శనివారం 05 డిసెంబర్ 2020
Jayashankar - Oct 27, 2020 , 01:28:24

ఘనంగా దసరా సంబురాలు

ఘనంగా దసరా సంబురాలు

ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు 

దుర్గామాత విగ్రహాల నిమజ్జనం

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఆదివారం దసరా పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం శమీ వృక్షం వద్ద పూజలు నిర్వహించారు. జమ్మి ఆకును సేకరించి తమ ఇండ్ల వద్దకు తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ సంతోషంగా పండుగను జరుపుకున్నారు. ఉదయం గ్రామదేవతలను శుద్ధి చేశారు. సాయంత్రం గ్రామ దేవతలకు సోరకాయను సమర్పించిన అనంతరం యాటపోతును సమర్పించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఉత్సావాల్లో పాల్గొన్నారు.భూపాలపల్లి సింగరేణి ఏరియాలోని బొగ్గు గనుల వద్ద దుర్గామాత ఆలయాల్లో విజయదశమి వేడుకలు నిర్వహించారు. గని అధికారులు, వివిధ కార్మిక సంఘాల నాయకులు సాయంత్రం ఆలయాల్లో, జమ్మిచెట్టువద్ద పూజలు నిర్వహించారు. ములుగు మండలం మహ్మద్‌గౌస్‌పల్లిలో అనవాయితీ ప్రకారం ముస్లింల జెండాను ఆవిష్కరించిన అనంతరం బొడ్రాయి వద్ద పూజలు చేశారు. దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాలకు చివరి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జనం చేశారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. దుర్గామాతకు తొమ్మిది రోజుల పాటు కట్టిన చీరెలకు పలుచోట్ల వేలం నిర్వహించారు. ములుగు జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంకు బండ్‌ వద్ద దుర్గామాత విగ్రహం నిమజ్జనం చేశారు. ములుగు ఎస్పీ కార్యాలయంతో పాటు ఏఎస్పీ కార్యాలయం, పోలీస్‌స్టేషన్లలో, భూపాలపల్లి  ఎస్పీ కార్యాలయంలో ఆయుధ పూజ నిర్వహించారు.