గురువారం 03 డిసెంబర్ 2020
Jayashankar - Nov 22, 2020 , 02:16:05

అనుమతి లేకుండా అధికారులు ఎక్కడికీ వెళ్లొద్దు

అనుమతి లేకుండా అధికారులు ఎక్కడికీ వెళ్లొద్దు

  •  కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య
  • పలు కార్యాలయాల ఆకస్మిక తనిఖీ

భూపాలపల్లి/ భూపాలపల్లి టౌన్‌ : ముందస్తు అనుమతి లేకుండా అధికారులు, సిబ్బంది గైర్హ్హాజరు కావొద్దని, ఇతర పనులకు వెళ్లొద్దని కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జిల్లా పశుసంవర్థక శాఖ, తహసీల్దార్‌, ప్రగతి భవన్‌లోని ఆయా శాఖల  కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.  డీఆర్‌డీఏ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. హాజరు పట్టికను పరిశీలించగా 10 మంది సిబ్బంది అనుమతి లేకుండా గైర్హాజరు అయ్యారు. వెంటనే వారి ఒక రోజు వేతనం నిలిపివేసి తనకు లెటర్‌ పంపాలని హెచ్‌ఆర్‌ మేనేజర్‌ శ్యాంసుందర్‌ను ఆదేశించారు.

కార్యాలయం అపరిశుభ్రంగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఇన్‌చార్జి జిల్లా పశుసంవర్థక శాఖ అధికారిని శ్రీదేవి విధులకు హాజరుకాలేదు. హెడ్‌ ఆఫీసులో మీటింగ్‌కు వెళ్లిందని కార్యాలయ సూపరింటెండెంట్‌ కలెక్టర్‌కు తెలిపారు. తన అనుమతి లేకుండా జిల్లా స్థాయి అధికారులు ఎక్కడికి వెళ్లొద్దని, ఆమె వచ్చిన వెంటనే సంజాయిషీ ఇవ్వాల్సిందిగా సూపరింటెండెంట్‌ను కలెక్టర్‌ ఆదేశించారు. అక్కడి నుంచి వెళ్లి డీఎంహెచ్‌వో కార్యాలయాన్ని తనిఖీ చేశారు. హాజరు రిజిస్టర్‌ పరిశీలించగా అందులో ఏడుగురు సిబ్బంది గైర్హాజరైనట్లు గుర్తించారు.

గౌస్‌ పాషాను డీఎంహెచ్‌వో ప్రభుత్వానికి సరెండర్‌ చేశారని అక్కడ ఉన్న జూనియర్‌ అసిస్టెంట్‌ చెప్పారు. ఎవరిని అడిగి సరెండర్‌ చేశారని ప్రశ్నిస్తూ డీఎంహెచ్‌వోతో ఫోన్‌లో మాట్లాడారు.  అనంతరం తహసీల్ధార్‌ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డు రూము తహసీల్దార్‌ ఛాంబర్‌, వివిధ సెక్షన్లను పరిశీలించారు. ధరణి సేవలను సమర్థవంతంగా అందించాలని, రెవెన్యూ రికార్డులు చాలా విలువైనవని వాటిని చాలా జాగ్రత్తగా భద్రపరచాలని సూచించారు. ఓటరు నమోదు ప్రక్రియను విజయవంతంగా నిర్వహించి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా చూడాలని డిప్యూటీ తహసీల్దార్‌ రవీందర్‌రావును, ఎలక్షన్‌ డీటీ రవి, ఆర్‌ఐ దేవేందర్‌ ఆదేశించారు.