శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Jayashankar - Nov 21, 2020 , 01:58:13

యాసంగి సాగుకు సన్నాహాలు

యాసంగి సాగుకు సన్నాహాలు

  • భూపాలపల్లి జిలాల్లో 97,592 ఎకరాలలో సాగుకు  ప్రణాళికలు సిద్ధం
  • అందుబాటులో  విత్తనాలు, ఎరువులు 

జయశంకర్‌ భూపాలపల్లి, నమస్తేతెలంగాణ:  2020-21 యాసంగి సాగుకు జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారులు సనాహాలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదు కావడంతో యాసంగి పంటలను అదేస్థాయిలో సాగు చేసేందుకు రైతులు ముందుకు వస్తున్నారు. సాగు నీటి వనరులను దృష్టిలో పెట్టుకొని అధికంగా వరి సాగు చేసేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 90,670 ఎకరాల్లో వరి సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. వరి విత్తనాలను, ఎరువులు అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. 

97,592 ఎకరాల్లో పంటల సాగు 

జిల్లాలోని 11 మండలాల పరిధిలో యాసంగి పంటకు వరి పంటను అత్యధికంగా సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నట్లు వ్యవసాయ అధికారులు తెలియజేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వరి 90,670 ఎకరాలు, పెసర 1641 ఎకరాలు, మినుము 1184 ఎకరాలు, కందులు 4 ఎకరాలు, వేరుశనగ 456, మంచి శనగ 778, నువ్వు 928, జొన్న 9, బొబ్బర్లు 369 ఎకరాలు, ఇతర పప్పు ధాన్యాలు 202 ఎకరాలు, ఇతర నూనె  గింజలు 57 ఎకరాలు, కూరగాయలు 838 ఎకరాలు, పండ్ల రకాలు 456 ఎకరాల్లో సాగయ్యే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

అత్యధికంగా వరి సాగు..

జిల్లాలోని 1132కు  పైగా ఉన్న  చిన్న, మధ్య, భారీ సాగు నీటి వనరుల్లో ఇప్పటికీ పుష్కలంగా నీరు అందుబాటులో  ఉండగా అందుకు అనుగుణంగా వరి పంటను అత్యధికంగా సాగు  చేసేందుకు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. వానకాలంలో 93,676 ఎకరాల్లో వరి సాగు చేయగా యాసంగిలో 90,670 ఎకరాల్లో సాగు చేయనున్నారు.  అత్యధికంగా భూపాలపల్లి మండలంలో 13,250 ఎకరాల్లో సాగు చేస్తుండగా పలిమెల మండలంలో అత్యల్పంగా 819 ఎకరాల్లో వరి పంటను సాగు చేస్తున్నారు. మహదేవ్‌పూర్‌ మండలంలో 4121 ఎకరాలు, కాటారంలో 12,273 ఎకరాలు, మహముత్తారంలో 7400 ఎకరాలు, మల్హర్‌రావు మండలంలో 11,619 ఎకరాలు, గణపురంలో 10,541 ఎకరాలు, రేగొండలో 7427 ఎకరాలు, చిట్యాల 9673 ఎకరాలు, మొగుళ్లపెల్లి 6368 ఎకరాలు, టలేకుమట్లలో 7179 ఎకరాల్లో వరి సాగు కానుంది. జిల్లా వ్యాప్తంగా అవసరయ్యే ఎరువులను వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. యాసంగి సాగు కోసం అవసరయ్యే యూరియా  డీఏపీ, ఎంఓపీ, ఎస్‌ఎస్‌పీ, ఏఎస్‌, కాంప్లెక్స్‌ ఎరువులు, నత్రజని, పాస్పెట్‌  పొటాషియం వంటి ఎరువులు బఫర్‌ స్టాకుతో సహా అందుబాటులో ఉన్నట్లు జిల్లా వ్యవసాయ అధికారులు తెలియజేస్తున్నారు. 

శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేయాలి 

రైతులు పంటలను శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేస్తే అధిక దిగుబడులు వస్తాయి. ఎరువులు, విత్తనాలు రైతులకు అందుబాటులో  ఉన్నాయి. రైతులు నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలి. 

-శ్రీనివాస్‌ రాజు, జిల్లా  ఇన్‌చార్జి వ్యవసాయ అధికారి 

VIDEOS

logo