కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలి

భూపాలపల్లి: భూపాలపల్లి ఏరియాలో రెండు గనుల క్యాంటిన్ల కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ భూపాలపల్లి బ్రాంచి కమిటీ ఉపాధ్యక్షుడు కొక్కుల తిరుపతి డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం భూపాలపల్లి ఏరియా సింగరేణి జీఎం నిరీక్షన్రాజ్ను కలిసి వారు వినతిపత్రం అందజేశారు. అనంతరం తిరుపతి విలేకరులతో మాట్లాడుతూ భూపాలపల్లి ఏరియాలోని కేటీకే1వ గని, కేటీకే 6వ గనుల్లో క్యాంటిన్లను కాంట్రాక్ట్ పద్ధతిన నడిపేందుకు యాజమాన్యం ఒప్పదం కుదుర్చుకుందని అన్నారు. ఈ కాంట్రాక్ట్‌ను రద్దుచేసి ఇంతకు ముందువలే సింగరేణి యాజమాన్యమే నడపాలని డిమాండ్ చేశారు. భూపాలపల్లి ఏరియాలోని కొన్ని గనుల్లో కాంట్రాక్ట్ వర్కర్లతో డస్ట్ చల్లించే విధానాన్ని యాజమాన్యం ప్రవేశపెడుతున్నట్లు తెలిసిందని, దీనిని కూడా విరమించుకోవాలన్నారు. ఈ విధానాలతో సింగరేణి పర్మినెంట్ కార్మికుల ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అన్నారు. ఆయన వెంట టీబీజీకేఎస్ నేతలు కనకయ్య, రాజిరెడ్డి, జగత్రావు ఉన్నారు. కేటీకే1వ, కేటీకే6వ గనుల మేనేజర్లకు ఇవే డిమాండ్లపై ఆ గనుల టీబీజీకేఎస్ ఫిట్ సెక్రటరీలు కొచ్చర్ల రవికుమార్, బాసనపల్లి కుమారస్వామి వినతిపత్రాలు అందజేశారు.