపంతో మల్లంపల్లి గ్రామానికి చెందిన కోటేశ్వర్‌రావును హత్య చేయడం వంటి సంఘటనల నేపథ్యంలో పోలీసులు అడవిలో ప్రతి అంగుళం జల్లెడపడుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర నుంచి గోదావరి నది దాటుకుని రెండు జిల్లాల్లోకి ప్రవేశిస్తున్నారని పోలీసులు తమ దృష్టిని ఆ దిశగా కేంద్రీకరిస్తున్నట్లు సమాచారం.

డ్రోన్ల సాయంతో గాలింపు

 ఇటీవల పోలీసుల కూంబింగ్‌లో మావోయిస్టుల సామగ్రి పట్టుబడిన నేపథ్యంలో రెండు జిల్లాలతో పాటు సమీప రాష్ర్టాల సరిహద్దుల్లోనూ పోలీసుల డ్రోన్‌ కెమెరాల సాయంతో గాలిస్తున్నారు. రెండు జిల్లాల్లో యాక్షన్‌ టీం సభ్యులు వన్‌ ప్లస్‌ వన్‌ విధానంతో సంచరిస్తూ అధికార పార్టీ నాయకులతో పాటు ప్రజాప్రతినిధులను టార్గెట్‌ చేస్తూ రెక్కీ నిర్వహించినట్లు  నిఘా వర్గాల ద్వారా పోలీసులకు సమాచారం అందినట్లు తెలిసింది. మావోయిస్టు నాయకుడు భాస్కర్‌, యాక్షన్‌ టీం సభ్యుడు భద్రు రెండు జిల్లాల్లో తమ ఉనికిని చాటాలనే తాపత్రయంతో ఉన్నట్లు సమాచారం. 

ఏజెన్సీలో  హాజరు విధానం !

ఏజెన్సీ ప్రాంత గ్రామాల్లో ఇప్పటికే పోలీసులు ప్రతి రోజూ హాజరు విధానం అమలు చేస్తున్నట్లు తెలిసింది. గొత్తికోయ గూడేలు, అపరిచిత వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టారు. వారికి ఆశ్రయం కల్పించొద్దని, భోజనం, చందాలు ఇవ్వకుండా చర్యలు చేపడుతున్నారు. ప్రధాన, అంతర్గత రహదారుల్లో కేంద్ర, స్థానిక పోలీసు బలగాలు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి.  అనుమానిత వాహనాలు, వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. సోమవారం వెంకటాపురం మండలంలో మావోయిస్టుల కరపత్రాలు వెలుగు చూశాయి. పటిష్ట నిఘా ఉన్న తరుణంలో కరపత్రాలు వెలుగుచూడడం చర్చనీయాంశమైంది.

నేటి నుంచి పీఎల్‌జీఏ వారోత్సవాలు

మావోయిస్టుల అనుబంధ పీఎల్‌జీఏ వారోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. పార్టీలో నూతన కేడర్‌ నియామకాలు, పార్టీ బలోపేతం బాధ్యతలను స్థానిక మావోయిస్టు అగ్రనేతలు స్వీకరించినట్లు తెలిసింది. వారోత్సవాల సందర్భంగా ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రతను పటిష్టం చేస్తున్నారు. 

VIDEOS

logo