శనివారం 16 జనవరి 2021
Jayashankar - Nov 28, 2020 , 03:06:43

బుగులోని జాతరకు వేళాయే...

బుగులోని జాతరకు వేళాయే...

  • రేపటి నుంచి ప్రారంభం
  • భక్తుల కొంగు బంగారం వేంకటేశ్వరస్వామి
  • ప్రకృతి అందాల మేళవింపు.. రెండవ తిరుపతిగా ప్రసిద్ధి
  • ప్రత్యేక ఆకర్షణగా ప్రభ బండ్లు

ఎత్తయిన గుట్టలు.. పచ్చదనం.. ప్రకృతి చెక్కినట్లు కనిపించే కొండల నడుమ ఏటా కార్తీక పౌర్ణమి రోజున బుగులోని జాతర ప్రారంభమవుంది. కనివిందు చేసే ఆహ్లాద వాతావరణంలో పిలిస్తే పలికే బుగులు వేంకటేశ్వరస్వామి.. కొలిచి మొక్కితే తీరని కోరిక ఉండదనేది భక్తుల విశ్వాసం. కుటుంబసమేతంగా తరలివచ్చి స్వామిని దర్శించుకుంటారు. ఈ జాతరలో ప్రభ బండ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ నెల 29న ఆదివారం ప్రారంభమై మూడు రోజల పాటు వైభవంగా సాగుతుంది.   

- రేగొండ

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలోని తిరుమల గిరి శివారు పాండవుల గుట్టలపై కార్తీక పౌర్ణమి నుంచి బుగులు వేంకటేశ్వరస్వామి జాతర జరుగుతుంది. ఇక్కడ కొలువుదీరిన వేంకన్న భక్తులకు  కొంగు బంగారమై నిలుస్తున్నాడు. ఈ జాతరకు ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల ప్రజలు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.

జాతర ప్రాశస్త్యం..

వేంకటేశ్వర స్వామి, ఆలివేలు మంగ, పద్మావతితో ఆకాశ మార్గాన విహరిస్తుండగా పద్మావతి భూలో కంలో అలసట తీర్చుకుందామనగానే తిరుమల తిరుపతి కొండలపై విశ్రాంతి తీసుకుంటారు. దీంతో ఆది మొదటి తిరుపతిగా పేరుగాంచింది. అక్కడి నుంచి పయనమై రేగొండ మండలంలోని తిరుమలగిరి గ్రామ శివారులో ఆలసట తీర్చుకుంటారు. ఈ క్రమంలో మహిళలు పాటలు పాడుతూ వడ్లు దంచుతున్న శబ్దానికి తనకు నిద్రపట్టడం లేదని స్వామికి చెప్పగానే వేంకటేశ్వరస్వామి బుగులు(భయంతో) ఆ పక్క నే ఉన్న గుట్టలపైకి వెళ్లాడని ప్రతీతి. దీంతో స్వామివారు నడయాడిన ప్రాంతాన్ని రెండవ తిరుపతిగా పిలుస్తారని, నాటి నుంచి బుగులోని వేంకటేశ్వరస్వామిగా పిలుస్తున్నట్లు తెలుస్తున్నది. స్వామి వారు గుట్టపై ఉన్నట్లుగా తెలుసుకోవడానికి గొల్లవారి చల్ల ముంతలు, గొర్రెలు, పశువులు మాయం చేయడంతో ప్రజలు ఆ గుట్టపై వెలిసిన స్వామిని కొలువగానే మళ్లీ యథాస్థానంలో ప్రత్యక్షమయ్యాయని చెబుతుంటారు. అందుకే ఆప్పటి నుంచి కార్తీక పౌర్ణమి రోజున జాతర జరుపుకుంటామని గ్రామస్తులు పేర్కొంటున్నా రు. ఆపరిశుభ్రంగా స్వామి దర్శనానికి వెళ్తే తేనెటీగలు వెంటబడుతాయని భక్తుల నమ్మకం.

నిష్ఠతో జాతర ఉత్సవాలు 

బుగులోని వేంకటేశ్వరస్వామి జతర ఉత్సవాలు తిరుమలగిరి గ్రామస్తులు నిష్ఠతో నిర్వహిస్తారు. 29న స్వామి వారు గుట్టపైకి వెళ్లడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 30న కార్తీక పౌర్ణమిన స్వామి వారికి దీపోత్సవం, ఏనుగు, మేక, గుర్రం ప్రభ బండ్లు ఇప్పచెట్టు చుట్టూ తిప్పుతారు. డిసెంబర్‌ 1న స్వామికి ఆభిషేకం, వాహనాలు తిరగడం, మొక్కులు చెల్లించడం, 2న జాతర ముగుస్తుంది.

జాతరకు వెళ్లడం ఇలా..

జాతరకు వెళ్లే భక్తులు హన్మకొండ నుంచి భూపాలపల్లి, కాళేశ్వరం బస్సులో రేగొండకు చేరుకోవాలి, లేదంటే పరకాలకు వెళ్లే అక్కడి నుంచి ఆర్టీసీ ఆధికారులు జాతరకు ప్రత్యేక బస్సులు నడుపుతారు. రేగొండ నుంచి నిత్యం ప్రైవేట్‌ వాహనాలు అందుబాటులో ఉంటాయి. హన్మకొండ నుంచి 48 కి.మీ, పరకాల నుంచి 18 కి.మీ, భూపాలపల్లి నుంచి 33కి.మీ, రేగొండ నుంచి 8 కిలోమీటర్లు ఉంటుంది.