ఆదివారం 07 మార్చి 2021
Jayashankar - Nov 08, 2020 , 03:25:38

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించండి

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించండి

  • జిలాల్లో జనవరి నుంచి 507 ప్రమాదాలు జరిగాయి
  • తరచూ వాహన తనిఖీలు నిర్వహించాలి 
  • కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌

భూపాలపల్లి కలెక్టరేట్‌, నవంబర్‌ 7: ప్రమాదాలు జరుగకుండా వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో రోడ్‌ సేఫ్టీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో గత సంవత్సరం 545, ఈ సంవత్సరం జనవరి నుంచి నేటి వరకు 507 రోడ్డు ప్రమాదాలు జరిగాయన్నారు. ఇక నుంచి జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరుగకుండా వాహనదారులకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న కూడళ్లు, మూలమలుపు వద్ద రవాణా, పోలీస్‌ శాఖ వారు వాహనదారులను హెచ్చరిస్తూ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.

డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని వారు వాహనాలు నడుపకుండా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ, నేషనల్‌ హైవే, పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులు రహదారులకు మరమ్మతులు చేపట్టాలన్నారు.  ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులకు వైద్య సేవలు అందించేందుకు 108 అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ఈనెల మూడో వారంలో రహదారి భద్రత అవగాహన కార్యక్రమాన్ని మూడు రోజులపాటు జిల్లా వ్యాప్తంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఈఈ వెంకటేశ్‌, డీఈ రమేశ్‌, సహాయ మోటర్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌, వైద్యాధికారులు డాక్టర్‌ జైపాల్‌, డాక్టర్‌ భాష్యనాయక్‌, కలెక్టర్‌ కార్యాలయ సూపరింటెండెంట్‌ రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ను సన్మానించిన తుడుందెబ్బ రాష్ట్ర నాయకుడు

లయన్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ వారిచే అంతర్జాతీయ సేవా పురస్కారాన్ని, కన్నడ గ్రూప్‌ ఆఫ్‌ పీపుల్స్‌చే స్టార్‌ ఐఏఎస్‌ అవార్డు పొందినందుకు శనివారం కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ను తుడుందెబ్బ రాష్ట్ర నాయకుడు కుడిమేత సమ్మయ్య దొర మర్యాద పూర్వకంగా కలిసి  సన్మానించారు.

ఈవీఎంలకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలి

కృష్ణకాలనీ : ఈవీఎంలకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ అబ్దుల్‌ అజీమ్‌ అన్నారు. శనివారం  సింగరేణి అంబేద్కర్‌ మైదానంలోని మినీ ఫంక్షన్‌ హాల్లో ఈవీఎంలు భద్రపరిచిన గదిని ఆయన పరిశీలించారు. ఫంక్షన్‌హాల్‌ పరిసరాలు, ఈవీఎంలు ఉంచిన హాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఈవీఎంలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేసి రెవెన్యూ అధికారులు పర్యవేక్షించాలన్నారు. కలెక్టర్‌ వెంట ఆర్డీవో శ్రీనివాస్‌, ఎలక్షన్‌ డీటీ రవీందర్‌రావు, ఆర్‌ఐ దేవేందర్‌, తదితరులు ఉన్నారు.  


VIDEOS

logo