శుక్రవారం 04 డిసెంబర్ 2020
Jayashankar - Oct 22, 2020 , 01:35:07

చెరువు నిండుగ.. కనుల పండుగ..

చెరువు నిండుగ.. కనుల పండుగ..

  • ఉమ్మడి జిల్లాకు జలకళ
  • ఐదు జిల్లాల్లో వందశాతం నిండిన తటాకాలు
  • జనగామలో 8మినహా అన్నీ..     
  • ఆరు జిల్లాల్లో మొత్తం చెరువులు 6030
  • అలుగు పోస్తున్నవి : 2804
  • పూర్తిగా నిండినవి : 3218
  • కదిలివచ్చిన ‘కాళేశ్వర’ జలాలు 
  • ఊతమిచ్చిన ‘మిషన్‌ కాకతీయ’
  • తోడైన ఇటీవలి వానలు
  • పల్లెల్లో అద్భుత, అరుదైన దృశ్యాలు

మన పల్లెలు కొత్తందాలను సంతరించుకున్నాయి. ఎటు చూసినా జలకళతో ఉట్టి పడుతున్నాయి. కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల జలాలు కదిలివచ్చి.. ఇటీవలి వానలు తోడై.. ఇప్పటికే మిషన్‌ కాకతీయ పుణ్యమా అని పటిష్టంగా తయారైన చెరువులన్నీ జలసిరులతో తులతూగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 6030 చెరువులకు గాను, 2804 చెరువులు అలుగు దుంకుతూ అలరిస్తున్నాయి. మరో 3218 చెరువులు వందశాతం నిండి కనువిందు చేస్తున్నాయి. వానకాలం పంటలు కోసే సమయంలోనూ నీటి వనరులు మత్తడి దుంకుతుండడంతో యాసంగి ఇక పండుగేనని అన్నదాతల్లో సంబురం కనిపిస్తున్నది. వానకాలం సీజన్‌కు సమంగా ఇప్పుడు యాసంగి సాగయ్యే అవకాశమున్నది. 

వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఉమ్మడి జిల్లాలో చెరువులన్నీ జలకళతో ఉట్టిపడుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన ‘కాళేశ్వరం ప్రాజెక్టు’ వరంగల్‌ ఉమ్మడి జిల్లాకు వరప్రదాయనిగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సారెస్పీ కాలువల మరమ్మతులు చేయించడం మరింత బలాన్నిచ్చింది. దేవాదుల ప్రాజెక్టు రిజర్వాయర్లు, కాలువల పెండింగ్‌ పనులు పూర్తి కావడం కూడా కరువు ప్రాంతాలకు కలిసివచ్చింది. మిషన్‌ కాకతీయ పథకంతో చెరువులు పటిష్టం కావడంతో ప్రాజెక్టుల నుంచి వస్తున్న నీరు, వర్షపు నీరు నిల్వ ఉంటున్నది. ఇక ఏడాదంతా పంటలకు ఢోకా లేదనే భరోసానిస్తున్నాయి. పల్లెల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా చెరువులు అలుగు దుంకుతున్న అద్భుత, అరుదైన దృశ్యాలే కనిపిస్తున్నాయి. 

వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, జనగామ, మహబూబాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 6030 చెరువులు, కుంటలు ఉండగా వీటిలో 2804 చెరువులు మత్తడి పోస్తున్నాయి. మరో 3218 చెరువులు పూర్తిగా నిండాయి. సగటున 75 శాతం నుంచి వందశాతం నిండి ఉన్నాయి. ఆరు జిల్లాల్లో రెండు చెరువులు, ఆరు కుంటలు మినహా అన్నింటికీ జలకళ వచ్చింది. దాదాపు అన్ని చెరువులూ పూర్తిగా నిండి ఉండడం గతంలో ఎప్పుడూ లేదని సాగునీటి శాఖ చెబుతున్నది. ఇప్పుడు వానకాలం సీజన్‌ ముగిసి వరి కోతకు వస్తున్నది. ఈ సమయంలోనూ చెరువులన్నీ మత్తడి దుంకుతుండడంతో ఇక యాసంగికి ఢోకా ఉండదని రైతులు ధీమాతో ఉన్నారు. గతంలో యాసంగికి నాట్ల నుంచే నీటి ఇబ్బందులు ఎదురయ్యేవి. బోర్లలో కొద్దికొద్దిగా వచ్చే నీటిధారతోనే కొద్దిపాటి పంటలు సాగయ్యేవి. వానకాలంతో పోలిస్తే యాసంగిలో సగం విస్తీర్ణంలోనే పంటలు పండేవి. ఇప్పు డు పరిస్థితి పూర్తిగా మారింది. చెరువులన్నీ నిండి, వానకాలానికి సమానంగా యాసంగిలోనూ వరి సాగయ్యే రోజులు వచ్చాయి. 

ఆ చెరువులకు అడ్డంకులు..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలన్నీ నిండి నా, ఆరు కుంటలు, రెండు చెరువుల్లోకి మాత్రం పూర్తిస్థాయిలో నీరు రాలేదు. వీటికి ప్రాజెక్టుల నీళ్లు వచ్చే అవకాశం లేక అవి నిండడం లేదు. రఘునాథపల్లి మండలంలోనే ఇలాంటివి ఐదు కుంటలున్నాయి. ఖిలాషాపూర్‌లోని మాసానికుంట, బంజరబాయి కుంట, వెంకటేశ్వర్ల కుంట, రఘునాథపల్లిలోని మంగళవానికుంట, నిడిగొండలోని ఎర్రకుంట 20 శాతం వరకు నిండాయి. జఫర్‌గఢ్‌ మండలం తిమ్మంపేటలోని బంధంకుంట 75 శాతం నిండింది. స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం తాటికొండలోని మరో కుంట, రఘునాథపల్లి మండలం భాంజిపేటలోని బోడబండ చెరువు నిండాల్సి ఉన్నది. సాగునీటి ప్రాజెక్టులతో వచ్చే నీరు, వర్షపు నీటి ప్రవాహం వీటిలోకి వెళ్లే దారిలో అడ్డంకుల కారణంగానే ఇవి నిండడం లేదని సాగునీటి శాఖ అధికారులు తెలిపారు. వాటిని పరిశీలించి నిండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.