గురువారం 03 డిసెంబర్ 2020
Jayashankar - Oct 24, 2020 , 02:55:48

‘టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థికే ఓటు వేస్తాం’

‘టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థికే ఓటు వేస్తాం’

కృష్ణకాలనీ, అక్టోబర్‌ 23: భూపాలపల్లి మున్సిపల్‌ పరిధిలోని 11వ వార్డులో కౌన్సిలర్‌ భానోత్‌ రజిత జుమ్ములాల్‌ ఆదేశాల మేరకు పట్టభద్రులు 45 మంది ఎమ్మెల్సీ ఓటర్లను గుర్తించి ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేశారు. అనంతరం వారి ఐడీలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డికి అందజేశారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థికే వేస్తామని పట్టభద్రులు తెలిపారు.

ముమ్మరంగా ఓటరు నమోదు

తాడ్వాయి: నార్లాపూర్‌ గ్రామంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బండారు చంద్రన్న ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటింటికీ తిరుగుతూ పట్టభద్రులను కలిసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు పైడిపల్లి అశోక్‌, నాయకులు శివరాజు, సతీశ్‌, రాకేశ్‌, రవి, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలి

ములుగు కలెక్టరేట్‌: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పట్టభద్రులు పేరు నమోదు చేసుకోవాలని తహసీల్దార్‌ మధురకవి సత్యనారాయణ స్వామి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫారమ్‌-18లో వివరాలు నమోదు చేసి ధ్రువీకరణ పత్రాలతో మీ సేవ కేంద్రంలోగానీ ఆన్‌లైన్‌లో సొంతంగా గానీ, తహసీల్దార్‌ కార్యాలయంలోగానీ నవంబర్‌ 6లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

చైల్డ్‌ లైన్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

ములుగు కలెక్టరేట్‌: జిల్లాలో  నూతనంగా ఏర్పడిన చైల్డ్‌లైన్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ ఎస్‌.కృష్ణ ఆదిత్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) ఆదర్శ్‌ సురభి చేతుల మీదుగా చైల్డ్‌లైన్‌ 1098 టెస్టింగ్‌ కాల్స్‌ చేసి హెల్ప్‌లైన్‌ సేవలను  ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పిల్లలు ఈ సేవలను వినియోగించు కోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా బాల సంరక్షణ  భవన్‌ అధికారి, డీడబ్ల్యూవో ప్రేమలత, ఐసీటీపీఎస్‌ టీం సభ్యులు ఓంకార్‌, సఖీ టీమ్‌ వారితో కలిసి జిల్లాలో చైల్డ్‌లైన్‌ సేవలపై ప్రజలకు  అవగాహన కల్పిస్తూ వారితో కాల్స్‌ చేయించారు. చైల్డ్‌లైన్‌ 1098 కౌన్సిలర్‌ ప్రణయ్‌, నగేశ్‌, సుమన్‌, రాంబాబు, రమ్య, గీత పాల్గొన్నారు.

‘గిరిజనులు ఆందోళన చెందొద్దు’

ములుగు కలెక్టరేట్‌: షెడ్యూల్‌ ప్రాంతంలో అక్రమ లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణపై గిరిజనులు ఆందోళన చెందవద్దని కలెక్టర్‌ కృష్ణ ఆదత్య ఒక ప్రకటనలో తెలిపారు. లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు అక్రమ లేఅవుట్‌ రూల్స్‌ 2020తోపాటు తెలంగాణ షెడ్యూల్‌ ఏరియా ల్యాండ్‌ ట్రాన్స్‌ఫర్‌ రెగ్యులేషన్‌ 1959, సవరించిన క్రమబద్ధీకరణ రూల్స్‌ 1970 ప్రకారం చర్యలు చేపడతామని తెలిపారు. షెడ్యూల్‌ ఏరియాలో వ్యవసాయేతర పాస్‌పుస్తకాల జారీకి ఈరూల్స్‌ను అనుసరిస్తామని పేర్కొన్నారు. 2008లో ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాల తిరస్కరణకు గురైన వారికి స్పీకింగ్‌ ఉత్తర్వులకు మాత్రమే షెడ్యూల్‌ ప్రాంతంలో సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు.