శనివారం 28 నవంబర్ 2020
Jayashankar - Nov 22, 2020 , 02:16:25

పల్లె ప్రకృతి వనాల్లో వేగం పెంచాలి

పల్లె ప్రకృతి వనాల్లో వేగం పెంచాలి

  • వీసీలో కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య 

భూపాలపల్లి కలెక్టరేట్‌ : పల్లె ప్రకృతి వనాల పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య మండల అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మండలాల్లో గ్రామాల వారీగా చేపట్టిన పల్లె ప్రకృతి వనాలు, చెత్త డంపింగ్‌ యార్డులు, సెగ్రిగేషన్‌ షెడ్లు, వైకుంఠధామాలు, పంట కల్లాల నిర్మాణ పనుల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా  కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో పల్లె ప్రగతి పనులు వేగంగా జరుగుతున్నాయని, ఆయా నిర్మాణాలకు అవసరమైన స్థలాలను అటవీశాఖ, రెవెన్యూశాఖ అధికారుల సహకారంతో పరిష్కరించినట్లు చెప్పారు.

జిల్లాలో ఇప్పటికే పల్లె ప్రగతి పనులు 80 శాతంపైగా పూర్తయినందున ఎంపీడీవోలు, మండల ప్రత్యేక అధికారులు, ఏపీవోలు ప్రత్యేక శ్రద్ధ చూపి మిగతా పనులు త్వరగా పూర్తయ్యేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రధానంగా పంట కల్లాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఏపీవోలు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.  అనంతరం కలెక్టరేట్‌లోని ఈ సెక్షన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లె ప్రకృతి వనాల పనులకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రభుత్వ భూములు అందుబాటులో లేని సింగరేణి  గ్రామాల్లో సింగరేణి భూములు అందుబాటులో ఉంటే  వాటిని పల్లె ప్రకృతి వనాలకు కేటాయించాలని సెక్షన్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావును ఆదేశించారు.